YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అనసూయ పుత్ర దత్తాత్రేయ.

అనసూయ పుత్ర దత్తాత్రేయ.
చెట్టు కనిపిస్తుంది. పుట్ట కనిపిస్తుంది. పాము కనిపిస్తుంది. పక్షి కనిపిస్తుంది. ఆకాశం కనిపిస్తుంది. భూమి కనిపిస్తుంది. పచ్చటి ప్రకృతి కనిపిస్తుంది. ఇవన్నీ దృశ్యాలు. ఇలాంటి దృశ్యంగా గురు తత్వాన్ని ఆవిష్కరించినవాడు దత్తాత్రేయుడు.
కృతయుగంలో భూమ్మీదకు వచ్చినవాడు ఇప్పటికీ పిలిస్తే పలుకుతాడంటాయి పురాణాలు.
దత్త నామ స్మరణ చాలా శక్తిమంతమైనదంటారు దత్తోపాసకులు.
విచిత్రంగా, వింతగా, అంతుపట్టని విధంగా, మార్మికంగా, ధార్మికంగా ఉండే ఈ మూడు తలల శిశువు ముల్లోకాలను ఏలే త్రిమూర్తుల స్వరూపమే. నాలుగు కుక్కలు వేదాలుగా, గోవు ధర్మంగా నిలబడే ఈ దివ్య రూపం సూర్యుడి వెలుగులను తలదన్నుతుంది. 
అత్రి మహర్షి, అనసూయల ఏనాటి పుణ్యఫలమో దత్తుడిగా ముల్లోకాలను ఏలే అధిపతుల మూల స్వరూపంగా వెలశాడు. 
ఆధ్యాత్మిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
భగవంతుడిని చూపించిన గురువే శిష్యుడికి ప్రాణం, జీవం, ఆత్మ. చరాచర విశ్వం నడవడానికి కారణం జ్ఞానమే. ప్రపంచం మధ్యలో గురువున్నాడు. గురువు మధ్యలో ప్రపంచం ఉంది. 
ఈ ఎరుక కలిగించినవాడు గురుదత్తుడు.
ఈ అంధకారబంధురమైన ప్రపంచంలో గురువే వెలుగు.
 అతడు మానవ రూపంలోనే ఉండనవసరం లేదు. 
ఏ జీవి లేదా ఏ వస్తువైనా గురువుగా ఉండవచ్చునని దత్తుడు చెప్పాడు.
ఆ విధానంలోనే తనకు ఇరవై నాలుగు మంది గురువులని చెప్పాడు. 
దీని లోని అంతరార్థం ఏమిటంటే, ఎక్కడనుంచైనా మనం జ్ఞానం పొందవచ్చు అని. 
గురువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 
శిష్యుడే తయారు కావాలి!
తాను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తన గురువులనుంచే నేర్చుకున్నానని దత్తాత్రేయుడు చెప్పాడు. 
చిన్నా, పెద్దా అని లేదు. మనలో నేర్చుకునే గుణం ఉంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తునే ఉంటారని ఆయన దివ్యజీవనం తెలియజేసింది.
మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుడు అవతరించిన రోజు. దీన్ని దత్తజయంతి అనీ అంటారు. 
త్రిమూర్తులు ముగ్గురూ తమను తాము సమర్పించుకుని, అనసూయకు బిడ్డలయ్యారు. 
ఆ మహాతల్లికి పరీక్ష పెట్టారు. 
ఆ పరీక్షలో ఆమె విజయం సాధించింది. 
దత్తుడి తల్లిగా ఆమె లోక ప్రసిద్ధి పొందింది.
అత్రి మహర్షి పేరు కలిసి అతడు దత్తాత్రేయుడిగా గుర్తింపు పొందాడు.
దత్త సంప్రదాయంలో దత్త పూర్ణిమ చాలా విశిష్టమైన రోజు.
 దత్తాత్రేయుడి ప్రస్తావన రామాయణ, మహాభారతాల్లో కావ్యాల్లో కనిపిస్తుంది. 
పలు దత్త సంప్రదాయాలు ఉన్నాయి. 
దత్తాత్రేయుడికి ప్రాచీన శిష్యగణం ఉంది. 
శ్రీగురు చరిత్ర సంప్రదాయానికి మూలం దత్తాత్రేయుడు. 
ప్రముఖ దత్తావతారాలుగా చెప్పేవారందరూ ఈ సంప్రదాయం నుంచి వచ్చినవారే.
తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం, దత్తాత్రేయుడు గౌతమీ నది ఒడ్డున తపస్సు చేసి శివుణ్ని ప్రార్థించి, బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. 
కోట్లాది హిందువుల పూజలందుకుంటున్న దత్తాత్రేయుడు, భారతీయ చింతనలో అత్యున్నత దివ్య సారాంశమైన గురువుగా, దైవంగా పేరొందాడు. ఈయన ‘త్రిపుర రహస్యం’ గ్రంథం రచించాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించాడు.
 

Related Posts