YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో పోలీస్ దొంగ...

కర్నూలులో పోలీస్ దొంగ...

కర్నూలు, మార్చి 10,
కంచె చేను మేసినట్లు ఉంది కర్నూలు జిల్లా పోలీసుల పరిస్థితి. అవును.. హంతకులను పట్టుకోవాల్సిన పోలీస్.. హంతకులు పారిపోయేందుకు సహకరించడమే కాకుండా హత్యకు వేసిన కుట్ర భాగస్వామ్యం అయ్యారనే ఆరోపణలు కూడా రావడం జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో కర్నూలు పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో హత్యకు గురైన సుమలత కేసులో ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ పాత్ర ఉందని తేలడం జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. సుమలత హత్య కేసులో ప్రధాన నిందితులకు ఆవుకు పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాబా ఫక్రుద్దీన్ సహకారం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో పోలీసు వర్గాలు నిర్ఘాంత పోతున్నాయి.హత్యకు గురైన సుమలతతో బాబా ఫక్రుద్దీన్ సన్నిహితంగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాక సుమలత హత్య కేసులో ప్రధాన నిందితురాలు బొడ్డు సుజాత తో కూడా ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ సంబంధాలు నేర్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హత్యకు ప్రధాన కారకులైన బొడ్డు సుజాత, వసంత, రామకృష్ణ లను అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ పై కూడా కేసు నమోదైంది. పరారీలో ఉన్న బాబా ఫక్రుద్దీన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.మండల కేంద్రం అవుకులోని కొత్త కాలువ కాలనీలో సుమలత తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటుంది. గత ఐదు సంవత్సరాల క్రితం భర్త రాముడు చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇదే గ్రామానికి చెందిన సుజాతతో సుమలత కు పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన స్నేహంతోనే సుమలత తన వద్ద ఉన్న రూ. 6 లక్షలు సుజాతకు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, సుమలత ఇంటికి ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ తరచూ వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది. అయితే, సుమలత మరొకరితో కూడా సన్నిహితంగా ఉన్నట్లు తెలుసుకున్న ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్.. అది జీర్ణించుకోలేకపోయాడు.
ఇదే సమయంలో సుమలత స్నేహితురాలైన సుజాతతో ఫక్రుద్దీన్‌కు పరిచయం పెంచుకున్నాడు. సుజాతతో సన్నిహితంగా ఉంటూ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. అయితే, సుమలతకు సుజాతకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండడం, వారి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరుగుతుండడంతో సుజాత.. సుమలతను అంతమొందించాలని పథకం వేసింది. హత్యకు పథకం వేసిన సుజాత తన తమ్ముడు రామకృష్ణ, వసంత లతో కలిసి బాబా ఫక్రుద్దీన్ సహకారం తీసుకున్నారు. హత్య చేసిన అనంతరం ఎలా తప్పించుకోవాలో పోలీస్ అయిన బాబా ఫక్రుద్దీన్ వారికి క్రిమినల్ బ్రెయిన్‌తో సలహాలు ఇచ్చారు. తనతో చనువుగా ఉన్న సుమలత ఇతరులతో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ సుజాత ముసుగులో సుమలతను అంతమొందించేట్లు పథకం రచించాడు.ఇదిలాఉంటే.. 6 లక్షలు అప్పుగా తీసుకున్న సుజాతను డబ్బు తిరిగి చెల్లించాలని సుమలత ఒత్తిడి చేస్తూ వచ్చింది. దాంతో ఎలాగైనా సుమలతను అంతమొందిస్తే తనకు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదని సుజాత పథకం వేసింది. ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ సలహాలు, సూచనల మేరకు జనవరి 16న అర్ధరాత్రి నిద్రలో ఉన్న సుమలతను అత్యంత దారుణంగా నరికి చంపారు. అనంతరం హత్య నుండి బయటపడేందుకు మృత దేహం చుట్టూ కారంపొడి చల్లడం, పోలీసులకు ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సుమలతకు, సుజాతకు మధ్య ఉన్న సబంధాన్ని ఆరా తీశారు పోలీసులు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు అక్రమ సంబంధాలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్‌కు హత్యకు గురైన సుమలతతో పాటు సుజాతతో కూడా సంబంధం ఉన్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. సుమలత హత్యకు ముందు ప్రధాన నిందితురాలైన సుజాతతో బాబా ఫక్రుద్దీన్ జరిపిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయపడిన ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్.. పరారయ్యాడు. పరారీలో ఉన్న బాబా ఫక్రుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఆమె చరిత్ర అంతా ఇంతా కాదు.. కాగా, ఒక ఏఎస్ఐ.. మహిళతో వివాహేతర సంబంధాలు నేరిపి హత్య కేసులో ఇరుక్కోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సుమలత హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సుజాతకు గతంలో పలు నేరాలతో సంబంధాలు ఉన్నాయని తేలింది. పోలీస్ స్టేషన్లో సుజాతపై కేసులు కూడా ఉన్నాయి. సుజాత తన భర్త హత్య కేసుతో పాటు, న్యాయవాది బసవరాజు హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉంది. గుడ్డు సుజాత క్రైమ్ రికార్డు చూసి పోలీసులే నిర్ఘాంత పోతున్నారు.

Related Posts