YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం

నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం

నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం
సెప్టెంబరు 13వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి అగరబత్తులు
డయల్‌ యువర్‌ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
తిరుమల,మా ప్రతినిధి, సెప్టెంబర్ 04,
దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్న తయారుచేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన న‌వ‌నీత సేవ‌లో భ‌క్తులు పాల్గొనేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి ఏడు బ్రాండ్ల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్ర‌యం కోసం అందుబాటులోకి తెస్తామ‌న్నారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో శ‌నివారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
ఆ వివ‌రాలు.
సెప్టెంబరు 9న వరాహ జయంతి
- సెప్టెంబరు 9న ఉదయం 11 నుండి 12 గంటల వరకు తిరుమలలో వరాహ జయంతి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం, మూలమూర్తికి ప్రోక్షణ నిర్వహిస్తాం.
సెప్టెంబరు 19న అనంతపద్మనాభ వత్రం
- సెప్టెంబరు 19న అనంతపద్మనాభ వ్రతంను పురస్కరించుకొని ఉదయం శ్రీవారి ఆలయం నుండి చక్రతాళ్వారును ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణిలో ఏకాంతంగా  చక్రస్నానం నిర్వహిస్తాం.
హోలీ గ్రీన్‌ హిల్స్‌గా తిరుమల
- తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్‌ హిల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకోసం దశలవారీగా డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను వినియోగిస్తాం.
- మొదటి దశలో 35 విద్యుత్‌ కార్లను(టాటా నెక్సాన్‌) తిరుమ‌లలోని సీనియ‌ర్ అధికారుల‌కు అందించాం. రెండో ద‌శ‌లో యాత్రికులకు ఉచిత బ‌స్సులు ప్రారంభిస్తాం. తిరుమల-తిరుపతి మధ్య ఆర్‌టిసి విద్యుత్ బస్సులను న‌డిపే ప్ర‌క్రియ తుది ద‌శ‌లో ఉంది. మూడో ద‌శ‌లో ట్యాక్సీలను విద్యుత్‌ వాహనాలుగా మార్పించే ప్రయత్నం చేస్తాం.
డిఆర్‌డిఓ పర్యావరణ హిత లడ్డూ సంచులు - తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యుట్‌ సంచులు, గ్రీన్‌ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తున్నాం. ఇటీవల డిఆర్‌డిఓ సంస్థ సాంకేతిక ప‌రిజ్ఞానంతో మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు ప్రారంభించాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం
- తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను సెప్టెంబరు 14న ప్రారంభిస్తున్నాం.
- ఇందుకోసం సెప్టెంబరు 8 నుండి 13వ తేదీ వరకు బాలాలయ కార్యక్రమాలు నిర్వహిస్తాం. భక్తులకు యథావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది. స్వామివారి కైంకర్యాలు కల్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఐనా మహల్‌ పునఃప్రారంభం
- శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్‌ను ఆగ‌స్టు 22న‌ పునఃప్రారంభించాం. ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్‌సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం.
వర్చువల్‌ విధానంలో పవిత్రోత్సవాలు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్‌ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని అమ్మ‌వారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరుతున్నాం.
సెప్టెంబరు 13వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి అగరబత్తులు
- టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తులు తయారు చేస్తున్నాం. సెప్టెంబరు 13వ తేదీ నుండి ఏడు బ్రాండ్ల‌ను భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతాం.
డాక్టర్‌ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు
- వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, డ్రై ఫ్లవర్‌ మాలలు, తదితరాలు తయారు చేయడానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంతో సెప్టెంబరు 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకుంటాం. ఈ ఉత్ప‌త్తుల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తెస్తాం.

Related Posts