YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సిద్ధుకు సుప్రీం కోర్టులో ఊరట

 సిద్ధుకు సుప్రీం కోర్టులో ఊరట

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జోత్‌సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 30 ఏళ్ల కిందటి దోషపూరిత హత్య కేసు నుంచి సిద్ధూకు విముక్తి లభించింది. అయితే.. వ్యక్తిని గాయపర్చినందుకు గాను కోర్టు ఆయనకు రూ. 1000 జరిమానా విధించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. సిద్ధూకు జైలు శిక్ష పడకపోవడంతో ఆయన మంత్రి పదవి సేఫ్‌గా ఉండనుంది. సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధూ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1988 డిసెంబరు 17న పాటియాలాలోని ఓ రహదారి మధ్యలో వాహనాన్ని నిలిపిన ఘటనలో గుర్నాంసింగ్‌ అనే వ్యక్తికి సిద్ధూకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చి పరస్పర దాడి వరకూ వెళ్లింది. ఈ క్రమంలో గుర్నాంసింగ్‌పై సిద్ధూ చేయిచేసుకున్నారు. అనంతరం గుర్నాంసింగ్‌ మరణించారు. ఘటన జరిగిన సమయంలో సిద్ధూ వెంట ఆయన మిత్రుడు రూపీందర్‌ సింగ్‌ సంధు కూడా ఉన్నారు. గుర్నాంసింగ్‌ను సిద్ధూనే కొట్టి చంపారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చగా.. పంజాబ్‌, హర్యాణా హైకోర్టు సమర్థించింది. ఈ ఘటనను దోషపూరిత హత్యగా పేర్కొంటూ 2006లో సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సిద్ధూ జైలు శిక్షను నిలిపేసి బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. సిద్ధూ గాయపర్చినందువల్లే గుర్నాసింగ్ మరణించాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. గుర్నాంసింగ్‌ను గాయపర్చినందుకు రూ. 1000 జరిమానా విధించింది. సిద్ధూ స్నేహితుడు రూపీందర్ సింగ్‌ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. 

Related Posts