YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సజ్జల దూరం... విజయసాయి దగ్గర..

సజ్జల దూరం... విజయసాయి దగ్గర..

విజయవాడ, ఏప్రిల్ 20,
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో చెలరేగిన అసంతృప్తి సెగలు ఇంకా పూర్తిగా చల్లారనే లేదు...అప్పుడే మరో పదవుల పందేరానికి ఏపీ సీఎం జగన్ తెరలేపారు. ఈ సారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల పందేరం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్నవారిని నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరచాలన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆశావహుల సంఖ్య అసంఖ్యాకంగా ఉండటంతో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న కసరత్తు ఓ కొలిక్కి చేరలేదు. నేడో రేపో కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో జగన్ కు అంతా తానై సహకరించిన రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని మాత్రం ఈ సారి దరిదాపులకు రానీయకుండా జగన్ నామినేటెడ్ పోస్టుల జాబితా రూపొందించడం నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న విషయంపై పూర్తిగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనే ఆధారపడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఉత్తరాంధ్రకే పరిమితమైన ఆయనను ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చి మరిన్ని బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలతో పార్టీ ప్రతిష్ట మసకబారిందని జగన్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలను అంచనా వేయడంలోనూ, అసమ్మతి రాగాలను అదుపు చేయడంలోనూ సజ్జల విఫలం కావడం వల్లే స్వయంగా తానే రంగంలోనికి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకే సజ్జలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డిని మరింత క్రియాశీలంగా పార్టీ వ్యవహారాలలో నిమగ్నమయ్యేలా చేయాలన్నది జగన్ ఉద్దేశంగా కనిపిస్తున్నది.
గతంలో జగన్ హస్తిన పర్యటన సందర్భంగా పీఎంతో అప్పాయింట్ మెంటు విషయంలో విజయసాయి రెడ్డి సఫలం కాలేకపోవడంతో ఆయన ప్రాధాన్యతను పార్టీలో తగ్గించినట్లు కథనాలు వచ్చాయి. వాటిలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా గత కొంత కాలంగా పార్టీలో విజయ సాయి రెడ్డికి పెద్దగా ప్రాధాన్యత అన్నది కనిపించలేదు. రాజకీయ సలహాదారు హోదాలో సజ్జలే అన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. మంత్రులను మించి ఆయన వివిధ శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించడం, విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం వంటివన్నీ సజ్జలే చూసుకుంటూ వచ్చారు. మంత్రులను డమ్మీలుగా మార్చి సజ్జలే అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తిన ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. సజ్జలను నియంత్రించడానికి ప్రయత్నించలేదు.
 అయితే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలతో సజ్జల వన్ మేన్ షో వల్ల జరిగిన నష్టం ఏమిటన్నది తేటతెల్లమవ్వడంతో ఆయన ప్రాధాన్యత తగ్గించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు విజయసాయి రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాయానికి రప్పించి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించుకోవడాన్ని బట్టి అర్థమౌతున్నది. మొత్తం మీద సీఎం జగన్ పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రాధాన్యతకు చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి జగనే తాను తానే జగన్ అన్న చందంగా వైసీపీలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత క్రమంగా ఆయన పాత్రను నామమాత్రం చేసిన జగన్...విజయసాయి స్థానంలో రాజకీయ సలహాదారుల ఉన్న సజ్జలకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయనను కాదని విజయసాయికి ప్రాధాన్యత పెంచాలని నిర్ణయించుకున్నారు.   నామినేటెడ్ పదవుల జాతరకు సజ్జలను దూరం పెట్టడంతోనే ఆయన ప్రభ ఇంక పార్టీలో మసకబారినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం అనంతరం పార్టీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడే అవకాశం ఉండొచ్చన్నది పరిశీలకుల అంచనా. గతంలోలా జగన్ మాటే శిరోధార్యం అన్న పరిస్థితి పార్టీలో కనిపించడం లేదనీ, పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలే అందుకు నిదర్శనమనీ చెబుతున్నారు. మరి పార్టీలో అసమ్మతిని, అసంతృప్తిని విజయసాయి రెడ్డి ఏ మేరకు నియంత్రించగలరన్నది రానున్న రోజుల్లో తేలుతుంది

Related Posts