YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఆర్టీసీలో వీఆర్ఎస్ కలకలం

ఆర్టీసీలో వీఆర్ఎస్ కలకలం

హైదరాబాద్, ఆగస్టు 30,
ఆర్టీసీ కార్మికులను ఇంటికి పంపే ప్రక్రియ దాదాపు సిద్ధమైంది. సంస్థలో పని చేస్తున్న కార్మికులను సగానికిపైగా తగ్గించనున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), కంపల్సరీ పదవీ విరమణ స్కీం (సీఆర్ఎస్)ను వర్తింపచేయనున్నారు. సంస్థ నుంచి బయటకు పంపే కార్మికులకు రిటైర్మెంట్బెనిఫిట్స్ ఇచ్చేందుకు సంస్థ భూములనే అమ్మకానికి పెడుతున్నారు.ఇక్కడ ఈ భూములు అవసరం లేదు.. అనవసరంగా ఉంటున్నాయి..” అనే కారణాన్ని చూపుతూ ఏడు ప్రాంతాల్లో భూముల అమ్మకానికి ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. తాజాగా ఆర్టీసీ ఎండీగా నియామకమైన సజ్జనార్ తొలి టాస్క్కూడా ఇదే. సంస్థకు ఉన్న సొంత బస్సులను కూడా తగ్గించనున్నారు. మరిన్ని రూట్లను ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. దీనిపై సమగ్ర నివేదిక రెడీ అయింది.ఆర్టీసీలో వీఆర్ఎస్, సీఆర్ఎస్‌కు కార్మికుల వయస్సు, సర్వీసును ప్రాధాన్యతగా తీసుకోనున్నారు. ఈ లెక్కన 21,680 మందిని బలవంతంగా ఇంటికి పంపనున్నారు. ప్రస్తుత నివేదికల ప్రకారం ఆర్టీసీలో 52 ఏండ్ల వయస్సు దాటిన కార్మికులు 22వేలకుపైగా ఉండగా.. వీరిలో కొంతమందిని పోలీస్, ఫైర్, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలకు డ్రైవర్లుగా పంపించారు.జాబితా నుంచి తొలగించగా.. 52 ఏండ్ల వయస్సు పైబడిన వారు 21,680 మంది ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారు. వీరిలో 34 ఏండ్ల సర్వీసును పూర్తి చేస్తున్న కార్మికులు 16,540 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. దాదాపు 10 రోజుల నుంచే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో కార్మికులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో కొత్త నియామకాలను బ్రేక్వేశారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు.2019 నుంచి మొత్తం ఆపేశారు. అంతకుముందు ఒకరిద్దరిని నియమించినా.. 2019 తర్వాత మొత్తానికి ఆపేశారు. 2019లో 51,762 మంది కార్మికులుంటే.. ప్రస్తుతం 49,758 మంది కార్మికులు ఉన్నారు. ఇక మొత్తం 9,705 బస్సులుండగా.. ఇందులో 6,578 బస్సులు సంస్థకు చెందినవి. మరో 3,127 అద్దె బస్సులు. సొంత బస్సుల్లో జూలై నుంచి 1100 సర్వీసులను పక్కనపెట్టారు.ఇవి కాలం చెల్లటంతో రోడ్డెక్కించడం లేదు. వీటితో పాటుగా ఈ ఏడాది 5,100 రూట్లను ప్రైవేట్‌కు అప్పగించారు. ఆర్టీసీలో ఒక్కో బస్సుకు సగటున ఆరుగురి కన్నా తక్కువగా పనిచేస్తున్నారు. రూట్ల ప్రైవేటీకరణ, కాలం చెల్లిన వాటి అమ్మకం తర్వాత ఒక్కో బస్సుకు 11 మంది కార్మికులు పనిలో ఉంటున్నారు. ఇది భారంగా మారుతున్నదంటూ సర్కారుకు ఆర్టీసీ నుంచి నివేదిక వెళ్లింది. ఈ క్రమంలో కార్మికులను ఇంటికి పంపించడం తప్పదంటున్నారు.ప్రస్తుతం ఆర్టీసీ రెండు, మూడు ప్లాన్‌లను నివేదికల్లో పేర్కొంటున్నది. వీఆర్ఎస్ను అనుసరిస్తే ఉద్యోగులకు కచ్చితంగా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను చూపించాల్సి ఉంటున్నది. అసలే కష్టాల్లో ఉన్న సంస్థపై ఇది మరింత భారం. ఉదాహరణగా 30 నుంచి 34 ఏండ్లలోపు ఉద్యోగం చేరి 18 ఏండ్ల సర్వీసును పూర్తి చేస్తున్న కార్మికుడికి ఇంకా మిగిలి ఉన్న సర్వీసు కాలానికి కనీసం రూ. 30 నుంచి రూ. 35 లక్షల ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుంది.తీసుకునే జీతాలను బట్టి కొంత ఆర్థిక ప్యాకేజీ మారుతుంది. అంటే 52 ఏండ్లు పూర్తి చేస్తున్న వారిని ముందుగా పంపించనున్నారు. ఇలా 52 ఏండ్లు నిండి, 34 ఏండ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు సంస్థలో ఇప్పుడు 21,680 మంది ఉన్నారు. ఇక 50 నుంచి 52 ఏండ్లు నిండిన కార్మికులను తీసివేయాలంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) బెటర్ అని కూడా నివేదికల్లో పేర్కొన్నారు. ఈ స్కీం కింద గ్రాట్యుటీ బెనిఫిట్స్‌తోపాటు అదనంగా కొంత మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. కార్మికులు సీఆర్ఎస్‌కు ఒప్పుకుంటే బెనిఫిట్స్ తీసుకొని రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై సుదీర్ఘంగా నివేదించారని అధికారులు చెబుతున్నారు.ఆర్టీసీ కార్మికులను ఎలా ఇంటికి పంపించాలనే ప్లాన్ఒకవైపు ఉంటే.. వారికి బెనిఫిట్స్ఎలా అనే దానిపై కూడా సంస్థ తరఫున కీలకమైన సమాచారాన్ని పొందుపర్చారు. కొన్ని ఆస్తులు తమకు వినియోగంలో లేవని, అద్దె కూడా సరిగా రావడం లేదనే సాకును చూపుతూ భూములను అమ్మనున్నారు.గ్రేటర్ పరిధిలో నాలుగు చోట్ల (ముషీరాబాద్–1,2, మియాపూర్‌తో పాటు బస్భవన్ సమీపంలోని కొంత స్థలం) అమ్మేయాలని భావిస్తున్నారు. అదే విధంగా నిర్మల్, యాదాద్రి, కరీంనగర్‌లో కూడా ఆర్టీసీ భూములను లీజుకు ఇచ్చారు. ఇక్కడ సరిగా అద్దె రావడం లేదని, వీటిని అమ్ముకోవడమే మంచిదంటున్నారు. ఇలా ఆస్తుల అమ్మగా వచ్చిన డబ్బుతో కార్మికులకు సెటిల్మెంట్ చేయనున్నారు.ఇప్పటికే కొంతమందిని ఇతర శాఖల్లోకి పంపించగా.. మరికొందరిని షీ టాయిలెట్లకు డ్రైవర్లుగా, కార్గో సేవల్లో వినియోగించుకున్నారు. దీనిపై చాలా ఆరోపణలు వస్తున్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. ఇంకా కొంతమంది డ్రైవర్లను మున్సిపల్, పోలీస్, ఆర్అండ్బీ వంటి శాఖలకు పంపే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
మొత్తం ఆర్టీసీ కార్మికులు : 49,758
52 ఏండ్ల వయస్సు పైబడిన వారు : 21,680
వీరిలో 34 ఏండ్ల సర్వీసు పూర్తి అయిన వారు : 16,540.
వీఆర్ఎస్, సీఆర్ఎస్కు ప్రమాణాలు పరిగణలోకి తీసుకునే అంశం : 52 ఏండ్ల వయస్సు పైబడటం. లేకుంటే 34 ఏండ్లు సర్వీసు పూర్తి చేసుకోవడం.ఇప్పటి వరకు ఇతర శాఖలకు పంపించింది : 2600కుపైగా డ్రైవర్లువీఆర్ఎస్, సీఆర్ఎస్ తీసుకుంటే 21 వేలమందికి సెటిల్మెంట్స్ కింద చేయాల్సిన సొమ్ము రూ. 5 వేల కోట్లు.

Related Posts