YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సెల్ ఫోన్లతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్... జరా భద్రం...

సెల్ ఫోన్లతో  బ్యాంక్ ట్రాన్సాక్షన్స్... జరా భద్రం...

నిజామాబాద్, అక్టోబరు 11,
సెల్ ఫోన్ సాయంలో విద్యుత్తు తదితర బిల్లులు చెల్లిస్తూ, ఏవైనా సరకులు కొనుగోలు చేస్తున్నారా? ఇతర పనులకూ నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారా?... ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.సైబర్‌ నేరస్థులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు... నగదు భద్రంగా ఉండాలంటే బాధితులు వేగంగా స్పందించాలని సైబర్‌క్రైం పోలీస్‌ అధికారులు అంటున్నారు. నగదు పోయిన వెంటనే బాధితులు కొన్ని చర్యలు తీసుకుంటే లావాదేవీలను ఆపేందుకు వీలుందని సూచిస్తున్నారు. ఓటీపీ నంబర్లు చెప్పడం, ఇతర వివరాలను సైబర్‌ నేరస్థులతో పంచుకోవడం, కొన్ని సందర్భాల్లో ఈ-మెయిల్‌కు వచ్చిన సమాచారాన్ని నిజమైనదిగా భావించి త్రీడీ పిన్‌ నంబరును నేరగాళ్లకు ఇవ్వడం వంటివి చేయవద్దంటున్నారు. చరవాణితో డబ్బు పంపుతున్నప్పుడు, ఈ-వ్యాలెట్‌ ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ బాధితులకు సూచిస్తున్నారు. కొత్తగా డెబిట్‌ కార్డులను వాడుతున్నప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోవాలని వివరిస్తున్నారు. మీకు తెలియకుండానే ఫోన్  సైబర్‌ నేరస్థులు హ్యాకింగ్‌ చేసి బ్యాంకు ఖాతా వివరాలు... ఏటీఎం నంబర్లు.. పాస్ వర్డ్ లుతీసుకుంటున్నారు. ఒకసారి మీరు ఇంటర్నెట్ ఆధారంగా ఏదైనా వస్తువు కొంటే చాలు... వెంటనే మీ వ్యక్తిగత అంశాలన్నీ సైబర్‌ నేరస్థులకు తెలిసి పోతున్నాయి. అక్కడితో వారు ఆగడం లేదు... మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిచయస్థులతో మీరు మాట్లాడే మాటలూ వింటున్నారు... అందుకే ప్రతి లావాదేవీ పూర్తి చేసిన వెంటనే ఫోన్‌ వ్యవస్థను మార్చుకోవాలని సైబర్‌ నేరాల అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారుల డెబిట్‌ కార్డులను విదేశీ సైబర్‌ నేరగాళ్లు హ్యాకింగ్‌ చేస్తుండగా... తాజాగా బ్యాంకు ఖాతాదారుల సెల్‌ఫోన్లనూ వదిలిపెట్టడం లేదు. చరవాణుల్లోని సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుందని పోలీస్‌ అధికారులు వివరిస్తున్నారు. మా ప్రమేయం లేకుండానే పేయూ, పేటీఎం, ఛాయిస్‌ యు, పే ఫర్‌ ఇండియా, ఎస్‌బీఐ బడ్డీ వంటి ఈ-వ్యాలెట్‌లోకి ఆగంతుకులు నగదు మళ్లిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్  సాయంతో ఒక్కసారి డెబిట్‌కార్డును చరవాణి ద్వారా వాడితే చాలు... సైబర్‌ నేరస్థులు పసిగట్టి ఆ చరవాణిని హ్యాక్‌ చేసి వివరాలను తీసుకుంటున్నారు. వెంటనే నగదు నిల్వలను సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు.. డెబిట్‌కార్డులు, చరవాణులు హ్యాకింగ్‌ వంటి వాటిపై సైబర్‌ నేరస్థులు దృష్టి కేంద్రీకరించడంతో పోలీస్‌ అధికారులు తాజాగా పాత నేరస్థులపై కదలికలపై ఆరా తీస్తున్నారు.

Related Posts