YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జ్ఞానహీనులు

జ్ఞానహీనులు
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు.
కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు.  హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు.   కానీ, అంతఃశుద్ధిని మించిన ఆభరణం లేదు.  దాన్ని దర్శించలేని వ్యక్తులు అజ్ఞానులుగా మిగిలిపోతారు.
పూర్వం జనక మహారాజు పండిత పరిషత్తు ఏర్పాటుచేశాడు. దానికి ఇంద్రాది దేవతలు కూడా హాజరయ్యారు.. ఋషులు, మునులు, వేదపండితులు ఎందరో పరిషత్తులో పాల్గొన్నారు.  ఆధ్యాత్మిక, తాత్విక విషయాలపై చర్చ మొదలైంది.  కాసేపటికి అష్టావక్రుడు ఆ సభకు వచ్చాడు.  జనక మహారాజు సింహాసనం నుంచి లేచి వచ్చి, అష్టావక్రుడికి సాదరంగా ఆహ్వానం పలుకుతాడు. ఉచితాసనంపై కూర్చోబెడతాడు. అష్టావక్రుణ్ని చూడగానే సభలోని పండితులంతా గొల్లుమని నవ్వుతారు  ఆయన శరీరంలోని వంకర్లను అందరూ హేళనగా చూడసాగారు..సభికులందరినీ చూసి అష్టావక్రుడూ పగలబడి నవ్వుతాడు. కాసేపటికి అంతా సర్దుకుంటుంది. సభ పూర్తయిన తర్వాత అందరూ ఎవరి విడిదికి వారు వెళ్లిపోతారు..
సభా మంటపంలో అష్టావక్రుడు, జనకుడు మాత్రమే ఉంటారు. అప్పుడు జనకుడు మునిని సమీపించి.. ‘స్వామీ! సభలోని వారంతా మిమ్మల్ని చూసి నవ్వినందుకు వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను’ అన్నాడు. దానికి అష్టావక్రుడు ఫరవాలేదన్నట్లుగా తలూపుతాడు. కానీ, అష్టావక్రుడు ఎందుకు పగలబడి నవ్వాడో ఇంకా జనక మహారాజుకు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయనను అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు ‘మహారాజా! మీ సభలో వేదవేదాంగాలు ఔపోసన పట్టిన పండితులున్నారు. కానీ, వారు జ్ఞానహీనులు.  అందుకే వారిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాను’ అంటాడు. అంతటి పండితులను జ్ఞానహీనులు అనడంతో ఆశ్చర్యపోతాడు జనకుడు. అప్పుడు అష్టావక్రుడు ‘జనక మహారాజా! నువ్వు పండితులు, ఋషులు అని పరిచయం చేసినవారంతా భౌతికదృష్టి కలవారు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, అనుభవంలో లేకపోతే అది మనిషిని కడతేర్చలేదు.  ఈ విద్వాంసులు     నా భౌతికదేహాన్ని చూశారే కానీ, దేహంలో వెలుగుతున్న ఆత్మను చూడలేకపోయారు.  వారిది భౌతిక దృష్టే కానీ ఆధ్యాత్మిక దృష్టి కాదు. శవంతో సమానమైన దేహాన్ని చూశారే కానీ, శివ స్వరూపమైన ఆత్మను గుర్తించలేకపోయారు.  వారిది బాహ్య దృష్టి మాత్రమే!  అంతర్‌ దృష్టి కాదు. ఏనాడైతే వాళ్లు సూక్ష్మదృష్టిని, ఆత్మదృష్టిని పెంపొందించుకుంటారో నాడే వాళ్లు నిజమైన పండితులు అనిపించుకుంటారు. 
కాబట్టి రాజా! పండితులు కేవలం శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సరిపోదు, ఆత్మానుభూతిని, దైవదృష్టిని అలవరచుకోవాలి. అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది’ అని వివరిస్తాడు. అష్టావక్రుడి సందేశం ఏ కాలానికైనా అన్వయమవుతుంది. అధికారం, హోదాను బట్టి మనుషుల స్థాయిని గుర్తిస్తున్నారు.  మంచితనానికి ఆస్తిపాస్తులు కొలమానాలు కావనే సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.  ఎవరికివారు పదిమందిలో గొప్పగా కనిపించడానికి లేనిపోని ఆర్భాటాలకు పోతున్నారు. నలుగురిలో గొప్పగా ఉండాలని తాహతుకు మించి ఖర్చుచేస్తున్నారు. కారణం, ఎదుటివారు తనను తక్కువగా అనుకుంటారనే భ్రమ! కానీ, ‘నువ్వు నువ్వుగా ఉండగలగడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండద’న్న సత్యాన్ని విస్మరిస్తున్నారు.. ఎవరి మెప్పు కోసమో ఆ గుణాన్ని వదులుకోవడం అజ్ఞానమే అవుతుంది. అలాగే, ఒక మనిషిని వారి రూపం, స్థాయిని బట్టికాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించడం నేర్చుకోవాలి.. ఎలాగైతే నిన్ను అవతలివాళ్లు గుర్తించాలని భావిస్తున్నావో, అలాగే నువ్వూ వారిని గుర్తించగలగాలి’ అన్నది సత్యం.  అదే ఆ మనిషి వ్యక్తిత్వమై ప్రకాశిస్తుంది..

Related Posts