YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రబీలోనూ తగ్గిన పంటల సాగు

రబీలోనూ తగ్గిన పంటల సాగు

ఏలూరు జనవరి 31,
ఈ తడవ రబీలోనూ పంటల సాగు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాన్లు, భారీ వర్షాలు కరువు, కరోనా, గిట్టుబాటు లేమి వలన ఖరీఫ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగున్నర లక్షల ఎకరాల్లో సేద్యం లేకపోగా, రబీలో సైతం అదే ధోరణి కొనసాగుతోంది. రబీలో ఇప్పటి వరకు కావాల్సిన సాగులో 4.32 లక్షల ఎకరాల తగ్గుదల ఉంది. తొమ్మిది శాతం విస్తీర్ణం బీడు పడింది. ఆహారధాన్యాలే 3.40 లక్షల ఎకరాలు తగ్గాయి. ఇప్పటికి వరి బటాబటిన పడగా, చిరుధాన్యాలు, పప్పులు, నూనెగింజలు సహా అన్ని పంటలూ సాధారణ స్థాయి కంటే తక్కువ సాగయ్యాయి. అక్టోబర్‌ 1 నుండి రబీ మొదలవగా, సీజన్‌లో నాలుగు నెలలు గడిచినా సాగులో లోటు కొనసాగుతోంది. ఇంకా సమయం నెల రోజులే ఉన్న నేపథ్యంలో సాగు ఏ మేరకు సాగుతుందో సందేహాత్మకమైంది. రబీ సాధారణ సాగు 22.91 లక్షల హెక్టార్లు కాగా జనవరి 27 నాటికి 20.90 లక్షల హెక్టార్లలో సాగు కావాలి. కానీ 18.36 లక్షల హెక్టార్లలోనే పంటల సేద్యం జరిగింది. లోటు 1.73 లక్షల హెక్టార్లు (4.32 లక్షల ఎకరాలు). ఆహార పంటలు ఇప్పటికే 8 శాతం తగ్గాయి. ఈ మారు వరి సాగుపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు వేయమంది. కృష్ణా డెల్టాలో వరి నాట్లకు నీళ్లివ్వలేమని పేర్కొంది. దాంతో రబీలో వరి సాగు నిరుటి మీద తగ్గుతుందని అందరూ ఊహించారు. ఇప్పటికైతే బటాబటిన నాట్లు పడ్డాయి. నెల్లూరు, ఉభయగోదావరిలో వరి సాగు కాస్త పెరగ్గా, కృష్ణాలో గతేడాది ఈపాటికి 21 వేల హెక్టార్లలో వరి నాట్లు పడగా ఈ తడవ మూడు వేల హెక్టార్లలోపు నాట్లు పడ్డాయి. ప్రత్యామ్నాయ పంటలన్నా వాటి సాగు పెరిగింది లేదు. చిరుధాన్యాలు 22 శాతం తగ్గాయి. మొక్కజన్న సైతం పది శాతం లోటులో ఉంది. పప్పుధాన్యాల సాగు 8 శాతం తగ్గింది. మామూలుగా రబీలో పప్పుశనగ ఎక్కువ సాగవుతుంది. ఆ పంట సైతం 9 శాతం తగ్గింది. కర్నూలులో బాగా తగ్గింది. పెసర 17 శాతం తగ్గగా, మినుములు మాత్రం రెండు శాతం ఎక్కువ సాగయ్యాయి. వాణిజ్య పంటలు మిరప, పొగాకు సైతం తక్కువగానే సాగయ్యాయి.జిల్లాలవారీగా విశాఖపట్నంలో అతి తక్కువ 59 శాతం సాగు నమోదైంది. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరులో వంద శాతానికి మించి పంటలు సాగయ్యాయి. తతిమ్మా జిల్లాల్లో 70-90 శాతం సేద్యం జరిగింది.

Related Posts