YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్

కోడ్ లాంగ్వేజ్  లో డ్రగ్స్

హైదరాబాద్, ఏప్రిల్ 5,
డ్రగ్స్ సప్లై వ్యవహారంలో కునాల్, వంశీధర్ రావుల పాత్ర ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. కునాల్ కు డ్రగ్స్ పెడలర్లతో లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడో వ్యక్తికి అర్థంకాకుండా పక్కాగా కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ వంటి కోడ్ పదాలు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు పబ్ లోకి రాగానే డ్రగ్ సేవిస్తున్న వారిని కునాల్ అనే వ్యక్తి కోడ్ లాంగ్వేజీ ద్వారా అలెర్ట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 142మంది పబ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి జాబితాను రిలీజ్ చేశారు. కాగా.. అందులో ఎంతమందికి డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉంది, డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఆబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం  ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో వందకు పైగా పబ్బులు ఉన్నాయి. అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు అనుమతిచ్చినట్లుగానే ఎక్సైజ్‌శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు  ఉండే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. గ్రేటర్‌ పరిధిలో  అర్ధరాత్రి 12 గంటల వరకు, వీకెండ్స్‌లో మాత్రం అర్ధరాత్రి  ఒంటిగంట వరకు అనుమతినిస్తారు. కానీ కొన్ని పబ్బులు  నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటి పబ్‌లపై ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.    సాధారణంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్‌లపైనా ఎక్సైజ్‌ అదికారులు నిఘా కొనసాగించాలి. తరచుగా తనిఖీలు నిర్వహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భా ల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని పబ్‌లపై ఆ మాత్రం కేసులు కూడా నమోదు చేయడం లేదు. మైనర్‌లను పబ్బుల్లోకి అనుమతించడం, నిర్ణీత వేళలను పాటించకపోవడం, సరైన లెక్కలు చూపించకుండా  ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు  చెప్పారు. డ్రగ్స్‌ వాడకంపై మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వాడకంపైరాడిసన్‌ బ్లూ హోటల్‌లో నమోదైన కేసు మాత్రమే మొట్టమొదటిది కావడం గమనార్హం. ఎక్సైజ్‌ శాఖ నిబంధనల మేరకు  పబ్‌లు అనే  ప్రత్యేకమైన కేటగిరీ లేదు. హోటల్, రెస్టారెంట్‌ సదుపాయం ఉన్న చోట పెగ్గుల రూపంలో మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌ శాఖ లైసెన్సు ఇస్తుంది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో బార్‌లను పబ్బులుగా  పిలుస్తారు.  ఆ సంస్కృతిలో భాగంగానే హైఫై బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు  పబ్‌లుగా కొనసాగుతున్నాయి’ అని ఓ అధికారి వివరించారు. ఈ పబ్బులన్నీ రూ.40 లక్షల బార్‌ లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతి పొందినవే కావడం గమనార్హం. ఫోర్‌ స్టార్‌ కంటే ఎక్కువ కేటగిరీకి చెందిన హోటళ్లలో మాత్రం 24 గంటలు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అనుమతినిస్తోంది. ఇందుకోసం హోటల్‌ నిర్వాహకులు సాధారణ బార్‌ లైసెన్సు ఫీజు రూ.40 లక్షలపై 25 శాతం అదనంగా  చెల్లించాలి. అంటే సుమారు రూ.14 లక్షలకుపైగా చెల్లించి  ప్రత్యేక అనుమతిని తీసుకోవాల్సిఉంటుంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌  ఈ కేటగిరీ కిందనే ప్రత్యేక అనుమతిపై 24 గంటల పాటు మద్యం విక్రయిస్తోంది. నగరంలో ఇలాంటి అనుమతి కలిగినవి 20కిపైగా ఉన్నట్లు అధికారులు  తెలిపారు.

సరదాగా మొదలై... వ్యసనంగా మారుతున్న డ్రగ్స్
మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌ రాడిసన్‌బ్లూ హోటల్‌లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు.ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్‌ఎస్‌డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్‌ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది.గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్‌ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్‌ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్‌ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడితే.. కౌన్సిలింగ్‌ ఇచ్చి కాపాడుకోవచ్చు.  
వ్యసనంగా మారిన డ్రగ్స్‌ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్‌ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.    ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్‌ న్యూరో సర్జన్‌ విభాగం అధిపతి డాక్టర్‌ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్‌ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు.ఆల్కహాల్‌తో డ్రగ్స్‌ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్‌ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్‌ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

Related Posts