YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కుక్కునూరులో విష జ్వరాల విజృంభణ..

కుక్కునూరులో విష జ్వరాల విజృంభణ..

కుక్కునూరులో విష జ్వరాల విజృంభణ..
వెంటాడుతున్న సీజనల్‌ వ్యాధులు
భయపెడుతున్న డెంగ్యూ
పొంచి ఉన్న మలేరియా, టైఫాయిడ్‌ ముప్పు
 పెరుగుతున్న దోమల బెడద
కానరాని పారిశుధ్య నిర్వహణ
విష జ్వరాలతో ముగ్గురు మృతి
కుక్కునూరు, ఆగస్టు 04
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కరోనాతో అతలాకుతలమైపోయిన ఏజెన్సీమండలాలను ఇప్పుడు సీజన్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్‌ నుంచి తేరుకుంటున్న మండల వాసులను డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు భయపెడుతున్నాయి. కుక్కునూరు మండలంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం దూసుకువస్తుండటంతో విషజ్వరాల వ్యాప్తి మొదలైంది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ గుంతల్లో మురుగునీరి చేరి దోమల బెడద ఎక్కువైంది. వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా, దోమల నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. చాలా మంది జ్వరం, దగ్గు, జలుబు బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఒకప్పుడు జ్వరం వస్తే చాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు నేడు కరోనా భయంతో ప్రైవేట్‌ క్లినిక్‌ ల వద్దనే వైద్యం పొందుతున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్‌ క్లీనిక్‌ లు వద్ద కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాలకు చెందిన
రోగుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. వైద్యానికి వస్తున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు.  మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు నిర్ధారణ కావడంతో రోగులు వేలకు వేలు చెల్లించుకోవాల్సి వస్తుంది. కరోనా లాక్‌ డౌన్‌ తో ఉపాధి కరువైన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. గర్భిణీలు అత్యవసర కేసులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందుతున్నారు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి జ్వర పీడితులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. జ్వరం ఉన్నా కొంతమందికి కరోనా నిర్థారణ కాకపోవడంతో టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ వంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఏడాది కుక్కునూరు మండలంలో ఇప్పటివరకు ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా... అనధికారికంగా మాత్రం చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. భద్రాచలం పట్టణంలోని ప్రవేటు ఆసుపత్రిల్లో  కుక్కునూరు మండలం అమరవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెంకటాపురం గ్రామానికి  చెందిన వర్కా అంజమ్మ(45) అనే మహిళ బుధవారం ఉదయం విష జ్వరంతో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన మోట సత్యం, కొండా మంగమ్మ, సారె విరమ్మ లు చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు జ్వరపీడితులు ఇంటి వద్దే మూలుగుతున్నారు. గతేడాది ఇదే గ్రామంలో కొండా రాజబాబు, శేఖర్ అనే ఇద్దరు యువకులు విషజ్వరంతో మృత్యువాత పడ్డారు. ఈ నెలలోనే  దామరచర్ల గ్రామంలో ఒకరు, అదే విధంగా కుక్కునూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బెస్తగూడెం గ్రామాల్లో మరొకరు  రెండు రోజుల వ్యవధిలో విషజ్వరాలతో మృత్యువాత పడ్డారు.
 దీంతో జ్వరపీడిత కుటుంబీకులు భయాందోళనలకు గురవుతున్నారు.
 గత ఏడాది కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ దృష్ట్యా పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించటంతో సీజనల్‌ వ్యాధులు అంతగా ప్రబలలేదు. ప్రస్తుతం పరిశుభ్రతపై ఎవరూ దృష్టి సారించకపోవడంతో దోమల బెడద ఎక్కువై జ్వరాలు పెరుగుతున్నట్టు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


డెంగ్యూ కేసులేమీ లేవు..

ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరైతే జ్వరంతో మరణించిన లేదా బాధపడుతున్న వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కుటుంబ సభ్యుల గాని,చుట్టుపక్కల ఉన్న వాళ్ళను గుర్తించి 20 మందిని టెస్టు చేసి వాళ్ళ శాంపిల్స్ ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించాము. ఆ పంపించిన శాంపిల్స్ లో డెంగ్యూ పాజిటివ్ నిర్దారణ కాలేదని, ఎవరైనా జ్వరంతో బాధపతుంటే తొలుత కొవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నాం. నెగిటివ్‌ వస్తే వారికి యాంటీబయాటిక్‌ మందులు ఇస్తున్నాం. ప్రైవేట్‌ వైద్యులు పరీక్షలు చేసి పాజిటివ్‌ వస్తే డెంగ్యూ అని చెబుతున్నారు. డెంగ్యూ నిర్థారణ చేసే పరికరాలు కేవలం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయి. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయి తప్పా డెంగ్యూ కేసులు నమోదు కాలేదు. దోమలను నివారించేందుకు యాంటిలార్ల్ ఆపరేషన్ చేశామన్నారు. దోమతెరలు వాడకం చేపట్టాలి. జ్వర పీడితులు ఉంటే సమాచారం ఇవ్వాలి చెబుతున్నమన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని  డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళి క్రిష్ణ అన్నారు. 

Related Posts