వరంగల్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక హత్యల కేసులో నిందితులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షఫీతో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. ఆరుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వరంగల్ ఎల్బీనగర్ కు చెందిన చాంద్ పాషా, షఫీ అన్నదమ్ములు. 10సంవత్సరాల క్రితం పరకాల నుండి వరంగల్ కి వచ్చి స్థిరపడ్డారు. జంగాలపల్లి, పరకాల, ఏటూరునాగారం ప్రాంతాల నుండి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాలకు తరలించే వ్యాపారం చేసే వారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు పెరిగాయి. అప్పులు చెల్లించే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. దీనితో సోదరుడు చాంద్ పాషా పైన తీవ్రంగా కోపాన్ని పెంచుకున్న తమ్ముడు షఫీ బుధవారం తెల్లవారుజామున హత్యలకు పాల్పడ్డాడు. నర్సంపేటకు చెందిన బోయిన వెంకన్న, రూపిరెడ్డిపల్లెకు చెందిన విజేందర్, వరంగల్ పట్టణానికి చెందిన సాజిద్, మీర్జా అక్బర్, పాషా అనే ఈ ఐదుగురు నిందితులతో కలిసి సామూహిక హత్యలకు షఫీ పాల్పడ్డాడు. చెట్లను నరికే బ్యాటరీ కోత మిషన్ తో ఇంటి తలపులు కోసివేశారు. ఇంట్లోకి చొరబడి వేట కత్తులతో విచక్షణ రహితంగా నరికారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు షఫీ అన్న చాంద్ పాషా, వదిన సబిరా బేగం, బావమరిది ఖలీల్ పాషా అక్కడికక్కడే మృతి చెందారు. అన్న కుమారులు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వేట కత్తులు బ్యాటరీ కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు..