YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పట్టు పరిశ్రమలకు కొత్త కష్టాలు

పట్టు పరిశ్రమలకు కొత్త కష్టాలు

అనంతపురం, జనవరి 27,
కరోనా ప్రభావంతో పట్టు పరిశ్రమ పట్టుతప్పుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో రైతుల్లో నిర్లిప్తత నెలకొంది. బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్లకు రాష్ట్రప్రభుత్వం 2004 నుంచి కిలో రూ.50 చొప్పున రైతుకు ప్రోత్సాహకం అందిస్తూ వచ్చింది. అయితే గడిచిన రెండేళ్లుగా ఈ ప్రోత్సాహకం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.12 కోట్లు వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో లభిస్తోన్న ధర కన్నా కర్నాటకలో అధికంగా లభిస్తుండటంతో రైతులు అటువైపు ఆసక్తి చూపుతున్నారురాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.11 లక్షల ఎకరాల్లో మల్బరీ పంట సాగవుతోంది. సుమారు తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల పట్టు ఉత్పత్తి అవుతోంది. దేశంలోనే కర్నాటక తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా పట్టు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అధికంగా సాగవుతోంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 వేల ఎకరాల్లో పట్టు సాగులో ఉంది. ఏటా మూడు వేల మెట్రిక్‌ టన్నులకుపైగా ఉత్పత్తి వస్తోంది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో పట్టుగూళ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. 2020 కిలో పట్టుగూళ్ల ధర రూ.150 నుంచి 50కి పడిపోయింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. దక్కిన ధరకు తెగనమ్మారు. ప్రభుత్వం అందిచాల్సిన ప్రోత్సాహం అందిస్తే కొంతలో కొంతైనా నష్టాన్ని పూడ్చికోవచ్చని రైతులు భావించారు. అయితే రాష్ట్రప్రభుత్వం వారి ఆశలకు గండికొట్టింది. రెండేళ్ల నుంచి ప్రోత్సాహమే ఇవ్వలేదు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఈ రకంగా సుమారు రాష్ట్రవ్యాప్తంగా 2400 మెట్రిక్‌ టన్నులకు ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. ఒక్క అనంతపురం జిల్లా పరిధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయల ప్రోత్సాహకం పెండింగులో ఉంది.గడిచిన రెండేళ్లుగా పట్టుగూళ్లకు ఆశించిన ధర రావడం లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెటులో కిలో రూ.150 నుంచి 180 పలుకుతోంది. అయితే కర్నాటక రాష్ట్రంలో కిలో రూ.500 నుంచి 600 పలకడంతో అధికశాతం రైతులు అటువైపు ఆసక్తి చూపుతున్నారు. మనరాష్ట్రంలో పట్టుగూళ్లను అమ్మితే రాష్ట్రప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తే ఎటువంటి ప్రోత్సాహకం అందదు. గడిచిన రెండేళ్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టుగూళ్లకు ప్రోత్సాహకం అందించకపోవడంతో చాలా మంది రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని వదులుకొని కర్నాటక మార్కెటుకు పట్టుగూళ్లు తరలిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కుతామనే ఆశతో కర్నాటకకు తరలిస్తున్నామని పలువురు రైతులు తెలిపారు.

Related Posts