YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దగ్గర-దూరం

దగ్గర-దూరం

కొంతమంది గురువులు చెబుతారు. కొందరు చూపుతారు. దేనిని కాదనలేము. ఏది ఏ శిష్యుడికి అవసరమన్నది ఆ శిష్యుడి అవగాహన పరిమితులపైన ఆధారపడి ఉంటుంది. శిష్యుడు ఇతర వ్యాపకాలను విసర్జించి, గురుబోధను శ్రవణ, మనన ప్రక్రియలతో అన్వయం చేసుకుంటే గురు, శిష్యుల బంధం ఫలించినట్లే. అన్వయంతో పాటు ఆచరణ కూడా అవసరమే. ఇవన్నీ సమన్వయమైతే విద్య వికసించినట్లే.

ఆధ్యాత్మిక సత్యాలపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, భేషజం మరింత ఎక్కువ పాలు ఉన్న ఒక వ్యక్తి ఒక ప్రఖ్యాత గురువు వద్దకు వెళ్లాడు. కుతూహలం ఎక్కువ ఉండి, నిజమైన ఆసక్తి అంతంతమాత్రంగా ఉన్న వ్యక్తి ఇతడు. మొదట గురువు ఉన్న పరిసరాలను అన్నింటినీ పరిశీలించాడు.

గురువు తపోవనం పక్కనే గంగానదీ ప్రవాహం, ఎంతో చక్కటి వృక్ష సంపద… ప్రశాంతత ఆ ప్రదేశం అంతటినీ పరచుకుని ఉంది. గురువు ప్రవచనం ముగింపునకు వచ్చింది. “ఏమన్నా సందేహాలుంటే అడగండి!” అన్నారు గురువులు. గురువును ఆటపట్టించడంలో ఆసక్తి కలిగిన ఈ వ్యక్తి, తన ప్రతిభను చాటుకోడానికి ఓ అవకాశం వచ్చినట్లుగా తలపోశాడు. “స్వామీజీ! ఎంతో దూరం నుంచి, ఎంతో శ్రమపడి వచ్చిన వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ, మీ కుటీరానికి దగ్గరలోనే, చుట్టు పక్కలనే ఉన్నవాళ్లు ఎక్కువ మంది మీ దగ్గరకు రావడం లేదే! ఎందుకని?” ఇదీ అతని శంక.

ప్రశ్న అందరినీ చికాకు పరిచింది. “స్వామి చెప్పినది మననం చేసుకుని, ప్రశాంతంగా వెళ్లిపోయి, దానిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయకుండా ఈ అసందర్భమైన ప్రశ్న దేనికి? ఇది ఒక రకమైన తుంటరితనం కాదా?” అని విసుక్కుంటున్నారు ఆ శ్రోతలు. అయితే, ఆ మహానుభావుడిలో ప్రశాంతత స్థిరంగా ఉంది. చికాకు పడే చిహ్నాలేమీ కనిపించలేదు. నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశారు- “మంచి సందేహమే! నువ్వు ఎక్కడుంటావు?” అతడు బింకంగా సమాధానమిచ్చాడు- “ అవన్నీ అవసరమా స్వామీ! నాప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పండి!”

గురువు నవ్వుతూ పీఠం నుంచి లేచారు. “నాతో రా!” అన్నారు. ఆయన ఉంటున్నది గంగ పక్కన. ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది గంగ. ఆ పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ మహాత్ముడు మందమందంగా నడుస్తున్న వైఖరి కన్నుల పండువగా ఉంది. వారితో వారి శిష్య బృందం ఒక చోట ఆగారు. ఆ ప్రదేశంలో ఒక ఆవు ఒక గుంజకి కట్టి ఉంది. అది అసహనంతో కట్టు తెంపుకుని వెళ్లడానికి బలమంతా సమీకరించుకుని ప్రయత్నిస్తోంది. “ ఆ ఆవే నీప్రశ్నకు సమాధానం. ఆలోచించుకో!” అన్నారు గురుదేవులు.

ప్రశ్న వేసిన ఆకతాయితో సహా అక్కడున్న అందరూ ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోయారు. గురువుగారు తన చూపును మరో వైపు సారించారు. అటు వైపుగా ఒక ఆవుల మంద హాయిగా, స్వేచ్ఛగా నది ఒడ్డున- మెడగంటల సంగీత ధ్వనులు చెవికి ఇంపుగా వినిపిస్తుండగా – నడుస్తూ ఒక రేవులో గంగాజలాన్ని తాగుతున్నాయి. అక్కడ గుంజకి కట్టి ఉన్న ఆవు గింజుకుంటోంది.

“ అర్థం కాలేదా? సరే, వినండి! గంగానదికి పక్కనే ఉన్నా, గుంజకు కట్టిన ఆ ఆవు ఆ నీటితో దాహాన్ని తీర్చుకోలేదు. ఎవరైనా వచ్చిదాని దాహాన్ని తీర్చాల్సిందే. స్వేచ్ఛ లేనిదే అది ఏమీ చేయలేదు. మరి గంగకు దూరంగా ఉన్నా ఆవులు వచ్చి, హాయిగా తమ దాహాన్ని తీర్చుకోగలుగుతున్నాయి. కారణం అవి గుంజకు కట్టి లేవు. గురువు సమక్షంలో కొందరు కొంటె సందేహాలతో కాలం వెళ్లబుచ్చుతారు. మరి కొందరు స్వేచ్ఛ, చనువు ఉన్నప్పటికీ అలాంటి ఆకతాయి పనులకు దిగక, తమ లోపలి దాహాన్ని తీర్చుకుందామనుకుంటారు. అలాంటి నిజమైన తపన, వ్యాకులత ఉంటే మందలోని ఆవుల మాదిరిగా మెడతాళ్లని గురువు తప్పక తెంపేస్తారు. మీరు దగ్గరగా వెళ్లవలసినది దేవాలయానికి అని అనుకోకండి వెళ్లవలసింది దైవానికి దగ్గరగా!”

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో 

Related Posts