YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

లోక‌సంక్షేమం కోసం  "  షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష  " -    వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం

లోక‌సంక్షేమం కోసం  "  షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష  " -    వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం

లోక‌సంక్షేమం కోసం  "  షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష  "
-    వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం
తిరుమల,మా ప్రతినిధి, సెప్టెంబర్03,
లోక సంక్షేమం కోసం, క‌రోనా మూడ‌వ వేవ్ ప్రత్యేకించి చిన్న పిల్ల‌ల‌పైన ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉన్నదని ప్ర‌భుత్వాలు, వైద్య సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో, చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తలపెట్టిన షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ దీక్ష‌ తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. ఈ దీక్ష 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.
          బాల‌కాండ‌లో " బ‌భౌరామఃసంప్ర‌హృష్టఃస‌ర్వ‌దైవ‌తైః "  అనే 16 అక్ష‌రాల వాక్యం విశిష్ట‌మైన‌ది. ఇందులో మొద‌టి రోజు బ‌ అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం బాల‌కాండ‌లోని మొద‌టి స‌ర్గ‌లో 100, రెండో స‌ర్గ‌లో 43 క‌లిపి మొత్తం 143 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత 16 మంది ఉపాస‌కులు శ్లోక పారాయ‌ణం చేశారు. శ‌నివారంనాడు మూడో స‌ర్గ నుండి ఏడ‌వ‌ స‌ర్గ వ‌రకు మొత్తం 142 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు. కాగా బాల‌కాండలోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో 2,232 శ్లోకాలు ఉన్నాయి.           
ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ మారుతి పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతో పాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు శ్రీ‌ సీతా ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ‌చంద్ర‌మూర్తి మూల మంత్ర జ‌ప‌-త‌ర్ప‌ణ‌- హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
           ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

Related Posts