YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఢమాల్ ... టమోత

ఢమాల్ ... టమోత

కర్నూలు, ఫిబ్రవరి 19,
మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధర.. ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో టమోటా 10 రూపాయలకు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు టమోటా ధర పూర్తిగా పడిపోవడంతో పత్తికొండ టమోటా మార్కెట్‌ను బంద్ చేశారు అధికారులు. వాస్తవానికి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ టమోటాకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లె తరువాత టమోటా పంట ను పత్తికొండ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు రైతులు. ఓ రైతుకు 4 ఎకరాల పొలం ఉంటే అందులో 3 ఎకరాల విస్తీర్ణంలో టమోటా పంటనే సాగు చేస్తారు రైతులు. అయితే దేశ వ్యాప్తంగా తుపానులు రావటంతో అక్కడ ఉన్న టమోటా పంటలు పూర్తిగా దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి కిలో టమోటా 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు ధర పెరగింది. దాంతో వినియోగదారులు హడలిపోయారు. అయితే రైతులు మాత్రం ఎప్పుడూ లేని ధర ఒక్కేసారి పెరగడంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో టమోటా ధర కిలో 50 రూపాయల నుండి మొదలై 120 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ లేని విధంగా టమోటాకు భారీ రేట్లు రావడం ఇదే మొదటిసారి. ఆరు నెలల పాటు మంచి రేట్లు ఉన్న టమోటా.. ప్రస్తుతం పూర్తిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పొలం నుంచి టమోటాలను మార్కెట్‌కు తరలిస్తే.. వాటి రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. దాంతో టమోటా పంట ను పొలంలోనే వదిలి వేస్తున్నారు రైతలు.
ఇక రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ను అధికారులు బంద్ చేశారు. మార్కెట్ బంద్ చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు.. మార్కెట్‌ను బంద్ చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయితే పత్తికొండ రైతుల కల టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కనీసం టమోటా పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని, రైతులు బాగుపడుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా టమోటా పంటకు రేట్లు లేక, మార్కెట్‌కు తరలించినా రవాణా ఖర్చులు కూడా రాక నడి రోడ్డుపై పారబోసిన సంఘటనలు ఉన్నాయి. గత నలబై సంవత్సరాల నుండి తాము ఎన్నికల్లో గెలిచిన వెంటనే పత్తికొండ టామోట్ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీ విషయాన్ని గాలికి వదిలివేయడం అలవాటుగా మరిదంటూ రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.

Related Posts