YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏమిటి జీవితమంటే?

ఏమిటి జీవితమంటే?

మన జీవితాలను ఆహార, నిద్రలకు పరిమితం చేసుకుంటే మనకు ఇతర ప్రాణులకు తేడా ఏమీ ఉండదు. వజ్రాన్ని బెల్లం కొట్టే రాయిగా, ఉప్పును పొడిగా నూరే రాయిగా వాడుకున్నట్లు అవుతుంది తప్ప వాటి విలువ గ్రహించలేము. అందువలన ఈ మానవజన్మ ఆహారం తీసుకుని నిద్రపోవడానికి మాత్రమే లభించలేదని మనం గ్రహించాలి.

అందువలన మనకు లభించిన ఈ జన్మలో ఒక విషయాన్ని సాధించాలి. ఈ మానవజన్మ లక్ష్యం అది కావాలి. అయితే ఏమి సాధించాలి. ధనం సంపాదించాలా? అధికారాన్ని సంపాదించాలా? అవి కావలసినవే. ధనం, అధికారం, సంపద, విద్య, బలం అన్నీ కావలసినవే. అవి మనకు ప్రధాన లక్ష్యం కాదు. మన ప్రధాన లక్ష్యం వేరే ఉన్నది. ప్రధాన లక్ష్యాన్ని సాధించటానికి ఇవి తోడ్పడితే మంచిదే. 

ఉదాహరణకు ఒకాయన యజ్ఞం చేయాలనుకుంటాడు. దానికోసం ధనం, మనుష్యులు, యాగవేదిక మొదలగునవి కావాలి. వాటిని మనం సంపాదించాలి. అయితే అతని లక్ష్యం మాత్రం వాటిని సంపాదించటం కాదు. యజ్ఞం చేయటం అతని లక్ష్యం. ఈ వస్తువులను సమకూర్చుకుని యజ్ఞం చేయాలి. ఈ జీవితంలో ధర్మాచరణకు కట్టుబడి ఉండాలి. మానవ జన్మను ధర్మాచరణకు ఉపయోగించాలి. అలా ధర్మాచరణకు ఉపయోగించకపోతే మానవ జన్మవృథా.

ఇతర ప్రాణులుగా జన్మిస్తే ధర్మాచరణ కుదరదు. ఏమి చేయగలం? ఇతర ప్రాణులు ధర్మాన్ని అనుసరించలేవు. అలా జన్మిస్తే దేవుని పూజించగలమా? యజ్ఞయాగాలు చేయగలమా? పేదలకు అన్నదానం చేయగలమా? పాఠశాలలను ప్రారంభించగలమా? వేదాధ్యయనం చేయగలమా? ఏమీ చేయలేం. మానవజన్మలో మాత్రమే ధర్మాచరణ సాధ్యమవుతుంది, ఇతరులకు సహాయం చేయటం సాధ్యపడుతుంది. మానవ శరీరం, వివిధ అవయవాలు, సద్బుద్ధి ఇతర ప్రాణులకు లేవు. అది పరమేశ్వరుని సృష్టి, ఉదాహరణకు మనకు నాలుక ఉన్నది. దాని కారణంగా మనం మాట్లాడగలం. ఎంతసైపైనా మాట్లాడగలం. పశువులు అలా మాట్లాడగలవా? లేదు. మనకు కరములున్నాయి. కమలాక్షుని అర్చించగలం. పశువులు అర్చించగలవా? అలా మన శరీరం, అవయవాలు, ఇంద్రియాలు, ధర్మాచరణకు వీలుగా సృష్టించబడ్డాయి. ఈ విధమైన శక్తి ఇతర ప్రాణులకు లేదు. మానవశరీరం మాత్రమే ధర్మాచరణకు వీలుగా సృష్టించబడినట్లు, మానవ జన్మ మాత్రమే ధర్మాచరణకు తగినది. 

ఇప్పుడు మనం ధర్మాచరణలో గడపకపోతే, మరో జన్మ కూడ మనకు మానవజన్మే లభిస్తుందని నమ్మకమేమిటి? మనకు మానవ జన్మ లభించినా ఈ శరీరం శాశ్వతం కాదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు. అంతే. ఆ తరువాత ఈ శరీరాన్ని వదలిపెట్టవలసిందే. దాని గురించి మనం ఏమీ చేయలేం. అందువలన ఎంతో కష్టంతో లభించిన ఈ మానవ శరీరం నుండి నిష్క్రమించే ముందు, లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించటం తెలివిగల వ్యక్తి కర్తవ్యం. దీనికి చక్కటి ఉదాహరణను చెప్పారు. ఒక నదిని దాటటానికి ఒక పడవ కావాలనుకున్నాడొకాయన. కాని పడవ అంత సులభంగా దొరకనందున దానిని తానే కొనాలనుకున్నాడు. ఎంత డబ్బు ఖర్చయినా పరవాలేదనుకున్నాడు. చివరికి పడవను కొన్నాడు. పడవను కొన్న తరువాత నదిని దాటాలి కదా! కాని నదిని దాటటానికై కొన్న పడవకు చాల ఖర్చు పెట్టినందున తన లక్ష్యాన్ని మరచిపోయి, నదిపై విహారం చేయసాగాడు. కొద్ది రోజులకు ఆ పడవకు రంధ్రమేర్పడింది. అప్పుడు పడవలో నదిని దాటటం కష్టం కదా. చిన్న రంధ్రమున్నా పడవలో నీళ్ళు ప్రవేశిస్తాయి. పడవ మునిగిపోయింది. అందువలన తెలివి ఉన్నవాడు కొన్న పడవలో సాధ్యమైనంత త్వరగా నదిని దాటుతాడు.

అలాగే ఈ మానవ శరీరాన్ని కూడ జీవించియున్నంత కాలం సక్రమంగా ఉపయోగించాలి. ధర్మశాస్త్రాలలో చెప్పిన విధముగా సాధ్యమైనంతవరకు ధర్మాచరణ చేస్తూ, ఇతరులకు సహాయపడుతూ మానవ జీవితాన్ని ఉపయోగించుకోవాలి.

Related Posts