YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

స్వర్ణగౌరి దేవి

స్వర్ణగౌరి దేవి

విశ్వవ్యాప్తమైన ఆదిశక్తి యొక్క అంశయే గౌరీదేవి. గౌరీదేవిని పూజిస్తే సకలదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని చెపుతారు. పురాణాలలో 16 రూపాల  గౌరీదేవీల గురించి వర్ణనలున్నాయి. సిరిసంపదలు, బంగారు ఆభరణాలు అనుగ్రహించే  దేవత స్వర్ణగౌరి దేవి.

బంగారానికి అధిదేవత అయినందున  గౌరీదేవి  స్వర్ణగౌరి అని పిలువబడుతున్నది. ఒకానొక యుగాంతాన  జగత్ప్రళయం ఏర్పడి లోకాలు మళ్ళీ సృష్టించబడినవి. చరాచరాలు,నదులు , పర్వతాలు,  సమస్త జీవకోటి సృష్టించబడింది ఆ సమయాన పరమశివుడు సాగరగర్భాన స్వర్ణలింగంగా ఆవిర్భవించాడు.ఆ అపూర్వ శివలింగాన్ని ఇంద్రాది ముక్కోటి దేవతలు , మానవులు , దానవులు‌, ఋషులు  భక్తితో పూజించారు. వారిని  అనుగ్రహించడానికి పరమ శివుడు ఆ స్వర్ణమయమైన లింగము నుండి  బంగారువర్ణంతో దర్శనమిచ్చాడు. పరమేశ్వరుని ప్రక్కన  స్వర్ణలతగా పరాశక్తి దర్శనమిచ్చినది.  దేవతలు ఆ దేవిన స్వర్ణవల్లీ' అని కీర్తించారు. సముద్రుడు, నాగలోకవాసులు ఎవరికివారే  అంబికను తమలోకానికి రమ్మని ప్రార్ధించారు.  చివరకు ఆ స్వర్ణలతాదేవి పాతాళలోకానికి వెళ్ళింది.  స్వర్ణగౌరీ దేవి అనుగ్రహంతో  భూగర్భంనుండి  ఇనుము, బంగారం, వెండి, సీసం, రాగి పంచలోహములు , ఖనిజ సంపద మొదలైనవి  ఆవిర్భవించాయి. సుదీర్ఘకాలం దేవతలు, మునులు స్వర్ణగౌరి కటాక్షం కోసం తపమాచరించారు.  వారి తపస్సు కి మెచ్చిన పరాశక్తి సువర్ణ ప్రకాశంతో  పాతాళం నుండి సముద్రమధ్యంలోనికి  ఒక పెద్ద చేప మీద ఆశీనురాలై ప్రత్యక్షమయింది. తన చేతులలో జ్ఞానమునిచ్చే తామరపుష్పాన్ని, భోగాలనిచ్చే  నీలోత్పలాలను, ఆయుస్సును పెంచే అమృతకలశాన్ని, సంపదలకు చిహ్నమైన మందసమును ధరించిన ఆ దేవిని చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలతో ఆనందంగా ' మీనాక్షి , స్వర్ణగౌరి, సాగరపుత్రి  ' అంటూ అనేక నామాలతో  స్తోత్రాలు చేసి పూజించారు.  దేవి అనుగ్రహం సదా తమకి వుండాలని వరాలు కోరుకున్నారు . అంబిక వారికి అలాగే వరం  అనుగ్రహించినది. ఆసమయంలో పరమశివుడు కూడా అక్కడకు వచ్చి అంబికను తనతో కైలాసానికి తీసుకు వెళ్ళాడు. పిదప,  మునులు ,దేవతలంతా  మత్స్యము మీద ఆశీనురాలైన  జగదంబ మూర్తిని స్వర్ణరూపంలో ప్రతిష్టించి పూజించసాగారు.అంబిక స్వర్ణ గౌరిగా అందరిని అనుగ్రహించింది. ఈ పూజే స్వర్ణగౌరి పూజగా ప్రసిధ్ధిచెందినది. అగస్త్య మహర్షి స్వర్ణగౌరి వ్రత పూజ  మహిమను అనేక సమయాలలో  ప్రవచించారు. ఆవిధంగా , స్వర్ణగౌరీ పూజ వలన సకల దోషాలు తొలగిపోతాయి, సంపదలు చేకూరుతాయి. అనుకూల దాంపత్యం లభిస్తుంది. కులదైవం అనుగ్రహం సిధ్ధిస్తుంది. కులదైవాన్ని  రచిపోయినవారు, తమ కులదైవం ఎవరో తెలియని వారు  స్వర్ణగౌరిని పూజిస్తే కులదైవ అనుగ్రహం కలుగుతుంది.  శ్రావణమాసం శుక్లపక్షం తదియనాడు స్వర్ణగౌరీ వ్రతం చేసుకోవాలని పురాణాలు వివరించాయి. సాగరదేవత  అయిన ఆ దేవిని మాఘ మాసంలో పూజించినా సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి.  అనునిత్యం స్వర్ణ గౌరిని  ధ్యానించి , పూజించిన గృహంలో ఐశ్వర్యం తులతూగుతుంది. 

Related Posts