YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

త్రిశంకు స్వర్గంలో ఎయిడెడ్ సంస్థలు

త్రిశంకు స్వర్గంలో ఎయిడెడ్ సంస్థలు

విజయవాడ, నవంబర్ 5,
ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఉసురు తీసిన ప్రభుత్వం వాటిలోని విద్యార్థులను త్రిశంకుస్వర్గంలోకి నెట్టింది. తమ విద్యా సంస్థను ప్రభుత్వానికి అప్పగించేయడంతో మూసేస్తున్నామని, విద్యార్థులు టిసిలు తీసుకోవాలని వెళ్లిపోవాలని ఆయా విద్యా సంస్థలు చెప్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో ఎక్కడిక్కడే ఆందోళనలకు దిగుతున్నారు. తమ పిల్లల చదువు ఏమి కావాలని ఆగ్రహం చేస్తున్నారు. ప్రభుత్వపరమైన, ప్రయివేట్‌కు మారిన ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్చించడంలో ప్రభుత్వం విఫలమైంది. దగ్గరలో ప్రయివేట్‌ విద్యా సంస్థలు అందుబాటులో లేకపోవడం, ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేకపోవడంతో ఈ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో, ప్రైవేట్‌కు మారిన, ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడిన ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోనే అత్యధిక మంది విద్యార్థులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రభుత్వానికి అప్పగించిన విద్యాసంస్థలు పూర్తిగా మూతబడితే రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థుల చదువు ప్రశ్నార్థకం కానుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో నామమాత్రపు ఫీజులు ఉండేవి. ఎయిడెడ్‌ నుంచి ప్రైవేటుకు మారిన విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలుకు సిద్ధం అవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారంతా పేదవర్గాలకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలలు కోర్టును ఆశ్రయించాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని 236 ఎయిడెడ్‌ పాఠశాలలకుగానూ వాటిలో 44 పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించాయి. ప్రైవేట్‌గా నిర్వహించుకోవడానికి ముందుకొచ్చిన 192 పాఠశాలల్లోని 11,750 మంది, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 14,333 మంది విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది.
గుంటూరు జిల్లాలో 365 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపిన 257 పాఠశాలల్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రసిద్ధి చెందిన హిందూ కళాశాల, ఆంధ్రా క్రైస్తవ కళాశాల, టిజెపిఎస్‌ కళాశాల సహా మొత్తం 33 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్‌పరం కావడంతో సుమారు 15 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడింది.
కడప జిల్లాలో 143 పాఠశాలలు ఉండగా వాటిలో 40 పాఠశాలల విలీనానికి అంగీకరించాయి. వీటిలో 15,256 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా అవే పాఠశాలల్లో తాత్కాలికంగా కొనసాగుతున్నారు.
కృష్ణా జిల్లాలో 270 పాఠశాలల్లో రెండింటిని ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. మిగిలిన 268 ప్రైవేట్‌ వైపు మొగ్గుచూపాయి. ఈ పాఠశాలల్లో 18,803 మంది చదువుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా 41 సిబిసిఎన్‌సి మిషనరీ పాఠశాలల వివరాలను జిల్లా అధికారులు సేకరించలేదు. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి హిందూ కళాశాల, ఆంధ్ర జాతీయ కళాశాల, హిందూ కళాశాలలు ప్రయివేట్‌గా మారడంతో ఫీజుల మోత మోగింది.
నెల్లూరు జిల్లాలో 120 ఎయిడ్‌ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన విఆర్‌ విద్యా సంస్థలతో పాటు మొత్తం పది విద్యాసంస్థలు ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. మిగిలిన విద్యా సంస్థలన్నీ ప్రైవేట్‌కు మొగ్గు చూపాయి. వాటిలో సమారు 12 వేల మంది చదువుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఐదు ఉన్నాయి. వాటిలో పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించింది. మిగిలిన వాటిలో ప్రసిద్ధి చెందిన విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాల, మహారాజా ఉమెన్స్‌ కాలేజీ, బొబ్బిలిలోని రాజా కళాశాల, గిరవిడిలోని ఎస్‌డిఎస్‌ కళాశాల ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి. వాటిలో సుమారు రెండు వేల మంది చదువుతున్నారు. 70 పాఠశాలల్లో 33 పాఠశాలలు ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి.
చిత్తూరు జిల్లాలోని 54 పాఠశాలల్లో 49 పాఠశాలలు ప్రైవేట్‌పరం అయ్యాయి. వాటిలో సుమారు నాలుగు వేల మంది చదువుతున్నారు. వీటిలో వందలాది మంది చదువుతున్నారు.
విశాఖ జిల్లాలో 89 పాఠశాలల్లో 62 ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి. వాటిలో 9,606 మంది చదువుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఎఎంఎఎల్‌ కళాశాల, ఎవిఎన్‌ కళాశాల ప్రయివేట్‌ వైపు మొగ్గు చూపింది.

Related Posts