YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మళ్లీ పుంజుకుంటున్న లెఫ్ట్ పార్టీలు

మళ్లీ పుంజుకుంటున్న లెఫ్ట్ పార్టీలు

బెంగాల్, ఏప్రిల్ 21,
గత వారం బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ, బాలీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఊహించినట్లుగానే ఈ రెండు స్థానాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, బాలీగంజ్‌లో వామపక్షాలు రెండో స్థానంలో నిలవటం విశేషం. మరోవైపు, బీజేపీకి ఈ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. అసన్‌సోల్‌ ను కోల్పోవడమే గాక ఓట్లు కూడా గణనీయంగా కోల్పోయింది. నిజానికి, 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీలో ఈ క్షీణత ప్రారంభమైంది.బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో కొన్ని నెలల క్రితం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అసన్‌సోల్‌ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. ప్రముఖ టీఎంసీ నాయకుడు, బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా ముఖర్జీ మరణంతో బాలిగంజ్ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక్కడి నుంచి బాబుల్ సుప్రియోను పోటీకి దింపాలని టీఎంసీ నిర్ణయించింది. అలాగే అసన్‌సోల్‌ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా. రంగంలో దిగారు. ఐతే, ఈ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా బెంగాల్‌లో రాజకీయ లెక్కలు మారుతున్నట్టు కనిపిస్తోంది.బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం దక్షిణ కోల్‌కతాలో ఉంది. ఈ సీటులో బీజేపీ అభ్యర్థి కీయా ఘోష్ పోలైన ఓట్లలో కేవలం 12.8 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బాలీగంజ్ నియోజకవర్గంలో రెండవ స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో 20.50 శాతం ఓట్లు పొందింది. ఈ ఏడాది అది 7 శాతం తగ్గింది. విశేషం ఏమిటంటే ఈ ఉప ఎన్నికల్లో బాబుల్ సుప్రియో కేవలం 20,208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా ముఖర్జీ 75,359 ఓట్ల తేడాతో గెలుపొందారు. బాలీగంజ్‌ విధానసభ నియోజకవర్గంలో ఈ ఏడాది టీఎంసీ ఓట్లు 20 శాతం తగ్గాయి. ఇక ఈ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన సైరా షా హలీమ్‌కు అనూహ్యంగా 30.1 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 5.5 శాతం మాత్రమే. లెఫ్ట్ ఓట్ల శాతంలో ఈ పెరుగుదల నిజంగా ముఖ్యమైనది.అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటమిని ముఖ్యమైన పరిణామంగా చూడాలి. గతంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకోగా, టీఎంసీకి ఇక్కడ ఇది తొలి గెలుపు. తృణమూల్‌ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా 3,03,209 ఓట్ల తేడాతో చరిత్రాత్మక విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 51.16 శాతం ఓట్లు పొందిన బీజేపీ ఈసారి కేవలం 30 శాతం ఓట్లను మాత్రమే పొందింది. టీఎంసీ ఓట్ల శాతం 35.19 శాతం నుంచి 56 శాతానికి పెరగటం విశేషం.బీజేపీ బెంగాల్ యూనిట్ ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం కుదేలైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు సీనియర్ టీఎంసీ నాయకులను బీజేపీ తన వైపు తిప్పుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని అనిపించింది దాని ప్రచార సభలను చూసిన వారికి. కానీ ఆ పార్టీ అంచనాలు ఘోరంగా తలకిందులయ్యాయి. దాంతో ఓటమి తరువాత వలస నాయకులలో చాలా మంది తిరిగి టీఎంసీ గూటికి చేరుకున్నారు. పలువురు సిట్టింగ్‌ బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు.బీజేపీ రాష్ట్ర శాఖలో తీవ్ర అంతర్గత పోరు నెలకొంది. ఒకవైపు, టీఎంసీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పార్టీలోని సీనియర్లు అదే పనిగా నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, టీఎంసీ నుంచి వచ్చిన నేతలు పార్టీలో తమ అధిపత్యం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో బీజేపీ పట్ల ఓటర్లలో నెలకొన్ని అవిశ్వాసం కారణంగా రాష్ట్రంలో మద్దతును కోల్పోతోంది.మరోవైపు, టీఎంసీని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఘోరంగా విఫులమైంది. అధికార పార్టీని ఎదుర్కోగల పెద్ద ప్రణాళిక దానికి లేదు. టీఎంసీలో అంతర్గత పోరు కారణంగా బెంగాల్‌లోని మైనారిటీలు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. మైనారిటీలకు స్థానం కల్పించడంలో బీజేపీ నిరంతరం విఫలమవుతోంది. ప్రతిపక్షంగా బీజేపీ అధిష్టానం ఆ పార్టీని ప్రజలను దూరం చేస్తోంది. ప్రతి విషయంలోనూ కాషాయ పార్టీ కేంద్ర నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, బెంగాల్‌లో ఇటీవల జరిగిన హింసాకాండను సర్వే చేయడానికి బెంగాల్ యూనిట్ నుండి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న నిజ-నిర్ధారణ బృందాలను కేంద్ర బీజేపీ నాయకత్వం పంపింది.పార్టీలో నమ్మదగిన ముఖం ఒక్కటీ లేకపోవటంతో బెంగాల్ ప్రజలకు బీజేపీ దూరం అవుతోంది. అలాగే 2021 ఎన్నికల నుంచి నేటి వరకు టీఎంసీని ఇరుకున పెట్టే ప్రధాన సమస్య ఒక్కదాన్ని కూడా బీజేపీ లేవనెత్తలేకపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ప్రజాకర్షణ లేని నాయకుడు. మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కు మాస్ అప్పీల్ ఉన్నా అతని వ్యవహార శైలి నచ్చక పక్కన పెట్టారు.ఉప ఎన్నికల ఫలితాల ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ బెంగాల్‌లో బీజేపీ నాయకత్వం అపరిపక్వ విధానం ఈ ఓటమికి దారితీసిందని అన్నారు. పార్టీ పునరుద్ధరణకు కేంద్ర నాయకత్వ సహకారం అవసరమని కూడా ఆయన అన్నారు. ఈ ప్రకటన ద్వారా బెంగాల్‌ బీజేపీ అసలు సమస్య ఏమిటో అర్థమవుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడి తమ సహచరులను నమ్మడం లేదు..దాంతో అది కేంద్ర నాయకత్వంపై పూర్తిగా ఆధారపడింది.పైగా బెంగాల్‌లో బీజేపీ కరడుగట్టిన హిందుత్వంపై ఆధారపడి ఉంది. పార్టీలో చేరికలు కూడా శూన్యం. మరోవైపు, పార్టీ పునర్నిర్మాణంపై వామపక్షాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అదేవిధంగా, సీపీఎం తమ సాంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకు తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే, ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Related Posts