YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన

మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన

ముంబై, సెప్టెంబర్ 4, 
సైద్ధాంతికంగా బిజెపికి సన్నిహితంగా ఉండే రాజకీయ పార్టీ అంటే శివసేన అని మాత్రమే చెప్పాలి. సుదీర్ఘకాలం రాజకీయ పొత్తు ఏర్పాటు చేసుకున్న పార్టీ కూడా అదే. అయితే నేడు రెండు పార్టీల మధ్య తరచూ విభేదాలు తీవ్రతరం అవుతూ ఉండడం, ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం గమనిస్తే అసలేమీ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. రెండు పార్టీలు కూడా నేడు సైద్ధాంతిక భూమికను వదిలి వేసి, అధికార రాజకీయాలలో మునిగి తేలడమే అందుకు ప్రధాన కారణంగా భావించవలసి ఉంటుంది. కాంగ్రెస్‌కు కులం,- ప్రాంతం ఆధారంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకు ఉన్నతమైన సైద్ధాంతిక భూమిక ఉంటుందని ఎవ్వరూ ఆశించరు. కానీ నిజాయతీకి, సైద్ధాంతిక నిబద్ధతకు బద్దులైనవారు దారి తప్పితే మాత్రం ప్రజలు సహించలేరని ఈ రెండు పార్టీలు కూడా గ్రహించాలి. అందుకు ఉదాహరణ మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్. 1970 తర్వాత భావాత్మక అంశాలు లేకుండా, కేవలం తన పాలన ఆధారంగా ఎన్నికలలో గెలుపొంది, తిరిగి అధికారంలో వచ్చింది ఆయన మాత్రమే అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపొందలేకపోయారు. 2009లో ఒకేసారి పోటీ చేసి ఓటమి చెందారు. ఆర్ధిక సంస్కరణల కారణంగా ఎక్కువగా ప్రయోజనం పొందిన మధ్య తరగతి వర్గం, ఉద్యోగ వర్గంతో పాటుగా సిక్కులు ఎక్కువగా ఉంటె న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన గెలుపు సునాయానం అని అందరు భావించారు. అయితే ఎన్నికల సందర్భంగా 1984లో జరిగిన సిక్కుల ఊచకోత గురించిన ప్రశ్న రాగా ‘దానితో కాంగ్రెస్‌కు సంబంధం లేదు. అదంతా బిజెపి కుట్ర’ అంటూ ఒక సాధారణ రాజకీయవేత్త వలే మాట్లాడారు. పోలింగ్ రోజున సిక్కులు ఎక్కువగా క్యూలలో నిలబడి ఓటు వేయడంతో తన కోసమే అని సింగ్ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఓటమి చెందారు. ఎందుకంటె ఆ విధమైన ‘రాజకీయ ప్రకటన’ను మరే నాయకుడు చేసినా జనం పట్టించుకొనేవారు కాదు. కానీ మన్మోహన్ సింగ్ వంటి నేత నుండి అటువంటి ‘పచ్చి అబద్ధాలు’ వస్తాయని ఊహించ లేదు. పైగా ఢిల్లీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దానితో ఆగ్రహంతో సిక్కులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం శివసేన, బిజెపిల మధ్య పెరుగుతున్న దూరాన్ని వెల్లడి చేస్తుంది. కొద్దీ రోజుల క్రితం శివసేన, బిజెపి కలసి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు బయలుదేరడం గమనార్హం. ఆ విధంగా రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎందుకు చెడిపోయాయి?ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరగడానికి ఆ పార్టీ పట్ల బిజెపి నాయకత్వం అనుసరించిన వైఖరే కారణం అని చెప్పవచ్చు. 2013లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి అని చర్చలు జరుగుతున్న సమయంలో శివసేన సుష్మా స్వరాజ్ పేరును ప్రతిపాదించింది. దానితో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ ఎన్‌సిపి అధినేత శరద్ పవర్‌తో స్నేహం చేస్తూ వచ్చారు. ఆయన స్వయంగా ఆయన నియోజకవర్గం పర్యటనకు వెళ్లి, ఆయన ఇంట్లో ఒక రాత్రి గడిపారు. బహుశా మరే బిజెపి నేత ఇంట్లో కూడా ఆయన ఒక రాత్రి ఉన్న దాఖలాలు లేవు. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శివసేన, బిజెపి విడివిడిగా పోటీ చేశాయి. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బిజెపికి బయట నుండి మద్దతు ఇవ్వడానికి ఎన్‌సిపి ముందుకు వచ్చింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు జోక్యం చేసుకోవడంతో శివసేనతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయినా శివసేనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదు. అంతకు ముందు 2014లో ఎన్‌డిఎలో భాగస్వామి అయిన శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభును రాజ్యసభకు రాజీనామా చేయించి, తమ పార్టీ సభ్యునిగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తొలిసారి రెండు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అన్ని అవమానాలను భరిస్తూనే శివసేన ఎన్‌డిఎలో కొనసాగుతూ వచ్చింది.ఈ పూర్వరంగంలో తమకు ముఖ్యమంత్రి పదవిపై హామీ ఇవ్వని పక్షంలో ఒంటరిగా పోటీ చేస్తాం అంటూ 2019లో శివసేన మంకుపట్టు పట్టింది. ఆ సమయంలో హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా ఉద్ధవ్ థాకరే ఇంటికి వెళ్లి, కలసి పోటీ చేసే విధంగా ఒప్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి విషయమై అమిత్ షా హామీ ఇచ్చారని ఆ తర్వాత శివసేన నాయకులు చెబుతూ వచ్చారు. ఈ విషయమై అమిత్ షా చాలా కాలం మౌనం వహించారు. ఎన్నికల అనంతరం బిజెపి కేంద్ర నాయకత్వం తమతో మాట్లాడితే గాని ప్రభుత్వంలో చేరమని శివసేన భీష్మించుకుని కూర్చింది. ఆ పార్టీ నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేయకుండా, శరద్ పవర్ మేనల్లుడు అజిత్ పవర్‌తో చేతులు కలిపి, అర్ధరాత్రి గవర్నర్‌తో మంత్రాంగం జరిపి, తెల్లవారు జామున ప్రభుత్వం ఏర్పాటు చేసి బిజెపి అల్లరిపాలయింది. శివసేనకు సిఎం పదవి ఇవ్వడానికి అమిత్ షా సిద్ధపడినా, ప్రధాని అడ్డు తగిలారనే కథనాలు ఈ సందర్భంగా వచ్చాయి. ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన శరద్ పవర్ అటు కాంగ్రెస్‌ను, ఇటు శివసేనను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా ఏనాడు అధికారం పట్ల, రాజకీయాలపట్ల ఆసక్తి చూపలేదు. పరిస్థితుల కారణంగా మొదట్లో తండ్రి నుండి పార్టీ నాయకత్వం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టవలసి వచ్చింది. కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆయన ప్రధాని మోడీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు.శరద్ పవర్ కు సహితం మంచి సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతూ వస్తున్నది. 2024 ఎన్నికల నాటికి కొత్త పార్టీల మద్దతు అవసరం కాగలదనే ఉద్దేశంతో ప్రధాని సహితం శివసేన పట్ల తన ధోరణి మార్చుకొంటూ వచ్చిన్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర మంత్రివర్గంలో శివసేనను ఆహ్వానిస్తున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇటువంటి సమయంలో ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మాజీ శివసైనికుడు నారాయణ రాణేకు మంత్రి పదవి ఇవ్వడం రెండు పార్టీల మధ్య అగ్నికి ఆజ్యం పోసిన్నట్లు అయింది. బిజెపిలోని పలువురు సీనియర్ నేతలను కాదని అమిత్ షా స్వయంగా చొరవ తీసుకొని రాణేకు మంత్రి పదవి ఇప్పించారనే ప్రచారం జరుగుతున్నది. గతంలో శివసేన ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణే సుదీర్ఘకాలం ఆ పార్టీలో కింది స్థాయి నుండి పనిచేశారు. 2003లో ఉద్ధవ్‌ను పార్టీ ‘కార్యనిర్వాహక అధ్యక్షుడు’గా ప్రకటించడం ద్వారా తన ‘రాజకీయ వారసుడు’గా బాలథాకరే సంకేతం ఇవ్వడాన్ని రాణే సవాల్ చేశారు. ఆ పరిణామాలతో 2005లో పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో 2017లో ఆ పార్టీని విడిచి, సొంత పార్టీ పెట్టుకొని, ఫలితం లేక మరుసటి సంవత్సరం బిజెపిలో చేరారు.కొంకణ్ ప్రాంతంలో కొంత మేరకు బలం గల రాణే ఉనికి శివసేనకు నచ్చదని తెలిసి కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక విధంగా రెచ్చగొట్టడమే కాగలదు. పైగా నాలుగు దశాబ్దాలకు పైగా ముంబై మేయర్ పదవిలో ఉంటున్న శివసేనను వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో గద్దె దించి, తాము ఆక్రమించాలని వ్యూహాత్మకంగా అమిత్ షా రాణేను రంగంలోకి దించినట్లు కనిపిస్తున్నది. ఆ ఊపులోనే ముఖ్యమంత్రి పట్ల అనుచిత వాఖ్యలు చేసి కేంద్ర మంత్రి అభాసుపాలయ్యారు. రాణేను అరెస్ట్ చేసిన్నప్పుడు బిజెపి వర్గాల నుండి భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం, ఆయన ఇటువంటి వివాదాలలో చిక్కుకోవడం పట్ల స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన విముఖతను పరోక్షంగా వ్యక్తం చేశాడు. మహారాష్ట్రకు చెందిన మరో సీనియర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహితం మౌనంగా ఉండడం గమనార్హం. ఒక విధంగా వీధి పోరాటాలకు పేరొందిన శివసేన సైనికులకు అధికారం వచ్చాక మౌనంగా ఉండడం ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు రాణే పేరుతో వీధులలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పడిన సానుభూతిని ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో సానుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా శివసేన ఆధిపత్యం, ఆ పార్టీ తీరు తెన్నుల పట్ల విముఖంగా ఉండే బిజెపి కార్యకర్తలు సైద్ధాంతికంగా మాత్రం ఆ పార్టీతో స్వరం కలపడానికి మాత్రం వెనుకాడరు
 

Related Posts