YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉదయగిరి వైసీపీలో రచ్చ

ఉదయగిరి వైసీపీలో రచ్చ

నెల్లూరు, డిసెంబర్ 27,
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే. వైసీపీ నేత. విపక్షపార్టీలు ఆందోళన చేయాల్సిన చోట.. తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ కేడర్‌ రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉదయగిరిలో ఉంది. పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలు ఎమ్మెల్యేకు.. కేడర్‌కు మధ్య దూరం పెంచింది. సొంతపార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారు నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వైరం బయటపడింది. వింజమూరు ఎంపీడీవో ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశారు వైసీపీ నేతలు. ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. వైసీపీ జిల్లా నేతలు జోక్యం చేసుకున్నా సమస్యను సర్దుబాటు చేయలేకపోయారంటే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.వరికుంటపాడులో పార్టీ పదవులను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మండల పార్టీ అధ్యక్షుడిని మూడుసార్లు మార్చడమే దానికి కారణమన్నది వారి వాదన. ఇదే సమయం అనుకున్నారో ఏమో.. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు సొంతపార్టీ నేతలు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా మామూళ్లు తప్పడం లేదని వారు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు ముందుగానే ప్రసన్నం చేసుకోవాలట. ఈ అంశాన్ని ఓపెన్‌గా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చాకిరేవు పెట్టేశారు వైసీపీ నాయకులు.పార్టీ పదవుల అమ్మకాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదన్నది ఉదయగిరిలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం చేస్తున్న వాదన. పార్టీ అధినేత జోక్యం చేసుకుంటేగానీ పరిస్థితులు గాడిలో పడబోవనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో స్థానిక నేతలను దూరం చేసుకోవడం వల్లే చంద్రశేఖర్‌రెడ్డి ఓడిపోయారని.. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు లేదన్నది అసమ్మతి నేతల ఆర్గ్యుమెంట్‌. దీంతో ఎమ్మెల్యే అన్న కుమారుడు.. మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి దగ్గరకు ఈ విషయాన్ని కొందరు తీసుకెళ్లారట. అయితే ఆ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని మంత్రి స్పష్టం చేశారట.బాబాయ్‌ తీరు నచ్చకే మంత్రి గౌతంరెడ్డి సైతం చంద్రశేఖర్‌రెడ్డితో అంటీముట్టనట్టు ఉంటున్నారని వైసీపీ వర్గాల కథనం. పైగా ఎమ్మెల్యేను ఒక అదృశ్యశక్తి నడిపిస్తోందని.. ఆ శక్తిని ఆర్థికంగా ప్రసన్నం చేసుకుంటేనే పనులు సాఫీగా సాగుతాయని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మరి.. ఉదయగిరిలో ఎమ్మెల్యేకు పార్టీ నేతలకు మధ్య వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు వైసీపీ పెద్దలు ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.

Related Posts