YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రతి ఇంట్లో జలుబు, దగ్గులు

 ప్రతి ఇంట్లో జలుబు, దగ్గులు

హైదరాబాద్, జనవరి 27,
రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు.. కొందరిలో అన్ని లక్షణాలూ ఉంటే.. మరికొందరు ఏదో ఓ లక్షణంతో కనిపిస్తున్నారు. కొందరు స్వల్పంగా ఇబ్బందిపడుతుంటే.. ఇంకొందరు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా.. కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వర సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైన తర్వాత ఇప్పుడు బాధితుల సంఖ్య భారీ స్థాయిలో కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇంటింటికి ఆరోగ్యం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత జ్వర సర్వే మూడు రోజులుగా సాగుతోంది. 25 వేల మంది ఏఎన్‌ఎంలు, 7వేల మందికిపైగా ఆశా కార్యకర్తలు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్ల చొప్పున సర్వే చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. కోవిడ్‌ లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42.30 లక్షల ఇళ్లకు సర్వే బృందాలు వెళ్లాయి. జ్వరం, జలుబు, గొంతునొప్పి ఇతర లక్షణాలు ఉన్న 1,78,079 మందిగా గుర్తించి.. హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశాయి. ఆదివారం ఒక్కరోజే 13.04 లక్షల ఇళ్లలో సర్వే చేయగా.. 50,833 మందిలో లక్షణాలను గుర్తించి, కిట్లు అందజేశారు. అయితే సర్వే సందర్భంగా కొందరు పరీక్షలకు అంగీకరించడం లేదని వైద్యారోగ్యశాఖ సిబ్బంది చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం వంటి జిల్లాల్లో కనిపిస్తోందని అంటున్నారు.
జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి...
– ఉమ్మడి వరంగల్‌లో 1,03,021 ఇళ్లలో సర్వే నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో 22,375 ఇళ్లను పరిశీలిస్తే.. 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో 250 మందిని పరీక్షిస్తే.. 60 మందికి జలుబు, జ్వరం ఉన్నట్లు వెల్లడైంది. జనగామ జిల్లాలో 98,292 గృహాల్లో సుమారు 5 వేల మందికి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 17,759 ఇళ్లలో 1,892 మందికి లక్షణాలున్నట్టు గుర్తించారు.
– నల్లగొండ జిల్లాలో 1,30,558 ఇళ్లలో సర్వే చేసి 4,519 మందికి కిట్లను అందజేశారు.
– ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5,41,763 ఇళ్లలో సర్వే పూర్తికాగా.. జ్వరం, జలుబు తదితర లక్షణాలతో 14,875 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు.
– ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 9,603 మందికి, నిజామాబాద్‌ జిల్లాలో 4,164 మందికి కిట్లను అందజేశారు.
– ఖమ్మం జిల్లాలో 1,33,150 ఇళ్లలో సర్వే చేసి, 4,604 మంది బాధితులను గుర్తించారు.
– సంగారెడ్డి జిల్లాలో 7,465 మందికి, మెదక్‌ జిల్లాలో 4,999 మందికి, సిద్ధిపేట జిల్లాలో 2,956 మందిని ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు.

Related Posts