YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కౌలు రైతులకు ఇక మొండి చేయి..

కౌలు రైతులకు ఇక మొండి చేయి..

ఏలూరు, ఫిబ్రవరి 12,
వచ్చే ఏడాది సైతం కౌలు రైతుల భరోసాకు ప్రభుత్వం ఎగనామం పెట్టాలనే చూస్తోంది. రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ప్రారంభించి మూడేళ్లవుతుండగా లబ్దిదారుల సంఖ్య లక్ష లోపు కునారిల్లుతోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ అవే లక్ష్యాలను సర్కారు నిర్దేశించుకుంది. గడుస్తున్న ఏడాదిలో 89 వేల కౌల్దార్లకు భరోసా సాయం అందించగా, ఆ టార్గెట్‌ను వచ్చే ఏటా అలాగే కొనసాగించింది. రాష్ట్రంలో లక్షలాదిగా కౌలు రైతులు మట్టిని నమ్ముకొని పంటలు సాగు చేస్తుండగా, నిజంగా భూమిపై శ్రమ చేస్తున్న వాస్తవ సాగుదారులకు భరోసా నామమాత్రపు సంఖ్యలో కూడా అందించకపోవడం కౌలు రైతులకు తీరని వ్యధకు గురి చేస్తోందిరానున్న 2022-23 బడ్జెట్‌ కసరత్తులో ప్రభుత్వ పథకాలకు నిధుల ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. భూయజమానుల ఆమోదంతో సంబంధం లేకుండా నిజమైన కౌలు రైతులను గుర్తించి రుణాలను, ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని ఒక వైపు ఆందోళనలు జరుగుతుండగా, మరో వైపు ప్రభుత్వం కౌల్దార్ల డిమాండ్లను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మొత్తంగా భరోసా కేటాయింపులు రూ.4 కోట్లు మాత్రమే ఎక్కువ చేసింది. మొత్తం భరోసా బడ్జెట్‌ రూ.7,016 కోట్ల నుండి 7,020 కోట్లుగా చూపింది. వీటిలో పిఎంకిసాన్‌ నిధులు 3 వేల కోట్లు, రాష్ట్ర నిధులు 4,020 కోట్లు. పీఎం కిసాన్‌తో కలిపి రైతు భరోసా సాయం రూ.13,500 జమ చేస్తుండగా, కేంద్రం కౌల్దార్లకు మొత్తానికే మొండిచెయ్య చూపింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకుంటామన్నప్పటికీ, మూడేళ్లల్లో అత్యల్ప సంఖ్యలోనే లబ్ధి పొందారు. ప్రభుత్వం రాగానే 15 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి అని చెప్పగా 14 లక్షలకు పైగా కౌల్దార్లకు సాయం అందలేదు. స్కీం మొదలైన తొలేడాది 63 వేల మందికి, రెండవ ఏట 69 వేల మందికి, మొన్న మూడవ ఏట 89 వేల మందికి ఏడాదిలో రెండు విడతల్లో జమ చేశారు.కౌలు రైతుల గుర్తింపునకు సమయం పడుతుందన్న వంకతో ల్యాండ్‌ ఓనర్లకు ఖరీఫ్‌కు ముందు ఇచ్చే తొలి కిస్తుతో కౌలు రైతులకు ఇవ్వట్లేదు. ఓనర్లకు రెండవ కిస్తు వేసేటప్పుడు కౌల్దార్లకు రెండు కిస్తులూ ఒకేసారి వేస్తున్నారు.సిసిఆర్‌సి ఆధారంగా కౌలు రైతులకు అందించే భరోసాను సర్కారు అసెంబ్లీలో, బయటా విడిగా చూపించట్లేదు. అటవీ హక్కుల చట్టం కింద గుర్తించిన భూమి సాగుదారులతో (ఆర్‌ఒఎఫ్‌ఆర్‌) కలిపి చూపిస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ అదే పని చేసింది. 2021-22లో ఆర్‌ఒఎఫ్‌ఆర్‌, కౌలు రైతులు కలిపి 1.67 లక్షల మందికి భరోసా జమ చేశామని, 2022-23లో రెండు లక్షల మందికి ఇస్తామన్నారు. పెరిగే లబ్ధిదారుల సంఖ్య 33 వేలు మాత్రమే. అందులో ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ ఎంతమందో, సిసిఆర్‌సి రైతులెంతమందో విభజించలేదు. ప్రస్తుతం సిసిఆర్‌సి కార్డులు 4 లక్షలు జారీ చేసి 89 వేల మందికి భరోసా సాయం చేశారు. వచ్చే ఏడాది లబ్ధిదారుల సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. సిసిఆర్‌సిల జారీ తగ్గితే అది కూడా ఉండకపోవచ్చంటున్నారు. ఇదిలా ఉండగా ఇచ్చే కార్డులే తక్కువ కాగా వాటిలోనూ బోగస్‌, బినామీ, అనర్హులు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి.

Related Posts