YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్నడ పీఠం ఎవరికి..?

కన్నడ పీఠం ఎవరికి..?

కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోళ్లన్నీ ఒకవైపు చెబుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆశిస్తున్న కొత్త నేతలు తెరపైకి వచ్చారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, యడ్యూరప్పలను కాంగ్రెస్‌, భాజపాలు ప్రకటించినా పోలింగ్‌ ముగిశాక అటు ముగ్గురు, ఇటు ఇంకో అభ్యర్థి పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. హంగ్‌ వస్తే అందరికీ ఆమోదయోగ్యుడైన నేతనే ఎన్నుకుంటారనే ఆశతో నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం చర్చకు రాగా భాజపాలో ఆమోద యోగ్యుడి అంశం తెరపైకి వస్తోంది.‘కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుంది. మరోమారు ముఖ్యమంత్రిగా నేనే బాధ్యతల్ని చేపడతా. నేను పోటీ చేసిన నియోజకవర్గాల్లో భారీ విజయాన్ని దక్కించుకుంటా’ అంటూ ఇన్నాళ్లూ ప్రకటిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం కాస్త తగ్గారు. తనకు ఇవే చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తాను వచ్చే ఎన్నికల వరకూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. సిద్ధరామనహుండి(స్వగ్రామం) లోనే ఉంటానని, కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనన్నారు.దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నాయకత్వం కోరుకుంటే ‘మంచిదే’నని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అధికారాన్ని చేపట్టి ఆదివారానికి ఐదేళ్లు పూర్తయింది. దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్‌ అరసు తరువాత ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసింది సిద్ధరామయ్య ఒక్కరే. కాకతాళీయంగా ఇద్దరూ మైసూరు జిల్లా నాయకులే. ఈ సందర్భంగా మైసూరు రామకృష్ణనగర్‌లోని తన నివాసంలో సిద్ధు విలేకరులతో మాట్లాడారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న నిర్ణయానికి శాసన సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు రానున్న లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ కన్నా ముందుగా ఎన్నికలు జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని జోస్యం చెప్పారు. మరోవైపు దళిత నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ జి.పరమేశ్వర్‌తోపాటు కోలారు ఎంపీ కె.హెచ్‌.మునియప్ప పేర్లు తెరపైకి వచ్చాయి. ఖర్గే, పరమేశ్వర్‌ కీలక పోటీదారులుగా మిగిలే అవకాశాలున్నాయి.మిషన్‌-150 అంటూ ఇప్పటి వరకూ ప్రచారం చేసుకుంటూ వచ్చిన యడ్యూరప్ప తాము 120-130 స్థానాలను దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను తాము విశ్వసించబోమని, ఎక్కువ సీట్లను దక్కించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి కుమరస్వామి ప్రకటించారు. అధికారం కోసం ఎవరి వద్దకూ వెళ్లేది లేదని ఆయన విస్పష్టంగా వెల్లడించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఒత్తిడిని అధిగమించేందుకు తన కుమారుడు నిఖిల్‌తో కలిసి కుమారస్వామి శనివారం పోలింగ్ ముగిసిన మరుక్షణమే రాత్రి సింగపూర్‌కు వెళ్లారు.

 జనతాదళ్‌ కీలకం?

 త్రిశంకు సభ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ స్పష్టం చేస్తుండటంతో అన్ని పార్టీల నాయకుల్లో గుబులు మొదలైంది. కన్నడ పీఠం ఎవరికి..? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని, హంగ్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు జేడీ(ఎస్‌) పార్టీ పైనే ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమైతే.. జేడీ(ఎస్‌) ఎవరితో చేతులు కలిపితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ప్రస్తుత రాజకీయాల్లో దళపతులు కింగ్‌మేకర్‌గా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లడం మరింత ఆసక్తిని రేపుతో్ంది.పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపేందుకే ఆయన సింగపూర్‌ వెళ్లినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ‘భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు కుమారస్వామి, దేవే గౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో చర్చలు జరిపేందుకే కుమారస్వామి సింగపూర్‌ వెళ్లి ఉంటారు. ఇక్కడే ఉంటే మీడియాకు తెలిసే అవకాశముంది కదా’ అని కుమారుస్వామి సన్నిహితుడొకరు చెబుతున్నారు.అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన సింగపూర్‌ వెళ్లినట్లు జేడీ(ఎస్‌) వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రికి ఆయన బెంగళూరుకు చేరుకుంటారని పేర్కొన్నాయి. ఏది ఏమైనా తాజా పరిస్థితుల్లో ఆయన సింగపూర్‌ ప్రయాణం మరింత ఉత్కంఠకు తెరలేపింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోతే కాంగ్రెస్‌, భాజపాలకు జనతాదళ్‌తో పొత్తు అనివార్యమవుతుంది. జనతాదళ్‌- బీఎస్పీ కన్నడ సీమలో భాగస్వామ్య పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల తరువాత పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కాంగ్రెస్‌ పార్టీతో కలసి నడవాలనే ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య కుదిరింది. గతంలో యడ్యూరప్పతో కలిసి కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అవకాశం వస్తే కుమారస్వామి మరోమారు యడ్యూరప్పకు దగ్గరయ్యే అవకాశం ఉందనేది రాజకీయ పండితుల అంచనా. భాజపా మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామి ప్రయత్నిస్తే కుమారుడనీ చూడకుండా ఆయనను కుటుంబం నుంచి వెలివేస్తానని దళపతి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ‘కాంగ్రెస్‌ విముక్త భారత్‌’ నినాదంలో భాగంగా, దక్షిణాదిన మరోమారు పాగా వేసేందుకు పొత్తు అవసరం భాజపాకు ఎంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను దక్కించుకుని, కేంద్రంలో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ పొత్తు అంతే అవసరం. ఒకవేళ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలనే అంశమై ఆయా పార్టీల నాయకులు రహస్య సమాలోచనలను చేస్తున్నారు. కాగా

జనతాదళ్‌తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు చాలా తక్కువే. 2008లోనూ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో కుమారస్వామి- యడ్యూరప్ప మధ్య సయోధ్య లేని విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్టీకి కనిపిస్తున్న మరో వ్యక్తి కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి వచ్చిన హెగ్డే పదునైన వాగ్దాటితో పాటు పార్టీలో యువ కార్యకర్తలను సమన్వయ పరిచే సత్తా ఉన్నవాడిగా గుర్తింపు పొందారు.కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు కాగా.. 222 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఏ పార్టీకైనా మెజారిటీ స్థానాలు 113 కాస్త తక్కువగా వస్తే... అప్పుడు స్వతంత్రులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మంగళవారం ఫలితాలు వెల్లడయ్యే దాకా వేచి చూడాల్సిందే.

Related Posts