హైదరాబాద్, జనవరి 4,
సినిమా టికెట్ ధరలపై 2021 ఏప్రిల్‌లో జీవో నెంబర్ 35 విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే, కరోనా కారణంగా సినిమాలు విడుదల కాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ధరలు మరీ దారుణంగా ఉన్నాయని.. పెంచాలని నిర్మాతలు డిమాండ్ చేస్తూ వచ్చారు.అయితే, చర్చలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్న సమయంలో హీరో నాని చేసిన కామెంట్లు కలకలం రేపాయి. సినిమా కలెక్షన్ల కంటే కిరాణా కలెక్షన్లు బాగున్నాయన్నారు. దీనికి కౌంటర్‌గా హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే 80శాతం ఖర్చు తగ్గుతుందని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రులపై హీరో సిద్దార్ద సంచలన ఆరోపణలు చేశారు. మీ మా పన్నులతో అనుభవిస్తున్న మీ విలాసాలు తగ్గించుకుని జనాలకు డిస్కౌంట్ ఇవ్వాలని సలహా ఇచ్చారు.ఇదే సమయంలో టికెట్ ధరలు మరీ తక్కువగా ఉన్నాయని నిర్వహణ సాధ్యం కాదని జీవోపై కొందరు థియేటర్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో వారి పిటిషన్‌ను సస్పెండ్ చేసింది న్యాయస్థానం. తీర్పు వచ్చిన తర్వాత సోదాలు చేసిన అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉన్న థియేటర్లను మూసివేశారు. అయితే, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకరిద్దరిని టార్గెట్ చేసి మరీ ఇండస్ట్రీని దెబ్బకొడుతున్నారని ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేశాయి.వివాదం నడుస్తుండగానే సినిమాటోగ్రఫీ శాఖను పేర్ని నానికి అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో రంగంలో దిగిన మంత్రి అధికారులతో కూడిన కమిటీ వేశారు. అటు ఇండస్ట్రీ పెద్దలు కూడా మరో కమిటీ వేశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం వెనక పేదవాళ్లకు తక్కువ ధరలో వినోదం అందించడమే తమ లక్ష్యమని సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యానించారు. పేదవాళ్లకు మంచి చేస్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారని విపక్షాలను ఎండగట్టారు సీఎం.