YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

5 రూపాయిలకు పడిపోయిన టమాట

5 రూపాయిలకు పడిపోయిన టమాట

నిజామాబాద్, మార్చి 15,
మార్కెట్ మాయజాలం. ఒక రోజు పెరుగుతున్న ధర, మరో రోజు అమాంతం పడిపోతుంది. దీంతో సరుకుతో మార్కెట్‌కు వెళ్లిన రైతు విలవిలలాడుతున్నాడు. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నాడు. అసలు తమకు దక్కేది ఎంతో తెలియక సతమతమవుతున్నాడు. అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టి అనేలా ఉంది టమాట రైతు దుస్థితి. రోజురోజుకు క్షీణిస్తున్న ధరలతో రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. కిలో వందరూపాయలు పలికిన టమాట ధరలు.. నేడు అథపాతాళానికి పడిపోయాయి. గిట్టుబాటు ధర రాక పంటను రోడ్డుమీద పారబోస్తున్నాడు రైతు. సిద్దిపేట జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా టమాటాను భారీగా సాగుచేస్తున్నారు. దుబ్బాక ప్రాంతంలో భారీగా సాగైన టమాటాకు గిట్టుబాటు ధర మాత్రం దొరకడం లేదు. కిలో వంద రూపాయలకు పైగా పలికిన టమాటా ధర.. నేడు ఐదు రూపాయలకు పడిపోయింది. ఆ అయిదు రూపాయలకైనా అమ్ముదామంటే కొనే నాథుడే కరువయ్యాడు.దీంతో రైతుకు ఏం చేయాలో అర్థంకాక.. మద్దతు ధర దొరక్క.. పంటను రోడ్లపైన పారబోస్తున్నాడు. దుబ్బాక నుండి ముస్తాబాద్ వైపు వెళ్లే రోడ్డులో ఎక్కడ చూసినా టమాటా కుప్పలే కనిపిస్తాయి. మార్కెట్‌ మాయాజాలం ఒకవైపు.. వ్యాపారుల సిండికేట్‌ ఇంకోవైపు.. టమాటా రైతుకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. టమాటాకు ఎప్పుడు ధరలు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు రైతులు.పెట్టుబడి మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొద్దంతా ఎండలో కూర్చుని అమ్మినా పెట్రోల్‌ ఖర్చులు కూడా రావట్లేదంటున్నారు వ్యాపారులు. 20ఏళ్ల నుంచి దందా చేస్తున్న.. ఇంత దారుణంగా ఎన్నడూ లేదు. ఏంజేయాలో అర్థంకావడం లేదంటోంది టమాటా వ్యాపారి. కనీసం పెట్రోల్‌ ఖర్చులు కూడా రావట్లేదని చెబుతున్నారామె.

Related Posts