YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ తో జతకడతారా

కాంగ్రెస్ తో జతకడతారా

విజయవాడ, ఏప్రిల్ 23,
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది.మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని వైసీపీ నేతల దగ్గర ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డితో పీకే చర్చలు జరిపారట. మరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తనకంటూ ఓ పార్టీ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకోరని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ సూచనతో కాంగ్రెస్ పొత్తుకు సై అంటారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై పలువురు మంత్రులు, మాజీ మంత్రులు రకరకాలుగా స్పందిస్తున్నారు.వైసీపీ నాయకత్వంలో మాట్లాడకుండానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన చేసి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నాకే జగన్‌తో మాట్లాడవచ్చని పీకే అనుకున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీకే ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పొత్తుపై వైసీపీ నాయకత్వాన్ని ఒప్పించవచ్చని భావించి ఉంటారని కొందరు.. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని పీకే ఎందుకు చెప్పి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌లో చేరికపై ప్రశాంత్ కిషోర్ ఈరోజు సోనియాగాంధీతో సమావేశం ముగిసిన అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.
మాకు సలహాలు వద్దు
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నాయకుడే అన్నారు.ఇక, కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని ఎదిరించి నిలబడ్డ మొగోడు వైఎస్‌ జగన్ ఒక్కడే అన్నారు గుడివా అమర్‌నాథ్… 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులా..!? నవ్విపోతారు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న విషయం తెలిసిందే.. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో పీకే కీలక పాత్ర పోషించారు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యూహాలకు పదునుపెట్టిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు, తాజగా కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ బయటకు వచ్చింది… దాని ప్రకారం, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని.. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలిసివెళ్లాలని సూచించారు పీకే. ఈ ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

Related Posts