YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నేను లేని నేను.

నేను లేని నేను.

ఆధ్యాత్మిక ప్రపంచానికి అతి పెద్ద సవాలు ఏమిటో తెలుసా? మనతో వచ్చి, మనతో ఉండి, జీవితాంతం పిండి, పిప్పి చేసే మనలో ఉండే ‘నేను’. దీని మారుపేరు అహం. ఈ నేను అన్ని దైవనామాల కంటే గొప్పది, శక్తిమంతమైనది అంటారు రమణ మహర్షి. అంతే కాకుండా- నేను అనేది మహా మంత్రం. దాన్ని ఎల్లప్పుడూ అందరూ జపిస్తున్నారు. దాని మూలం కనుక్కో. అన్ని కిటుకులు, రహస్యాలు అందులోనే ఉన్నాయి. అప్పుడే నీకు, నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అంటారు.

ఎలా కనుక్కోవాలి? అదంత సులువైన పనా... ఆ నేనును ఎలా పట్టుకోవాలి? దాని ఉదయం, అస్తమయం మనలోనే జరుగుతున్నా- ఎప్పుడూ దాన్ని వెదకలేదు. ఎంతో అందమైన నేను. ఎంతో ఆహ్లాదకరమైన నేను. అది సుందరం, సురుచిరం. సర్వ భావాలకు ఆలవాలం. ఆడించేది, ఆడేది, ఓడించేది, గెలిపించేది, ఓలలాడించేది అదే. ఆ నేనే... నేను నేనైన నేను!

క్షణకాలంలో నువ్వే ఇంద్రుడివి, చంద్రుడివి అని పైకి లేపుతుంది. మరుక్షణమే నువ్వు హీనుడివి, దీనుడివి అని కిందపడేస్తుంది. ఈ నేనును సరిగ్గా అవగాహనలోకి తెచ్చుకుంటే, ఎన్నాళ్లుగానో మనలో మేరుపర్వతంలా పెరిగిపోయిన అహం అనే శిఖరం కూలిపోతుంది. దీనిమీద ఎక్కుపెట్టిన బాణాలే ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ. సనాతన గురువులు, జ్ఞానులు చేసిన బోధలన్నీ ఈ నేను అనే వెన్నెముక విరగ్గొట్టడానికే.

నేనును నేనుతో జయించలేం. ఈ నేనుకు నాది తోడైందంటే అగ్నికి ఆజ్యం పోసినట్లే. నేను ‘మనం’గా మారాలి. మనం జనంగా మారాలి. జనం చెట్టు, పుట్ట, పక్షితో కలిసి ప్రపంచమై, ఏకమై వసుధైక కుటుంబ భావనతో నిండిపోవాలి. అదే అందరినీ పీడించే ఒంటరి తుంటరి ‘నేను’కు అసలైన విరుగుడు మందు. అవసరం వస్తే, అందరినీ వదిలి అడవిలో ఉండగలం. విరక్తి పుడితే మంచుకొండల్లో కూర్చోగలం. కష్టపడి అయినా కళ్లు మూసుకుని ధ్యానంలో ఉండగలం. నేనును వదిలి ఉండటం మాత్రం ఓ పట్టాన సాధ్యం కాదు.

నీ నేనుకు ఎప్పుడు వీడ్కోలు చెబుతావో అప్పుడే నీ ఆధ్యాత్మిక విజయమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను అనే తెరమీదే కదా ప్రపంచం ఎన్నో ఆకర్షణీయమైన దృశ్యాలు చూపిస్తోంది... వాటిని వదులుకోవడం మానవ మాత్రులకు సాధ్యమవుతుందా? నేనుతో అజ్ఞానులే కాదు, జ్ఞానులు కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. ‘అన్నీ తెలిసిన వాడిని నేను’ అని ఏ జ్ఞానీ చెప్పలేదు. ఒక వేళ అలా చెబితే, అతడు నేను ముందర ఘోర పరాజయం పొందిన వాడే! నేనుకు తల వంచినవాడే...

అందుకే నిజమైన జ్ఞాని మౌనం వహిస్తాడు. మాన అవమానాలను సహిస్తాడు. ప్రేమతో అందరినీ భరిస్తాడు. ఏమీ కోరుకోడు. నేను అనేది తలెత్తకుండా అజ్ఞానానికి కూడా అవసరమైతే తలవంచి నమస్కరించడానికీ వెనకాడడు. అందరిలో ఉన్నా లేనట్లుగా ఉంటాడు. అందరి కోసం ఉంటాడు.

నేను మీద సాధించిన విజయం శరీరానికి, మనసుకు, ఆత్మకు దివ్యమైన వెలుగును ఇస్తుంది. అంతరంగ ఆకాశంలో స్వేచ్చగా విహరించే శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే బుద్ధుడు, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా నేనును పోగొట్టుకున్నాను... తద్వారా శాంతిని, అమరత్వాన్ని పొందాను అని చెప్పాడు.

Related Posts