YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు ఆంధ్ర ప్రదేశ్

సింధూకు టైముందంట...

సింధూకు టైముందంట...

విజయవాడ, ఆగస్టు 10, 
అంతర్జాతీయ బాడ్మింటర్ క్రీడాకారిణి తాజాగా ఒలింపిక్స్ లో దేశానికి కాంస్య పతకాన్ని తీసుకువచ్చిన పీవీ సింధు మీద వైసీపీ సర్కార్ కోటి ఆశలు పెట్టుకుంది. ఆమెను ముందు పెట్టి ఏపీలో క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడిఉందని చెప్పాలనుకుంటున్నారు. ఇక పీవీఎ సింధుకు జగన్ సర్కార్ వచ్చిన తరువాత మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆమె కాంస్యం గెలుచుకుని వస్తే ముప్పయి లక్షల రూపాయల చెక్కుని అందించారు. దీని కంటే ముందు విశాఖలో రెండు ఎకరాల అతి విలువైన ప్రభుత్వ స్థలాన్ని పీవీ సింధుకు కేటాయించారు. అక్కడ బాడ్మింటన్ అకాడమీని సింధు ఏర్పాటు చేయాలనుకుంటోంది.
విశాఖ మీద మోజు పెంచుకున్న వైసీపీ సర్కార్ క్రీడారాజధానిగా దాన్ని చూపించలనుకుంటోంది. అందులో భాగంగానే పీవీ సింధు అడగగానే విశాఖలోనే భూమిని అప్పగించారు. తాజాగా ఆమె ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా విశాఖలో బాడ్మింటన్ అకాడమీని సత్వరమే ప్రారంభించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఆ పనులు చేపట్టి మరింతమంది సింధులను ఏపీకి అందించాలని కూడా జగన్ ఆమెను కోరారు. దానికి సరేనని చెప్పినా కూడా పీవీ సింధు విశాఖకు రావడం ఇప్పట్లో జరిగేది కాదని అంటున్నారు సన్నిహితులు. పీవీ సింధు మీడియాతో మాట్లాడిన సందర్భంగా తన మనసులో మాటలను బయటపెట్టారు. 2024లో జరిగే ఒలింపిక్స్ లో కూడా పాల్గొని గోల్డ్ మెడల్ దేశానికి తీసుకురావాలి అన్నది తన కలగా ఆమె చెబుతున్నారు. అలా కనుక చేయాలంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలని కూడా భావిస్తున్నారుట. అకాడమీ పనులు మొదలుపెడితే తన కోచింగ్ తో పాటు అటెన్షన్ అన్నీ కూడా అటకెక్కుతాయని పీవీ సింధు భావిస్తోందిట. అందుకే ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అలా కాపాడుకుంటూ 2024 తరువాతనే విశాఖ రావాలని ఆమె పక్కాగా ప్లాన్ చేసుకున్నారని టాక్. విశాఖను క్రీడలకు అతి ముఖ్య స్థావరంగా మార్చాలని జగన్ సర్కార్ ఆశిస్తోంది. ఐటీ పరంగా పెద్ద పీట వేస్తోంది. సినీ రంగాన్ని కూడా ఆహ్వానిస్తోంది. టూరిజం ప్రాజెక్టులు కూడా ప్రారంభించేందుకు ప్రతిపాదిస్తోంది. ఇలా విశాఖే రాజధాని అన్నట్లుగా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలన్నది వైసీపీ పెద్దల ఉద్దేశ్యం. అందులో భాగంగానే పీవీ సింధు అకాడమీ అయినా మొదట ప్రారంభం అయితే విశాఖకు ఎంతో కొంత చేశామని చెప్పుకోవచ్చునని ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారు. కానీ పీవీ సింధు తనదైన ప్రణాళికలతో అకాడమీని కాస్తా లేట్ గానే స్టార్ట్ చేయాలనుకుంటోంది. అదే జరిగితే 2024 నాటికి విశాఖకు ఏ ఒక్క ప్రాజెక్టూ రాకుండానే ఎన్నికలకు వెళ్ళాలా అన్న బెంగ అయితే వైసీపీలో ఉంది. చూడాలి మరి ఈ లోగా వేరే రంగాలలో అయినా ప్రగతి కనిపిస్తుందేమో. ఏది ఏమైనా ఒక్క మాట ఉంది. విశాఖ అభివృద్ధి విషయంలో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్న సామెతగా కధ సాగుతోందనే అంటారు అంతా.

Related Posts