YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సూర్య వైభవం

సూర్య వైభవం

నిత్యం ప్రత్యక్షంగా కనపడే దైవం సూర్యనారాయణమూర్తి. అందుకే, ఆయనను కర్మసాక్షి అని పిలుచుకుంటున్నాం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు, విద్య, వైద్యం, విజ్ఞానం, ఇహం, పరం అన్నింటికీ సూర్యోపాసన సర్వులకూ ప్రయోజనకరం.

సూర్యోదయం కాగానే ఆయనకు ఓ నమస్కారం సభక్తికంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయంటారు.

‘నమః’ అనే శబ్దానికి ‘యజ్ఞం’ అని కూడా అర్థం ఉందని రుగ్వేద బ్రాహ్మణం చెబుతోంది. సూర్యుడు సహస్రనామధేయుడు. ఆదిత్య, సూర్య, రవి, మిత్ర,భాను తదితర నామాలు మంత్రాలుగా ఉపాసితమవుతున్నాయి.

సూర్య కవచ పారాయణం, త్రికాల సంధ్యావందనం, సూర్య నమస్కారాలు- వీటి వల్ల ప్రారబ్ధాన్ని బట్టి వచ్చే వ్యాధులు తొలగిపోతాయంటారు. 

రామరావణ సంగ్రామానికి ముందు అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్యహృదయం పఠించి రాముడు ఆత్మస్థైర్యం పొందాడు. కృష్ణుడి పుత్రుడు సాంబుడు, కర్ణుడు, సత్రాజిత్తు తదితరులెందరో రవినుపాసించి ధన్యులైనారు. 

ఏడు కిరణాలు ఒకే విధంగా కలిగిన రథచక్రం సూర్యుడిది. 

స్వాధీనమైన సప్తమయూఖాలు(కిరణాలు) కలిగిన కాలచక్రాన్ని ధరించి, సమస్త లోకాలను పాలిస్తున్నాడు. సూర్య కిరణాల ప్రభావం రక్త, శ్వాస, జీర్ణ వ్యవస్థలపైన పడుతుంది. ఈ కిరణాల్లోని సప్తవర్ణాలు అనేక దీర్ఘవ్యాధులను సైతం ఉపశమింపచేస్తాయి. సూర్యుడి నీల వర్ణ కిరణాలు నాభిపైన పడేలా కూర్చుంటే, శరీరంలోని రుగ్మతలన్నీ పటాపంచలైపోతాయంటారు.

సూర్యుడు ఔషధరూపుడు. ఎన్నో వ్యాధులు సూర్యుడి వల్ల తొలగిపోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పాశ్చాత్య శాస్త్రవేత్త గార్డ్‌నర్‌ రోనీ సైతం పరిశోధించి ఆ మేరకు ప్రకటించాడు. సూర్యుడిలో ఉన్నంత రోగనిరోధక శక్తి ప్రపంచంలోని మరే వస్తువులోనూ లేదని డాక్టర్‌ సౌలే వెల్లడించాడు.

సత్రాజిత్తు భాస్కరుణ్ని ప్రార్థించి అపార ధనరాశులను ప్రసాదించే శమంతకమణిని పొందగలిగాడు. పాండవులు ఆదిత్యుణ్ని ఉపాసించి అరణ్యవాస కాలంలో అక్షయపాత్ర పొందగలిగారు. సూర్యుడి వర ప్రభావంతో కుంతి కర్ణుణ్ని పుత్రుడిగా పొందింది. అమేయ బలశాలి శ్రీరాముడి ప్రియమిత్రుడు సుగ్రీవుడు సూర్యతనయుడే. హనుమంతుడు సూర్యుడికి శిష్యుడై జ్ఞాన ఖనిగా పేరుగాంచాడు. యాజ్ఞవల్క్యుడూ భాస్కరుడి శిష్యుడే.

వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు సూర్యశక్తిని  బహువిధాలుగా వ్యాఖ్యానించాయి. భాస్కరుడి సహస్ర కిరణాలలో ప్రధాన కిరణాలు- సుషుమ్నం, హరికేశం, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులను రోజూ స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని రుగ్వేద వచనం.

శిల్పశాస్త్రంలోనూ సూర్యవైభవ వర్ణన ఉంది. సూర్యకృప కోసం కొందరు ‘అరుణ పారాయణం’ చేసే సంప్రదాయం కూడా ఉంది.

మాఘశుద్ధ సప్తమినాడు అదితి కశ్యపులకు సూర్యభగవానుడు జన్మించాడు. ఈ పర్వదినాన్ని సూర్యజయంతి, రథసప్తమి పేర్లతో పిలుస్తారు. రథసప్తమి రోజున సూర్యారాధన చేసి, స్వామికి పాయస నివేదన చేస్తారు. రథసప్తమి నాడే సూర్యుడి ప్రయాణం ఉత్తర దిశవైపు మొదలవుతుంది. సూర్యారాధన, సూర్య నమస్కారం వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, ఆయుర్‌ వృద్ధి, సకల రోగ నివారణ, సర్వబాధా విముక్తి పొందవచ్చునని వేదాల్లో అభివ్యక్తమైంది. 

ఆదివారం, సప్తమీ  తిథి సూర్యారాధనకు ప్రశస్తమైంది. గ్రహరాజైన సూర్యుడి ఆలయాలు ప్రధానంగా కోణార్క్‌, అరసవిల్లి, మోఢేరా(గుజరాత్‌), కర్నూలు, గ్వాలియర్‌, తిమ్మాపురం(సూర్యాపేట), తిరుమలగిరి (హైదరాబాద్‌), కశ్మీర్‌, కుంభకోణంలో ఉన్నాయి.

Related Posts