YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

893 కోట్ల ఉపాధి నిధుల పెండింగ్.....

893 కోట్ల  ఉపాధి  నిధుల పెండింగ్.....

నెల్లూరు, జూలై 19, 
ఉపాధి హామీ చట్టం కింద పనులు చేసే కూలీలకు సకాలంలో కూలి చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. గత ఆరు వారాలుగా కూలి చెల్లించకపోవడంతో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాక, చేసిన ఉపాధి పనుల డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడా వారాల తరబడి డబ్బులు చెల్లించకపోతే బతకడం ఎలా? అని కూలీలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.893 కోట్లు ఉపాధి నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాగానే కూలీల ఖాతాల్లోనే నేరుగా వేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో 67.27 లక్షలు జాబ్‌ కార్డులున్నాయి. ప్రస్తుతం 94.04 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఈ ఏడాది కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 20 కోట్ల పనిదినాల్లో జులై 6 నాటికే 17.29 కోట్ల పనిదినాలను పూర్తి చేసి దేశంలోనే ఎపి మొదటి స్థానంలో నిలిచింది. కూలీలకు డబ్బులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న ఉపాధి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్లే ఈ జాప్యం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలి రూ.200 నుంచి రూ.250 వరకూ ఉంటుంది. పనిచేసిన తరువాత రెండు వారాలకోసారి వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమవ్వాలి. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైతే ఒక్కోసారి మూడు నాలుగు వారాలకు జమవుతాయి. ఈసారి మాత్రం ఆరు వారాలు పూర్తి కావస్తున్నా... ఇంకా డబ్బులు పడలేదని చెబుతున్నారు. ఫలితంగా కుటుంబ పోషణకు అప్పులు చేయడం, కిరాణా దుకాణాల్లో అరువుపై సరుకులు తెచ్చుకుంటున్నట్లు వాపోతున్నారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో రూ.120 కోట్లు పెండింగ్‌లో ఉండగా, విజయనగరంలో రూ.33 కోట్లు, శ్రీకాకుళంలో రూ.46 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.91 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.88 కోట్లు, కృష్ణాలో రూ.75 కోట్లు, గుంటూరులో రూ.62 కోట్లు, నెల్లూరులో రూ.77 కోట్లు, ప్రకాశంలో రూ.55 కోట్లు, చిత్తూరులో రూ.65 కోట్లు, అనంతపురంలో రూ.94 కోట్లు, కర్నూలులో రూ.64 కోట్లు, కడపలో రూ.23 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి డబ్బులు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.

Related Posts