YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కృష్ణాష్టమి... శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి

కృష్ణాష్టమి... శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి

కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః"

శ్రీకృష్ణుడు అంటే హిందూ మతానికి, హిందూ ధర్మానికి అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తురాకుండా హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చును. అంతేకాదు నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు.  శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు.  కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదో గర్భంలో జన్మించాడు. భాగవతం దశమస్కందం మూడవ ఆధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు 'ప్రజాపతి' నక్షత్రం ఉందని తెలుపుతున్నది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం.  విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం - 5 వ అంశం ( శ్లోకం - 26 ) ఆధారంగా శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడనీ, అందులోనూ బహుళ పక్షంలో అష్టమి తిధి జరుగుతుండగా జన్మించడం జరిగిందని ఆధారంగా కనబడుతుంది.  'హరి వంశం' సంస్కృత మూలం తీసి చూసినట్లైతే 52 ఆశ్వాసంలో పైన చెప్పిన తిధి, వారం, నక్షత్రం అన్ని కుడా జ్యోతిష గణాంకం ప్రకారం సరిపోతుంది.  భాగవతం ఆధారంగా చూస్తే అర్ధరాత్రి కాలంలో శ్రీకృష్ణుడి జననం జరిగిందని తెలుస్తుంది.  కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఉట్టి కట్టి యువతరం పోటీపడి కొడతారు.  అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని ప్రాంతాల వారిగా పిలుస్తారు.  భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది.  కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు.  మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది.  ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మావిడాకు తోరణాలు, వివిధ పూవులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి.. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు.పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.  కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి.  ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి.  శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు.రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం భగవద్గీత . కృష్ణాష్టమి రోజున కృష్ణుని భక్తి శ్రద్దలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కందపురాణం చెబుతుంది.  ఆరోజు గోమాతకు గ్రాసం తినబెట్టి మూడు ప్రదక్షిణలు చేస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యత్ పురాణం చెబుతుంది.  అంతే కాకుండా ఈ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతానగోపాల మంత్రంతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.అదే విధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ ఉంటే పరమాత్ముని కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు.   శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే.. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇలా అనేక రకాలుగా స్వామిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి. 

"చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు"

"వసుదేవ సుతం దేవం - కంస చాణూర మర్దనం దేవకీ పరమానన్దం - కృష్ణం వందే జగద్గురుమ్.

"కృష్ణం వందే జగద్గురుమ్" అని సకల జాతులవారూ ఆ పరమాత్మను స్తుతిస్తారు. ధర్మమునకు హాని, అధర్మమునకు  అభ్యుత్థానం జరిగినపుడు, ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకొంటాడు.  సకల లోకేశ్వరుడు, ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యెుక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణమాసం, కృష్ణ పక్షం, అష్టమి.  ఒకప్పుడు వేలకొలది రాక్షసులు ద్వాపరయుగం చివరి పాదంలో మహారాజుల వంశములో జన్మించారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాల, దంతవక్త్రాదులు, కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు. వీరి పరిపాలనను భూమి తట్టుకోలేక పోయింది. గోరూపం  ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించింది. బ్రహ్మ ఆమెను ఓదార్చి, ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీహరి వారికి అభయం యిచ్చి కనబడకుండా వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేస్తానని వరమిచ్చాడు.  అలా వరమిచ్చిన స్వామి వారు శ్రావణమాసంలో బహుళాష్టమీ తిథినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్ఛ స్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు.  125 సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు. భూభారం తొలగించాడు. అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని "భగవద్గీత" ను లోకానికి అర్జునుడనే శిష్యుని మిషతో అందించాడు.  జగద్గురుడంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకరుల వంటివారు అన్నారంటే దానికి కారణం భగవద్గీతయే.  భగవంతుడు 22 అవతారాలు ఎత్తుతాడనీ, వాటిలో 21 అంశావతారాలనీ, ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణావతారమనీ శ్రీమద్భాగవతం చెబుతోంది. 

 "ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్" అని వ్యాసుడన్నాడు.  ఇంతటి శ్రీకృష్ణావతారాన్ని లోకానికి అందించిన పవిత్రమాసం శ్రావణ మాసం. ఈ తిథినాడు శుచిగా  ఉండి, శ్రీకృష్ణుడిని పది తులసీదళాలతో పూజిస్తూ,  

1) కృష్ణాయ నమః,

 2) విష్ణవే నమః

3) అనంతాయ నమః

 4) గోవిందాయ నమః

5) గరుడధ్వజాయ నమః 

6) దామోదరాయ నమః 

7) హృషీకేశాయ నమః 

8) పద్మనాభాయ నమః 

9) హరయేనమః

10) ప్రభవే నమః 

అనే దశ మంత్రాలను ఉచ్చరించాలి.  తరువాత ప్రదక్షిణాదులు చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలుగుతుంది. 

*శ్లో|| దశాహం కృష్ణదేవాయ పూరికాదశచార్పయేత్||*

అష్టమి మెుదలుకొని వరుసగా పదిరోజులు శ్రీకృష్ణుని  తులసీదళాలతో అర్చిస్తూ పది పూరీలు నివేదించిన వానికి సారూప్యం(కృష్ణుని వంటి రూపం) అనే ముక్తి లభిస్తుంది.  

*కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా, ఫలమునైనా, పుష్పమునైనా, పత్రమునైనా స్వీకరిస్తాడు.* *కృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి, తులసీదళాలతో పూజించాలి.* *మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో పూజించాలి.*  *కృష్ణుడికి తాజా వెన్న సమర్పించాలి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవు పాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణ దర్శనం చేసుకోవాలి.* 

Related Posts