YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంచలనం సృష్టించిన ఉండవల్లి

సంచలనం సృష్టించిన ఉండవల్లి

రాజమండ్రి, అక్టోబరు 12,
ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనం సృష్టించారు. వైసీపీ సర్కారు పదవీ కాలంలో దాదాపు సగం పూర్తయిన తర్వాత ఆయన ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ఏది చెప్పినా అంకెల సాక్ష్యాధారాలతో , రాజకీయ గణాంకాలతో , హేతుబద్ధమైన తర్కంతో మాట్లాడే ఉండవల్లి కి రెండు తెలుగురాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో అభిమానులున్నారు. ఆయన చెప్పిన మాటలను విశ్వసించేవారి సంఖ్య రాజకీయవర్గాల్లో అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాళా అంచున ఉందని, ఇప్పటికే పేరుకుపోయిన ఆరులక్షల కోట్ల రూపాయల అప్పును వడ్డీతో సహా చెల్లించడం తలకుమించిన భారమని తేల్చేశారాయన. భవిష్యత్తులో ఏడాదికి 40 వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. జీతాలు ఇవ్వడం కూడా కష్టమేనంటూ సాధికారికంగా ప్రకటించారు. దీంతో వైసీపీ సర్కారు తలలు పట్టుకుంటోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అంకెల సహా వెల్లడించిన వివరాలను ఖండించడమెలాగో తెలియక ప్రభుత్వంలోని పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు సర్కారీ అప్పుల గురించి నిత్యం ఘోష పెడుతున్నాయి. కానీ రాజకీయ కారణాల రీత్యా వారు చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో అంత విశ్వసనీయత లభించడం లేదు. వైసీపీ వర్గాలు రాజకీయంగా దాడి చేస్తూ ప్రతిపక్షాలు మీడియా చేస్తున్న ప్రచారాన్ని గేలి చేస్తున్నారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ, మీడియాలోనూ ఉన్న క్రెడిట్ వేరు. రాజకీయంగా తటస్థంగా ఉండటం ఆయనకు అడ్వాంటేజ్, అందులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డికి నమ్మకమైన సహచరునిగా ముద్ర ఉండనే ఉంది. మరోవైపు పోరాటంలో వెనుదిరగరని పేరుంది. రామోజీ రావు వంటి మీడియా టైకూన్ కే సవాల్ విసిరి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన ఘనత ఆయన సొంతం. ఓపెన్ మీడియాగా, ఒపీనియన్ మేకర్ గా ఉండవల్లి ప్రభావం చాలా ఎక్కువ. చాలాకాలంగా ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారం వాస్తవమేనని వెల్లడిస్తూ మరిన్ని వివరాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నగ్నంగా నడిరోడ్డుపై ఆయన నిలబెట్టేశారు.ఉండవల్లి అరుణ్ కుమార్ కి దీటుగా సమాధానం చెప్పలేకపోతే వైసీపీ సర్కారు పరువు పోతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటి నాయకులకు సమాధానం ఇచ్చినట్లుగా మసిపూసి మారేడు కాయ చేసేలా ప్రభుత్వం ప్రతివిమర్శలకు దిగితే మరో ప్రమాదం. వాటన్నిటిపై మళ్లీ ఉండవల్లి మీడియా సమావేశం పెడతారు. మరింతగా రచ్చ సాగుతుంది. ప్రభుత్వ ప్రతిష్ఠ ఇంకా దెబ్బతింటుంది. అందువల్ల ఈ రాజకీయ మేధావిని ఎదుర్కోవడమెలాగో తెలియక వైసీపీ ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పాత్రికేయ సమావేశం నిర్వహిస్తున్న సందర్బంలో ఆన్ లైన్ లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వీక్షించిన వారి సంఖ్య ఎంటర్టైన్ మెంట్ చానళ్లతో పోటీ పడిందనే మరో పిడుగులాంటి సమాచారమూ ప్రభుత్వానికి చేరింది. అందుకే సర్కారులో వణుకు మొదలైంది.సాధారణంగా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానాలిస్తుంటారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం తరఫున అధికారప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కి దీటుగా సమాధానం చెప్పగల రాజకీయ సత్తా సజ్జలకు లేదనే చెప్పాలి. ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటివారికి అన్ని కోణాల్లో సమాధానం చెప్పగల సామర్థ్యం లేదు. ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీలోని అగ్రనాయకుల జాతకమంతా ఉండవల్లికి తెలుసు. అందువల్ల రాజకీయ కోణంలో ఆయనకు గట్టిగా జవాబు చెప్పగల నేతలు వైసీపీలో కరవు అయ్యారు. అందుకే సమాధానం ఇవ్వకుండా సాధ్యమైనంతవరకూ మౌనాన్ని ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేదంటే భంగపాటుకు సిద్ధమై తాడోపేడో తేల్చుకునే క్రమంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకుంటే మాత్రం ఉండవల్లి వాదన ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది. ఇది రాజకీయంగా వైసీపీకి తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది.

Related Posts