YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అడుసు తోక్కనేలా?..కాలు కడుగనేలా?

అడుసు తోక్కనేలా?..కాలు కడుగనేలా?

అమరావతి డిసెంబర్ 15
రాష్ట్రం ఆర్థిక భారాన్ని దాటే స్థాయి దాటిపోయింది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహకరించండి అని పార్లమెంట్లో కేంద్రాన్ని కోరడం. మరోవైపు.. అప్పులున్నాయని తెలుసు. కానీ నవరత్నాల పేరుతో ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచడం. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేయిదాటి పోయిందని కేంద్రమే ఆదుకోవాలని వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి లోకసభలో పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని చెప్పడానికి ఈ ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనం. అలాంటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాగా తెలిసి కూడా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఉచితంగా డబ్బులు అందించడం ఎంతవరకూ సమంజసమని వైసీపీ ప్రభుత్వాన్ని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడం ప్రభుత్వాల విధి. వివిధ పథకాల ద్వారా వాళ్లకు డబ్బులు అందించి ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ ప్రభుత్వానికే రాబడి లేనప్పుడు రోజువారీ పాలన సాగేందుకే అప్పులు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఇక ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచడం ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ఉండాలి. అందులో సందేహమే లేదు. కానీ ఇలా ఉచిత డబ్బు పంపిణీ కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రజలకు ఉద్యోగా అవకాశాలు కల్పిస్తూ వాళ్లను ఆదుకోవాలి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వండి అని కేంద్రాన్ని కోరితే అందరూ హర్షిస్తారు. కానీ ప్రజలకు ఉచిత నగదు పంపిణీ కార్యక్రమాల కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించి కేంద్రాన్ని ఆదుకోమంటే దానికి ఎవరూ సమ్మతించరు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీలు గుర్తుంచుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. ఏపీ అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంది. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పెండింగ్ బిల్లుల కోసం ధర్నా చేస్తూ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. మరోవైపు పీఆర్సీ తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు లేవని స్వయంగా వైసీపీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోని ఇవన్నీ పక్కనపెట్టి నవరత్నాల పేరుతో డబ్బు పంచడానికే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది అనుకుందాం.. కానీ ఆ డబ్బులు సక్రమంగా వాడుకుంటున్నారా? అంటే అదీ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా డబ్బులు పంచే కార్యక్రమాలకు కేంద్రాన్ని సాయం చేయమంటే అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం నెరవేర్చలేదని పోలవరం రెవెన్యూ లోటు పెట్రో కారిడర్ వెనుకబడిన జిల్లాలకు నిధుల వంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో పేర్కొన్నారు. తమ రాష్ట్రం ఆర్థిక భారాన్ని భరించే స్థాయి దాటిపోయిందని ఆయన వాపోయారు. రాష్ట్ర భవిష్యత్పై చాలా ఆందోళన చెందుతున్నామన్నారు. కానీ దానికి గల కారణాలను వైసీపీ ప్రభుత్వం విశ్లేషించుకుంటే మేలనే రాజకీయ మేధావులు చెబుతున్నారు. కేంద్రాన్ని సాయం అడిగే ముందు రాష్ట్రంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Related Posts