YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఏది తల్చుకుంటే అదే జరుగుతున్న రోజులివి..

ఏది తల్చుకుంటే అదే జరుగుతున్న రోజులివి..

అస్తిత్వ పరీక్షలో కాంగ్రెస్, వామపక్షాలే..

 .దేశ రాజకీయాలలో బీజేపీ అధినేతలు ఏది తల్చుకుంటే అదే జరుగుతున్న రోజులివి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ, అమిత్ షాలు కలకలం రేపేందుకు యత్నిస్తున్నారు. కర్ణాటకలో జెడి (ఎస్), తమిళనాడులో ద్రవిడ పార్టీలు సైతం మినహాయింపు కాదు. ఎటొచ్చీ దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో కాంగ్రెస్, వామపక్షాలే అస్తిత్వ పరీక్షలో ఉన్నాయి.ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ కనుక జనసంఘ్‌ను కూడా కాంగ్రెసేతర పార్టీల కూటమిలో చేర్చి ఉండకపోతే జనసంఘ్‌కు జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యత లభించి ఉండేదా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రూపంలో ‘ఇంతింతై.. వటుడింతయై అన్నట్లు ఎదిగి ఉండేదా’ అని ప్రశ్నలు వేసేవారు చాలా మంది ఉన్నారు. కాని రాజకీయాల్లో అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని విస్తరించడం అనేది అభ్యంతరకరం ఎలా అవుతుందని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.

ఈ ఎదుగుదల ఎలా జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాగా తెలుసు. 1995లో చండీగఢ్‌లో ఒక యువ మోర్చా నేత ఇంటి ఔట్ హౌస్‌లో ఒక గదిలో మోదీ బస చేసి హర్యానా, పంజాబ్, హిమాచల్‌ లలో బిజెపిని విస్తరింపచేసే బాధ్యత తీసుకున్నారు. మొదటి లక్ష్యం చండీగఢ్‌ను జయించడం. అప్పటివరకూ అక్కడ బిజెపి విజయం సాధించ లేదు. చండీగఢ్‌ అంతా తిరిగి ప్రజలతో మోదీ సంబంధాలు పెట్టుకున్నారు. పార్టీని పటిష్ఠం చేశారు. తొలి సారి కంప్యూటర్ వ్యవస్థ ప్రవేశపెట్టారు. 1996 డిసెంబర్‌లో చండీగఢ్‌ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి-–అకాలీదల్ కూటమి 20 స్థానాలకు గాను 19 సీట్లు గెలిచింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కూడా చండీఘడ్ బిజెపి కైవశమైంది. వాజపేయి 14 రోజుల ప్రభుత్వానికి అకాలీదళ్ మద్దతునిచ్చేలా చేసిన మోదీ, ఆ తర్వాత బిజెపి–-అకాలీదళ్ మైత్రి మరింత బలపడేలా చూశారు. తత్ఫలితంగానే పంజాబ్‌లో అకాలీదళ్–బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.

1995లో మోదీ అడుగుపెట్టేనాటికి హర్యానాలో కూడా బిజెపికి అంత బలం లేదు. 1991 లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలో పోటీ చేసిన పది సీట్లలో 9 సీట్లలో బిజెపి డిపాజిట్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 80 సీట్లకు పోటీ చేసి రెండు సీట్లు దక్కించుకుంది. హర్యానాలో బిజెపి స్వంతంగా అధికారంలోకి రాలేదని మోదీ గ్రహించారు. తొలుత బన్సీలాల్ నేతృత్వంలోని హర్యానా వికాస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 1996 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన ఆరు సీట్లలో 4 సీట్లు దక్కించుకునేలా చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 11 సీట్లు లభించాయి. రెండు పార్టీలూ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత బన్సీలాల్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకుని భారత జాతీయ లోక్ దళ్ నేత చౌతాలాకు స్నేహహస్తం చాచారు. అప్పుడు హర్యానా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ టక్కర్ తో సహా పార్టీ నేతలందరికీ మోదీయే కంప్యూటర్ లో శిక్షణ నిప్పించారు.

హిమాచల్ లో కూడా మోదీ చక్రం తిప్పారు. తొలుత హిమాచల్ క్రాంతి మోర్చా అన్న చిన్న పార్టీని బిజెపిలో విలీనం చేసుకున్నారు. తర్వాత సుఖ్ రామ్ ఆధ్వర్యంలోని హిమాచల్ వికాస్ కాంగ్రెస్ తో చేతులు కలిపి వీరభద్ర సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రేమ్ చంద్ దుమాల్ ముఖ్యమంత్రి అయ్యేలా చూశారు. క్రమంగా హిమాచల్ లో కాంగ్రెస్ కు బిజెపి ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది.

ఈశాన్యంలో బిజెపి విస్తరించిన తీరు ఆసక్తికరంగా ఉన్నది. అస్సాంలో అస్సాం గణపరిషద్, బోడో పీపుల్స్ ఫ్రంట్ తో చేతులు కలిపి హిందూ జాతీయవాదం, అక్కడ ఉపజాతి భావోద్వేగాలను మేళవించి ఘన విజయం సాధించిన బిజెపి, ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిని ఏర్పర్చి విస్తరిస్తోంది. తొలుత అరుణాచల్, మణిపూర్ లలో ప్రభుత్వాలను ఏర్పర్చిన బిజెపి కొద్ది రోజుల్లో జరగబోయే మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో కూడా కాషాయ ధ్వజం ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం హిమాచల్ లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అక్కడ ఒకప్పుడు బిజెపితో చేతులు కలిపిన చిన్నా చితక పార్టీలేమీ లేవు. ఒకప్పుడు ఇందిరాగాంధీ కుడిభుజంగా ఉండి అనేక పదవులు అనుభవించిన బన్సీలాల్ తర్వాత స్వంత పార్టీ పెట్టుకుని బిజెపి తో చేతులు కలిపి అనామకంగా మరణించారు. హర్యానా వికాస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమై అంతర్దానమైంది. పంజాబ్ లో అకాలీదళ్ తో బిజెపి స్నేహం సాఫీగా ఏమీ గా సాగడంలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపి స్వంతంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. గురుద్వారాల్లో ప్రవేశించేందుకు ఉత్సాహపడుతోంది. 1984లో సిక్కుల ఊచకోతపై కేసును తిరగదోడి సిక్కుల మద్దతును కూడగట్టాలనుకుంటోంది.

హిందువులు, సిక్కులు ఒకటేనన్న ప్రచారం సాగుతోంది. ఈశాన్యంలో బిజెపితో చేతులు కలిపిన చిన్నా చితక పార్టీలు కూడా తర్వాతి కాలంలో అస్తిత్వ పరీక్షను ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కాశ్మీర్ లో బిజెపితో చేతులు కలిపిన పిడిపి పూర్తి విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఒక్క బిహార్ లోనే నితీశ్ కుమార్ తో బిజెపి ప్రేమబంధం ఇప్పటికి ఎటువంటి చిటపటలు లేకుండా సాగుతోంది. ఒడిషాలో ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన బిజూజనతాదళ్ కు వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా మారి గట్టి పోటీ నిచ్చేస్థాయికి ఎదిగింది. పశ్చిమ బెంగాల్ లో కూడా వచ్చే ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీ ఇస్తుందని ఇటీవల ఒక సర్వే తేల్చింది. తృణమూల్ కూడా ఒకప్పుడు బిజెపితో చేతులు కలిపి బయటపడ్డ పార్టీయే.

మహారాష్ట్రలో తన చిరకాల భాగస్వామి అయిన శివసేనను కూడా అధిగమించాలని బిజెపి భావిస్తోంది 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన మంగళవారం ప్రకటించడంతోనే బిజెపితో ఆ పార్టీ ఎలా వేగలేకపోతోందో అర్థమవుతోంది. గత మూడు సంవత్సరాలుగా నరేంద్రమోదీ తమను తొక్కి పెట్టేందుకు అనుసరిస్తున్న విధానాలు, ఆర్థిక విధానాలను శివసేన కారణాలుగా చూపుతోంది, గతంలో మాదిరి బిజెపికి శివసేన అంత అవసరం లేదు. రిపబ్లికన్ పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పార్టీ వంటి చిన్న పార్టీల మద్దతును సమీకరిస్తూ మహారాష్ట్రంలో బిజెపి స్వతంత్రంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ముంబాయి మునిసిపల్ ఎన్నికల్లోనూ, గుజరాత్ లోనూ శివసేన వేరుగా పోటీ చేసినా బిజెపి లెక్క చేయలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో శివసేన తమతో కలిసి పోటీ చేయకపోయినా మోదీ పట్టించుకునే అవకాశం లేదు.

 

నిజానికి కాంగ్రెస్ ముక్త భారత్ ను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కాని వారిద్దరి లక్ష్యం ప్రాంతీయ లేదా ఆయా రాష్ట్రాలకు పరిమితమైన పార్టీలను అంతం చేయడమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో తన, మన అన్న భేదాన్ని బిజెపి ఏమీ పాటించదలుచుకోనట్లు మిత్రపక్షాలతో అనుసరిస్తున్న వైఖరిని బట్టి అర్థమవుతోంది. ఒక మిత్రపక్షం ఉండగానే మరో పార్టీకి ప్రేమ సంకేతాలు పంపడం, తమ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అవసరమైనంత అండదండలివ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మిత్రపక్షాలే కాదు, ఏ పార్టీని బిజెపి నిద్రపోనివ్వడం లేదు. అయిదేళ్ల క్రితం తనను నిలువరించి ఢీకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ను అంతం చేసేందుకు బిజెపి ఆది నుంచీ ప్రయత్నాలు చేస్తున్నది. కేజ్రీవాల్ కు అష్టకష్టాలు సృష్టించడం మోదీకి క్రీడా వినోదంలా కనపడుతోంది. లేకపోతే రెండురోజుల్లో పదవీ విరమణ చేస్తానని తెలిసి కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్, గుజరాత్ మాజీ అధికారి ఎటువంటి విచారణ లేకుండా 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా నిర్ణయించడమేంటి, ఆ వెంటనే ఆదివారం నాడు కూడా ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆ నిర్ణయానికి ఆగమేఘాలపై ముద్రవేయడమేమిటి అన్న ప్రశ్నలు తలెత్తేవే కావు. కాంగ్రెస్ హయాంలో లాభసాటి పదవులు పాత తేదీ నుంచి కొనసాగించవచ్చనే బిల్లుకు 2006లో పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఆమోదించిన చరిత్ర ఉండగా, అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇదివరకటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అదే రీతిలో పాతతేదీతో పదవులు ఆమోదించవచ్చని కేజ్రీవాల్ సర్కార్ చేసిన బిల్లును తిరస్కరించడంలో మతలబు ఏమిటి అన్న సందేహానికి కూడా విలువ లేకుండా పోయింది. బిజెపి అధినేతలు ఏది తల్చుకుంటే అదే జరుగుతున్న సమయంలో భారతీయ సంప్రదాయంలో అమూల్యమైన హేతుబద్దత, తర్కం అనేవాటికి దేశంలో చోటులేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

అయినా బిజెపి దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ రాజకీయాల్లో వేలుపెట్టలేదని అనుకోవాలి? ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి తలదూర్చి సాధ్యమైనంత ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ అన్ని పార్టీలు బిజెపి రాజకీయ ప్రభావానికి గురవుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ, అమిత్ షాలు కలకలం రేపేందుకు యత్నిస్తున్నారు. కర్ణాటకలో జెడి (ఎస్), తమిళనాడులో ద్రవిడ పార్టీలు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో కాంగ్రెస్, వామపక్షాలే అస్తిత్వ పరీక్షలో ఉన్నాయి. 1975లో జనసంఘ్ ను సామ్రాజ్యవాద శక్తిగా, ఆర్ఎస్ఎస్ ను పారామిలటరీ ఫాసిస్టుగా అభివర్ణించిన సుందరయ్య వాటితో కలిసి పనిచేయాలన్న సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ మెజారిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు 42 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలన్న తన ప్రతిపాదన కాదన్నందుకు సీతారాం ఏచూరి పదవుల నుంచి తప్పుకుంటానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ‘చరిత్ర పునరావృతమవుతుంది ఒకసారి విషాదంగా, మరోసారి బూటకపు ప్రహసనంగా’ అని కార్ల్ మార్క్స్ ఊరికే అనలేదు.

Related Posts