YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీకి ఆయిల్ ట్రబుల్

ఆర్టీసీకి ఆయిల్ ట్రబుల్

ఖమ్మం, ఫిబ్రవరి 26,
ఆర్టీసీ బస్సులు బయట బంకుల్లో డీజిల్‌ పోయించుకోవడాన్ని ఎప్పుడూ చూసి ఉండం. అటువంటిది ఖమ్మంలో గడిచిన రెండు, మూడు రోజులుగా ఈ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. డిపోల్లో డీజిల్‌ నిల్వలు నిండుకోవడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీలు బల్క్‌ ఆయిల్‌ ధరలు పెంచడమే దీనికి కారణమని ఆర్టీసీ అధికారులు సమర్థించుకుంటున్నారు. బయట బంకుల్లో డీజిల్‌ పోయించుకోవడం వల్ల లీటర్‌కు రూ.2.50కు పైగా ఆదా అవుతుందంటున్నారు. బంకుల వద్ద డీజిల్‌ పోయించుకోవడం ఆలస్యమవుతుండటంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారు. గంటల తరబడి బంకుల వద్ద బస్సులు వేచి ఉండాల్సి రావడంతో ఆక్యుపెన్సి రేషియో కూడా తగ్గుతోంది. ఈ ప్రభావం ఆర్టీసీ సంస్థపై పడుతోంది. స్వల్ప మిగులుకోసం చూస్తే సంస్థ నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. బంకుల వద్ద బస్సులు బారులు తీరి ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. బస్టాండ్‌కు సమీపంలోని బంకుల్లో బస్సులు బారులు తీరుతుండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.ఖమ్మం రీజియన్‌ పరిధిలో మొత్తం ఆరు బస్సు డిపోల కోసం వరంగల్‌, రాజమండ్రిల నుంచి డీజిల్‌ తెప్పిస్తుంటారు. డిపోల్లోనే బంకు ఏర్పాటు చేసి బస్సులకు ఆ డీజిల్‌ను వినియోగిస్తుంటారు. గతంలో బల్క్‌ కొనుగోలు ధరలు బయట బంకుల్లోని డీజిల్‌ రేట్ల మధ్య వ్యత్యాసం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఆ తేడా లీటరు డీజిల్‌ పై రూ. 2.50కు పైగా ఉండటంతో బల్క్‌ కొనుగోళ్లను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. బంకుల్లో లీటర్‌ డీజిల్‌ రూ. 94.57 లభిస్తుండగా బల్క్‌గా రూ.97లకు పైగా విక్రయిస్తున్నారు. రీజియన్‌ పరిధిలో 558 బస్సులుండగా రోజుకు 41వేల లీటర్లుకు పైగా డీజిల్‌ను వినియోగిస్తున్నారు. వీటిలోని 284 అద్దెబస్సులకు సైతం డిపోల్లోనే డీజిల్‌ కొడుతున్నారు. ఒకే సారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో అద్దెబస్సులు సైతం డిపోల్లోనే డీజిల్‌ పోయించుకునేవి.ఒక్కో ఆర్టీసీ బస్సుకు అది ప్రయాణించే దూరాన్ని బట్టి రోజుకు 100లీటర్ల డీజిల్‌ పడుతుంది. అద్దె బస్సు అయితే 200 డీజిల్‌ వినియోగిస్తారు. ఖమ్మం రీజియన్‌ పరిధిలో 274 ఆర్టీసీ, 284 అద్దె మొత్తం 558 బస్సులుండగా వీటికి రోజుకు సుమారు 41వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఖమ్మం డిపో పరిధిలో 76 ఆర్టీసీ బస్సులు, 74 అద్దె బస్సులకు 10వేల లీటర్ల డీజిల్‌ వాడుతున్నారు. మధిర డిపో పరిధిలో 26 ఆర్టీసీ బస్సులు, 32 అద్దె బస్సులు ఉండగా 4వేల లీటర్లు, సత్తుపల్లిలో ఆర్టీసీ 32, అద్దె బస్సులు 62లకు 7వేల లీటర్లు, భద్రాచలం 59 ఆర్టీసీ, 39 అద్దె బస్సులకు 9వేల లీటర్లు, కొత్తగూడెంలో 48 ఆర్టీసీ, 40 అద్దె బస్సులకు 6వేల లీటర్లు, మణుగూరులో 34 ఆర్టీసీ, 38 అద్దెబస్సులకు 5వేల లీటర్లు మొత్తంగా 558 బస్సులకు 41వేల లీటర్ల చొప్పున డీజిల్‌ రోజువారీగా వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.లక్షకు పైగా ఆదా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ సంస్థకు సొంత డీలర్‌షిప్‌ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఉద్యోగులు అంటున్నారు. ఒకవేళ ఆర్టీసీకి సొంత డీలర్‌షిప్‌ ఉంటే డీజిల్‌ భారం తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని డ్రైవర్లు చెబుతున్నారు. రోజుకు 500కి.మీ. మేరకు బస్సులను తిప్పి గంటల కొద్దీ బంకుల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts