YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రామప్ప దేవాలయం.

రామప్ప  దేవాలయం.

వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యం.. 

నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ..

సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన చారిత్రాత్మక నిర్మాణం రామప్ప దేవాలయం..

ఈ అలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. 

ఆ శిల్పాలు అద్భుతాలే..

కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్‌ డోలరైట్‌ (నల్లశానపు) రాయిని వాడారు. 

???? ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక,నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. 

???? ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. 

???? దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి  చిత్రాలు ఉన్నాయి. 

???? ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి.  

???? రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు.    

రామప్ప గుడి తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ఈ ఆలయం ఖ్యాతిగడించింది. కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు.

రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి.

ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఎన్నో ఉన్నా.. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. తాజాగా రామప్ప ఆలయానికి ఈ ఖ్యాతి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు..

???? ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 

???? రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి.

???? యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది.

???? యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.

???? రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

మోదీ అభినందనలు రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యటకులు సందర్శించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

రామప్పకు వెళ్లే మార్గాలు..

వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. 

రైలు మార్గంలో..

అయితే వరంగల్‌ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. 

బస్సుల ద్వారా.. 

వరంగల్‌ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్‌ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు.

Related Posts