
ముంబాయి
దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిలో భారీ వర్షాలతో జనజీవనం స్థింభించిపోయింది. బోరివలీలో వరదల ధాటికి పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరగా ప్రజలు అవస్థలు పడ్డారు. జోరు వానలకు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సోమవారం కూడా ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. వాతావరణ శాఖ ఇదివరకు జారీ చేసిన గ్రీన్ అలర్ట్ను రెడ్ అలర్ట్గా మార్చింది. ముంబయిలో కేవలం 6 గంటల వ్యవధిలోనే 100 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 120 మిల్లిమీటర్ల వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. ముంబయి చెంబుర్, విక్రోలిలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 25 మంది మృతి చెందారు. చెంబుర్ ప్రాంతంలోని భరత్ నగర్ కాలనీలో ఓ ప్రహరీ గోడ కూలి గుడిసెలపై పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మిక్రోలిలో భవనం కూలి ఏడుగురు చనిపోయారు.ముంబయి చెంబుర్, విఖ్రోలిలో జరిగిన ప్రమాదాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు పరిహారంగా అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందిస్తామని తెలిపింది. మరోవైపు మహారాష్ట్ర సర్కారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది ముంబయి మహా నగర పాలక సంస్థ. మంచినీటిని కాచి, చల్లార్చిన తర్వాతే తాగాలని కోరింది. వరదలతో విద్యుత్తు పరికరాలు దెబ్బతిన్నాయని, దాంతో పంపులు, ఫిల్టర్ ప్రక్రియ వ్యవస్థ ఆగిపోయినట్లు పేర్కొంది. .. కొద్ది గంటల్లోనే నీటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించారు.