YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

4 వేల కోట్లతో సరికొత్త పథకం మన ఊరు మన బడి ఎప్పుడు

 4 వేల కోట్లతో సరికొత్త పథకం మన ఊరు మన బడి ఎప్పుడు

నిజామాబాద్, ఫిబ్రవరి 26,
తెలంగాణలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ రూ.నాలుగు వేల కోట్లతో సరికొత్త విద్యాపథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం పెద్దఎత్తున ప్రభుత్వం చేపట్టబోతున్నది. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, కావాల్సిన ఫర్నీచర్‌, టాయిలెట్లు వంటి వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల తరగతులను అనుసంధానం చేస్తుంది. ఈ బృహత్తర విద్యాపథకం కోసం ఈ సంవత్సరం రూ.రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నాం'అని 2021, మార్చి 18న 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 'ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో 'మన ఊరు-మనబడి' అనే వినూత్న కార్యక్రమాన్ని క్యాబినెట్‌ ఆమోదించింది. దీంతో రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. నాణ్యమైన విద్య, నమోదు, హాజరు కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేయాలని సంకల్పించింది.'అని జనవరి 17న క్యాబినెట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం 'మన ఊరు-మనబడి' పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించింది. ఈనెల మూడున విద్యాశాఖ విధివిధానాలు ప్రకటించింది. ఇది జరిగి 22 రోజులైనా గ్రామీణ ప్రాంతాల్లో 'మన ఊరు-మనబడి', పట్టణాలు, నగరాల్లో 'మన ఊరు-మనబస్తీ' పథకాన్ని ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. మాటలు కోటలు దాటుతున్నాయి, పనులు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల ఉపసంఘం 2021, మార్చి 23న, ఏప్రిల్‌ 8న, జూన్‌, 17న పలుమార్లు భేటీ అయ్యింది. విధివిధానాలు రూపొందించి ప్రకటించింది. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు. నిధుల కొరత ఉన్నదా?, లేక వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం లేదా?అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇందుకోసం రూ.రెండు వేల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నెలరోజుల్లో ముగుస్తున్నది. ఇప్పటి వరకు ఆ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మనబడి పథకాన్ని ప్రకటించినా ప్రారంభించడం పట్ల చిత్తశుద్ధిని కనబరచడం లేదు. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కష్టమేనని అర్థమవుతున్నది. వచ్చే విద్యాసంవత్సరంలోనే పనులు జరిగే అవకాశమున్నది.మన ఊరు-మన బడి పథకం ద్వారా మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను తొలి దశలో ఎంపిక చేసింది. ఇందులో 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనుంది. పనులన్నీ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల భాగస్వామ్యంతో చేపడతారు. ఎస్‌ఎంసీ చైర్మెన్‌, హెడ్మాస్టర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్‌ను అప్పగించింది. పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఏసీడీపీ, జెడ్‌పీపీ, ఎంపీపీతోపాటు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌, నాబార్డ్‌, జిల్లా గ్రంథాలయాల సంస్థలు వంటి వాటి ద్వారా సమకూరుస్తారు. ఈ పథకం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహారీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు, డిజిటల్‌ విద్య అమలు వంటివి అభివృద్ధి చేయాలని సంకల్పించింది. కానీ ఈ పథకాన్ని ప్రారంభించలేదు. పనులు చేపట్టేందుకు టెండర్లు, పిలవడం, నిధులు విడుదల చేయడం వంటి వాటిపై విద్యాశాఖ అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ఇంకోవైపు 'మన ఊరు-మనబడి' పథకంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, హైదరాబాద్‌ జిల్లాలోని ఆలియా, మహబూబియా (బాలికల) ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నిర్మాణాల కోసం రూ.3.57 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఆ పాఠశాలల్లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Related Posts