YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

ఎంబీఏ కాలేజీల్లో దోపిడీ

ఎంబీఏ కాలేజీల్లో దోపిడీ

హైదరాబాద్, ఫిబ్రవరి 7,
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు. టాప్‌ కాలేజీల్లో ఎక్కువగా ఈతతంగం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓయూ పరిధిలో గుర్తింపు పొందిన 116 మేనేజ్‌మెంట్‌ కాలేజీలు, 16 ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కాలేజీలు నగర శివారులో ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 120 నుంచి 220 మంది విద్యార్థులు అడ్మిషన్స్‌ పొందుతారు. వాస్తవానికి ఇక్కడ అడ్మిషన్స్‌ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతోంది. ర్యాంక్‌ ఆధారంగా ఉచిత సీటు, కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల ద్వారా అడ్మిషన్స్‌ జరుగుతున్నాయి. ఫ్రీ సీటు పొందిన విద్యార్థి ఫీజు మొత్తం ర్యాంక్స్‌ ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. స్టూడెంట్స్‌ ఎటువంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదు. కన్వీనర్‌ కోట ఫీజును.. ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఒక్కో కాలేజీకి ఒక్కోరకంగా నిర్ణయిస్తుంది. కన్వీనర్‌ కోటాలో కళాశాల కొంత ఫీజు మినహాయింపునిస్తుంది. కాలేజీ ఫీజులు మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా మేనేజ్‌మెంట్‌ కోటాకు పూర్తి ఫీజు ఉంటుంది. ప్రయివేట్‌ కళాశాల యాజమాన్యానికి ఫీజులు వసూలు చేసుకునే పూర్తిస్థాయి అధికారం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో నిర్ణయించిన ఫీజును విద్యార్థియే భరించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు రూ.27 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది.ఓయూ పరిధిలో గుర్తింపు పొందిన కొన్ని కళాశాలలు 'ఫీజు రెగ్యులేటరీ అథారిటీ' నిర్ణయించినట్టు కాకుండా విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో అదనంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి డోనేషన్లు వసూల్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా డొనేషన్ల పేరు మీద విద్యార్థులు ఆర్థికంగా నిలువు దోపిడీకి గురవుతున్నా ఉన్నత విద్యామండలిగానీ, ఓయూ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. సదరు కాలేజీలపై నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డొనేషన్ల విషయంలో మేనేజ్‌మెంట్‌లను ప్రశ్నిస్తుంటే .. 'మేమెలా బతకాలి? ఇతర కాలేజీలు కూడా వసూల్‌ చేస్తున్నాయి కదా'' అంటూ సమాధానం వస్తోంది. డొనేషన్ల వసూళ్లపై పర్యవేక్షణ, నియంత్రణ కొరవడింది. కేశవ మెమోరియల్‌ కళాశాలపై విద్యార్థులు స్వయంగా ఓయూ ఆడిట్‌ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా డొనేషన్లు అధికంగా వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై ఓయూ, ఉన్నత విద్యామండలి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేశవ మెమోరియల్‌ కాలేజ్‌లో ఎంబీఏ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్ల ఫీజులు రూ.35 వేల చొప్పున 70 వేలు ముందుగానే చెల్లించాను. ఇది కాకుండా డొనేషన్‌ రూ.50 వేలు చెల్లించాలని యాజమాన్యం అడుగుతోందని విద్యార్థులు వాపోతున్నార1992లో మోహిణిజైన్‌ అండ్‌ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంపై తీర్పు విషయంలో.. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం డొనేషన్ల వసూలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. వసూలు చేస్తే ఆర్టికల్‌ 14ను ధిక్కరించినట్టేనని తీర్పులో స్పష్టం చేసింది. విద్య అనేది నైతిక విలువల్ని, సమానత్వాన్ని పెంపొందించేలా ఉండాలని సదరు ఆర్టికల్స్‌ సూచించింది. ఎంబీఏ కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

Related Posts