YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

నలభై రోజులపాటు కొనసాగించే ఆధ్యాత్మిక సాధన.. అయ్యప్పదీక్ష

నలభై రోజులపాటు కొనసాగించే ఆధ్యాత్మిక సాధన.. అయ్యప్పదీక్ష

హైదరాబాద్ డిసెంబర్ 7
కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు దక్షిణాపథంలో అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఒక్క రోజు చేసే వ్రతం కాదిది. ఒక్క పూట ఉండే ఉపవాసం అంతకన్నా కాదు! నలభై రోజులపాటు కొనసాగించే ఆధ్యాత్మిక సాధన. అత్యంత నియమ నిష్ఠలతో దీక్ష కొనసాగిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతారు. నిత్యం అయ్యప్పస్వామి సేవలో తరిస్తారు. దీక్ష ముగింపులో శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని పవిత్రులుగా తిరిగివస్తారు.
అందరూ స్వాములే
దీక్ష ధరించింది మొదలు ఆ వ్యక్తిని ‘స్వామి’ అనడం నియమం. దీక్ష తీసుకున్న వ్యక్తి కూడా అందరినీ ‘స్వామి’ అనే పిలుస్తాడు. ‘నా రుద్రో రుద్రమర్చయేత్‌’ అంటుంది మహన్యాసం. రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి. లేకపోతే శివారాధనకు అధికారం ఉండదంటారు. అయ్యప్పదీక్షకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. దీక్షధారుడు తాను స్వయంగా ‘స్వామి’గా మారి అయ్యప్పస్వామిని అర్చించడం ఇక్కడ ఉద్దేశం. తనలో, ఎదుటివాడిలో ఉన్న పరమాత్మను గుర్తించి, తనను తాను సంస్కరించుకోవడం దీక్ష ద్వారా కలిగే ప్రయోజనం. పరమాత్మగా భావిస్తున్న దేహాన్ని.. దైవాన్ని ఎంత పవిత్రంగా దర్శిస్తామో, అంత పవిత్రంగా చూసుకోవాలి. అందుకే కఠిన నియమాలు పాటిస్తారు స్వాములు. భూతల శయనం ఆత్మ నిగ్రహాన్ని ఇస్తుంది. శీతల స్నానం శారీరక శక్తిని ప్రసాదిస్తుంది. సాత్విక భోజనం జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది.
అయ్యప్ప‘శరణుఘోష’
అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. మండల దీక్షలో నిత్యం శరణు ఘోషతో హరిహర పుత్రుణ్ని కీర్తిస్తారు. భక్తి పారవశ్యంలో తన్మయులవుతారు. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలదాయినిగా చెబుతారు. శరణాగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం.
ఇరుముడితో...
మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది. ఆ రెండూ భక్తి, శ్రద్ధ. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. తర్వాత దీక్షాపరులు పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో అయ్యప్ప మాల తీయించుకుంటారు. ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్ష విరమణ చేస్తారు. దీక్షనిచ్చిన గురుస్వామితో దీక్ష విరమణ చేయించవచ్చు. దీక్ష విరమణతో మళ్లీ పాత అలవాట్లకు లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ సార్థకం కాదు. మాల విరమించినా.. నియమాలు లేకున్నా.. వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కొనసాగించాలి. జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.
మెట్టు మెట్టూ ప్రత్యేకం
శబరిమలలో స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీన్నే పదునెట్టాంబడి అంటారు. అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని పురాణ కథనం. అందుకే ఈ క్షేతాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఈ మెట్లను మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీకగాచెబుతారు. అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 ఏండ్లు పందలం రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో కొలువుదీరడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్ర్తాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లు కాగా అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని పురాణ కథనం.
శాస్తారం ప్రణమామ్యహం
శివ, కేశవ సంయోగరూపమైన అయ్యప్పస్వామి యోగ, జ్ఞానమయ మంగళమూర్తిగా శబరిగిరి మీద భక్తులకు దర్శనమిస్తున్నారు. అయ్యప్పకు ‘ధర్మశాస్త’ అనే పేరుంది. ఇది ధర్మం, ఇది యోగం అని శాసించి ఆచరింపజేసేవాడు కనుకనే గురు స్వరూపుడైన అయ్యప్పను ‘శాస్త’ అన్నారు. అయ్యప్ప నిరంతరం చిన్ముద్ర ధరించి ఉంటాడు. బొటనవేలు, చూపుడు వేలు కలిపి ఉంచటాన్ని చిన్ముద్ర అంటారు. జ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తి చిన్ముద్ర ధరించి ఉంటాడు. అయ్యప్పకూడా ఈ ముద్ర ధరించటమంటే ఈ స్వామి దక్షిణామూర్తి స్వరూపమని భావిస్త్సారు.

Related Posts