
న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్ళారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు రూల్ 267 కింద విజయసాయి రెడ్డి నోటీసును అందించారు. అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షులు ప్రకటించడంతో విజయసాయి రెడ్డి సభలోని వెల్లోకి దూసుకువెళ్ళారు. ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు సైతం వెల్లోకి చేరుకని నినాదాలు చేశారు. దీంతో అధ్యక్షులు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేనని తెలిపారు. సభలో విజయసాయి రెడ్డితోపాటు ఇతర పార్టీ సభ్యులు వెల్లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు.