YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొఠియా గ్రామాలపై ఒరిస్సా కన్ను

 కొఠియా గ్రామాలపై  ఒరిస్సా కన్ను

విజయనగరం, ఆగస్టు 21, 
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విజయనగరం జిల్లా సాలూరుకు అటు, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాకు మధ్యలో కొటియా గ్రూపు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. పట్టు చెన్నేరు గ్రామ పంచాయతీలో 12, పగులు చెన్నేరులో నాలుగు, గంజాయిభద్రలో 13, సారికలో రెండు, కురుకూటిలో రెండు, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936లో ఒడిశా, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వారిని ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి.దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది. అయితే కొటియా గ్రామస్తులంతా ఆంధ్రాకి చెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు.వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతోపాటు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. అలాగే, ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని తమకూ వర్తింపజేయాలని కొటియా గ్రామస్తులు కోరుతున్నారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కొనసాగాయి. వైఎస్సార్‌ హఠాన్మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొటియా గ్రామాలను పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వమైతే పూర్తిగా కొటియా ప్రజలను విస్మరించింది. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహంతో కోరాపుట్‌కు చెందిన అధికారులు, రాజకీయ నేతలు కొటియా గ్రామాలపై కన్నేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే కొటియా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది గమనించిన ఒడిశా నేతలు ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.180 కోట్లు మంజూరయ్యాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కొటియా ప్రజల పరాబ్‌ పండుగకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. కొటియాలో పది పడకల ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్, పాఠశాలల వంటి శాశ్వత భవనాల నిర్మాణ పనులను ఆగమేఘాలపై చేస్తున్నారు.

Related Posts