YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర అలా...తెలంగాణ ఇలా

ఆంధ్ర అలా...తెలంగాణ ఇలా

హైదరాబాద్, డిసెంబర్ 27,
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు తగ్గిస్తే.. తెలంగాణలో మాత్రం టికెట్ ధరలు పెంచడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేయగా.. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. తెలంగాణ సర్కారు నిర్ణయంపై టాలీవుడ్‌లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇది సినిమా థియేటర్ల మనుగడకు.. సినిమా మీద బతికే వేలాదిమంది కార్మికులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మేలు చేస్తుందని సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని పలువురు ఫిల్మ్‌మేకర్స్ పేర్కొంటున్నారు. అయితే తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపు విషయంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారని తెలిసింది. చిరంజీవి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయం మీద చర్చలు జరిపి.. ధరలు పెంచుకోడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని స్పష్టమైంది. ఇప్పటికే హైదరాబాద్ దేశంలో ప్రముఖ సినీ కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడి సినిమా స్టూడియోలలో తెలుగు సినిమాలే కాదు తమిళం, మలయాళం, కన్నడ భాషల చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకుంటున్నాయిసినిమా షూటింగ్‌ల అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలం క్రితం సింగిల్ విండో సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అవసరమైతే థియేటర్లలో ఐదవ షోకు కూడా ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు అవకాశం కల్పించడంతో ఫిల్మ్‌మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ సానుకూల నిర్ణయాలన్నీ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఫిల్మ్‌మేకర్స్ చెబుతున్నారు.ఇండియాలో మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ టాప్‌లో ఉంది. అందుకు తగ్గట్టుగానే మన సినిమాల నిర్మాణం ఉండేలా.. నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా వారం రోజులు మాత్రమే థియేటర్‌లో ఉండే పరిస్థితి వచ్చింది. పైరసీ, ఓటీటీలను తట్టుకొని ఆ వారంలోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తక్కువ టికెట్ ధరలతో సినిమాకు పెట్టిన బడ్జెట్ రికవరీ చేయలేమని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ అభిప్రాయ పడుతున్నారు. అందుకే టికెట్ ధరల మీద పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుతో నిర్మాతలు ఎంతో ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన సెంటర్లతో పాటు అత్యధిక థియేటర్లు ఉన్న హైదరాబాద్‌లో సినిమాలు వారం రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడితే నైజాం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చినట్టే.రాబోయే రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్, రాధే శ్యామ్‌తో సహా పలు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టికెట్ ధరల పెంచుకునేందుకు అవకాశం కల్పించడం నిర్మాతలకు ఎంతో ఊరటనిచ్చింది. వాస్తవానికి ఒక సినిమా విడుదలైతే నిర్మాతలే కాకుండా బయ్యర్లు, థియేటర్ యజమానులు, క్యాంటీన్ నిర్వాహకులు, థియేటర్‌లోని పార్కింగ్ సిబ్బంది.. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బతుకుతుంటాయి. థియేటర్లు సవ్యంగా నడిస్తే వాటిపై ఆధారపడి జీవించేవారు సంతోషంగా ఉంటారు. అయితే ఏపీలో పరిస్థితులు ఇలాగే కొనసాగి థియేటర్ల నిర్వహణ కష్టంగా మారితే.. వచ్చే రెండేళ్లలో సింగిల్ థియేటర్లు చాలా వరకూ సూపర్ మార్కెట్లుగా, కల్యాణ మండపాలుగా రూపాంతరం చెందుతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడ గత కొన్ని రోజులుగా ఏపీలో పలు థియేటర్లు మూతపడ్డాయి. రాబోయే రోజుల్లో థియేటర్ల పరిస్థితి మరింత కష్టంగా మారనుందని అంటున్నారు.తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమపై భిన్న కథనాలు వినిపించాయి. చిత్ర పరిశ్రమ విశాఖ తరలిపోతుందని, – నెల్లూరు వెళ్తుందని… ఎక్కడికి వెళ్లదు, ఇక్కడే ఉంటుందని… పలువురు సినీ ప్రముఖులు చెబుతూ వచ్చారు. అయితే అన్ని విధాల హైదరాబాద్‌లో స్థిరపడిన చిత్ర పరిశ్రమ వారు కదిలే అవకాశం ఏమాత్రం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో వారు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వైజాగ్‌ను సినిమా ఇండస్ట్రీ హబ్ చేస్తామని అప్పటి ఏపి పాలకులు అన్నారు. భీమిలి ప్రాంతంలో 316 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. అదే సమయంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ పరిస్థితులలో కొందరు తెలుగు సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఇక్కడే ఉందామా? అటు వెళ్దామా? అని ఆలోచించారు. చివరికి ఎక్కువమంది హైదరాబాద్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఎందరో సినీ ప్రముఖుల కృషి వల్ల టాలీవుడ్ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చింది. భాగ్యనగరంలో ఎన్నో అందమైన ప్రాంతాలున్నాయి. షూటింగ్‌కు అనువైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి చాలా సినిమాలు హైదరాబాద్‌లోనే తెరకెక్కుతున్నాయి. ఇక్కడ చార్మినార్, గోల్కొండ లాంటి చారిత్రక కట్టడాలున్నాయి. అవికూడా తెలుగు సినిమాకు వరంగా మారాయి. ఈ చారిత్రక ప్రాంతాల్లో తెలుగు సినిమాలే కాదు దక్షిణాది భాషా చిత్రాలు, బాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. అదేవిధంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్న స్టూడియోలు షూటింగ్‌కు ఎంతో అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది సినీ ప్రముఖులు నివాసముంటున్నారు. అదేవిధంగా పాతబస్తీ నేపథ్యంలో కూడా చాలా సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయితే వైజాగ్‌లో కూడా పలు సినిమాల షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆర్‌కె బీచ్‌తో పాటు అందమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీంతో కొందరు నిర్మాతలు, దర్శకుల చూపు విశాఖ వైపు ఉంది.మరి కొందరు ఇక్కడ, అక్కడ రెండు చోట్ల చిత్ర పరిశ్రమ కొనసాగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు వైజాగ్‌లో భూములు కూడా కొనుగోలు చేశారు. కానీ ఇప్పటికే సినీ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు వైజాగ్‌లో సమకూరడానికి చాలా కాలం పడుతుంది. దీంతో ఎక్కువ మంది సినీ ప్రముఖులు హైదరాబాద్‌లోనే తెలుగు చిత్ర పరిశ్రమ కొనసాగడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. వైజాగ్‌లో తరచుగా వచ్చే తుఫానులు, భారీ వర్షాల కారణంగా సినీ స్టూడియోలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిస్క్ చేయడం ఎందుకని హైదరాబాద్‌లోనే టాలీవుడ్ కొనసాగాలని అనుకుంటున్నారు. దీంతో పాటు తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts