YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఒక సభ... రెండు వ్యూహాలు

ఒక సభ... రెండు వ్యూహాలు

హైదరాబాద్, ఏప్రిల్ 20,
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిరాడంబరంగా జరుపుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఏడు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి అందుకు భారీ ఏర్పట్లనూ మొదలెట్టేసింది తెరాస పార్టీ. పనిలో పనిగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే...జాతీయ స్థాయి నేతగా బీజేపీయేతర పార్టీలను కలుపుకుని పోయేందుకు, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నేతగా ఆ ప్రయత్నాలను తాను ముమ్మరంగా చేస్తున్నట్లూ కేడర్ కు చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందు  వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలను ప్రగతి భవన్ కు ఆహ్వానించి వారితో బీజేపీ యేతర కూటమిపై చర్చించేందుకు సిద్ధమౌతున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు డీఎంకే నుంచి కణిమెళి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నుంచి ఒక అగ్రనేతనూ ఆహ్వానించినట్లు చెబుతున్నారు.  అయితే వీరిలో ఎవరెవరు వస్తారు, ఎవరు రారు  విషయంలో మాత్రం స్పష్టత లేదు.  
ఈ నెల 27న తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనుండగా  సరిగ్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందే ఈ భేటీ ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది. కేంద్రంలో మోడీని ఢీ కొనగలిగే బలమైన నేతగా తనను తాను పార్టీ కేడర్ ముందు ఫోకస్ చేసుకోవడం, అదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు తనకు ఉందని విపక్షాలకు తెలియజేయడం ద్వారా రాష్ట్రంలో వాటి దూకుడుకు కళ్లెం వేయడం. ఇలా ఒక్క భేటీతో రెండు ప్రయోజనాలనూ ఏకకాలంలో నెరవేరే విధంగా కేసీఆర్ ప్రగతి భవన్ భేటీకి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు.అయితే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ముంబై వేదికగా త్వరలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగనుందనీ, ఈ భేటీలో రానున్న ఎన్నికలలో ఐక్యంగా ముందుకు సాగడం, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా  శోభాయాత్రలపై జరిగిన దాడులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పటికే బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారనీ వెల్లడించారు.త్వరలో ముంబై వేదికగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుండగా  వేరుగా ఆ సదస్సుకు హాజరయ్యే పార్టీల నుంచి నేతలను కేసీఆర్ ఆహ్వానించడంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు బీజేపీయేతర కూటమికి తానే ఛాంపియన్ అని చాటుకోవడమే కారణమని విశ్లేషిస్తున్నారు. ముంబై భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేలే షో స్టీల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భేటీకి ఆహ్వానిస్తే మమతా బెనర్జీ లేఖలు రాస్తే...ఈ భేటీకి వేదికగా ముంబై ఎంపికైంది. దీంతో ఆ ఇరువురి ఆధ్వర్యంలోనే భేటీ జరిగిందనే అందరూ భావిస్తారు. దీంతో బేజీపీ యేతర ఫ్రంట్ ను లీడ్ చేసే నేతగా కేసీఆర్ కు గుర్తింపు లభించే అవకాశం ఉండదు. అందుకే ఆ సదస్సుతో సంబంధం లేకుండా బీజేపీ యేతర పార్టీల సీనియర్ నేతలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ ఏర్పాటు చేశారంటున్నారు. ఇంతకీ ముంబై భేటీకి కేసీఆర్ కు ఆహ్వానం ఉందా...ఒక వేళ ఉంటే వెళతారా అన్న విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేదు.

Related Posts