YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొడాలికి కోపం వచ్చిందా...

కొడాలికి కోపం వచ్చిందా...

విజయవాడ, ఏప్రిల్ 25,
కొడాలికి కోపమొచ్చిందా? అదేంటి.. చూడ్డానికి ఆయనెప్పుడూ గుస్సామీదున్నట్టే కనిపిస్తారుగా..? కొత్త కోపమేంటి అనుకుంటున్నారా? లేదండీ.. దీనికి వేరే కారణం ఉందట? 20రోజులుగా గుడివాడలో అడుగుపెట్టలేదట.. ఇంతకీ రీజన్‌ ఏంటో?వారం కాదు… పక్షం కాదు.. ఏకంగా 20 రోజులైంది కొడాలి నాని గుడివాడకొచ్చి. సొంత నియోజకవర్గానికి ఆయనెందుకు రావట్లేదు? ఇంతకీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటివరకూ ఏపీ కేబినెట్‌లో ఓ వెలుగువెలిగిన కొడాలి నాని.. ఇప్పుడు మాజీ అయ్యారు. అప్పట్నుంచి, అస్సలు లోకల్ జనాలకు కనిపించనే లేదు.ప్రత్యర్థులపై ఇంతెత్తున విరుచుకుపడే కొడాలి వాయిస్ ఎందుకు తగ్గింది. 20 రోజులుగా ఆయన ఎక్కడున్నారు…? గుడివాడంతా ఇప్పుడివే గుసగుసలు. కేబినెట్‌ రాజీనామా, కొత్తమంత్రి వర్గ కూర్పు కంటే ముందు నుంచే.. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి గుడివాడ జనాలకు కనీసం మొహం కూడా చూపించలేదట నాని. సాధారణంగా కుటుంబం హైదరాబాద్‌లో ఉండటంతో వారంలో రెండమూడు రోజులు అక్కడే ఉండేవారు, కానీ ఇన్ని రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో.. ఆయనకేమైంది? అనే చర్చ జోరందుకుంది.ఈ నెల 7న జరిగిన కేబినేట్ భేటీ తర్వాత .. అందరితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు నాని. ఆ మీటింగ్‌ కు కూడా నేరుగా హైదరాబాద్‌ నుంచే అమరావతికి వచ్చారు. అట్నుంచటే హైదరాబాద్ వెళ్లిపోయారు. 11 న జరిగిన మంత్రివర్గ విస్తరణకూ అలాగే చేశారు. దీంతో, కొడాలి తీరు చర్చనీయాంశమైంది. మంత్రి పదవి పోవడంతో పెద్దగా పనిలేదనే … హైదరాబాద్‌కు పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేబినెట్‌ నుంచి తప్పించారన్న కోపం కూడా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పదవి ఉన్నా… లేకున్నా ఎమ్మెల్యే గా ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. సీఎం జగన్ సైతం ప్రతిరోజూ ప్రజల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా కొడాలి నాని హైదరాబాద్ కి పరిమితం అవ్వడమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. తన మాటలతో సంచలనం సృష్టించే కొడాలి.. నియోజకవర్గ ప్రజలకు ఎందుకిలా దూరంగా ఉంటున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
విశ్వరూపం... అంటే ఇదేనా
మంత్రి పదవిలో లేకపోతే నా విశ్వరూపం చూపిస్తా’.. కొద్ది రోజుల క్రితం ఈ మాటలన్నది ఎవరో తెలుసా? గుడివాడ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కొడాలి నాని. వైఎస్ జగన్ కేబినెట్ పునర్వ్యస్థీకరణకు కొద్ది రోజుల ముందు నాని ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే జగన్ రెండో కేబినెట్లో కొడాలికి స్థానం దక్కలేదు. దానికి ఆయన మాట్లాడే బూతులు, చేసిన పనుల వల్లే కేబినెట్ లో కొనసాగింపు లభించలేదంటారు.మంత్రి పదవి పోయిన కొద్ది రోజులకు కొడాలి నాని ఓ పశువుల పాకలో పడుకుని ఏదో దీర్ఘాలోచన చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఒకటి మీడియాలో హల్ చల్ చేసింది. ఆ ఫొటోపై నెట్టింట జోక్ లు పేలాయి. ‘ఇక నీ గతి ఇంతే కొడాలి’ అంటూ, పశువుల్ని కాసుకో అని మరికొందరు నెటిజన్లు సలహా ఇచ్చారు. తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలో మట్టి మాఫియా చెలరేగి రెచ్చిపోవడం సర్వత్రా విమర్శలకు తావు ఇచ్చింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై మైనింగ్ మాఫియా హత్యా యత్నం చేసింది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అరవింద్ ని జేసీబీతో నెట్టి హత్యాయత్నం చేసింది. అయితే.. జేసీబీ నుంచి పక్కకు తప్పుకుని ఆర్ఐ అరవింద్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లేకపోతే ఆయన ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోయేవంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుని ఉండేదనే భయాలు వ్యక్తం అయ్యాయి.కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత గంటా సురేష్ ఆధ్వర్యంలో చాలా రోజులుగా రాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు యధేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్న మాట. రెండు రోజుల క్రితం తాసిల్దార్ ఆదేశాల మేరకు మట్టి మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన ఆర్ఐ అరవింద్ పై సురేష్ సోదరుడు కల్యాణ్ దాడి చేశాడు. జేసీబీతో ఆర్ఐ అరవింద్ ను తొక్కించే యత్నం చేయడం దుమారం లేపింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారుల సంఘం వెంటనే స్పందించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇటీవలే గుడివాడ తాసిల్దార్ పై దాడి చేసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ఆర్ఐపై హత్యా యత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.గుడివాడ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మట్టి మాఫియా దురాగతాలకు ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోత్సాహం ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశ్వరూపం చూపిస్తానన్న కొడాలి నాని మాటల వెనుక ఇలాంటి దారుణాలు చేయడమే ఉద్దేశం కావచ్చా? అంటున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. జూదం, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై అధికార, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. పైగా ఏపీలో ఏనాడూ కనీ వినీ ఎరుగని గోవా క్యాసినో సంప్రదాయాన్ని గుడివాడకు కొడాలి తీసుకొచ్చారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. క్యాసినోను కొడాలి కల్యాణ మండపంలో నిర్వహించడం, కోట్లాది రూపాయలు చేతులు మారడంపైనా ఆందోళనలు జరిగాయి.క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ కమిటీని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. కొడాలి నాని రాజకీయాల్లోకి రాక ముందు లారీల్లో డీజిల్ చోరీ చేసేవారని, లారీలు ఎత్తుకుపోయి ఈ స్థాయికి వచ్చారంటూ ఆ సమయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న లాంటి వారు దుమ్మెత్తిపోశారు. కొన్నాళ్ల క్రితం గుడివాడలో జరిగిన భూ కబ్జా వ్యవహారంలో కూడా కొడాలి నాని పరోక్ష పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ‘గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు’ పేరుతో మీడియాలో వార్తా కథనాలు కూడా వచ్చాయి.ఇలాంటివన్నీ చూస్తే.. కొడాలి నానికి మంత్రి పదవి అడ్డుగా ఉందని, అది కాస్తా లేకపోతే తన విశ్వరూపం చూపిస్తాననడం వెనుక ఇంత అర్థం ఉందా? అని అందరూ విస్తుపోతున్నారు. కొడాలి నాని విశ్వరూప ప్రదర్శనలో తొలి చర్యగానే రెవెన్యూ అధికారిపై హత్యా యత్నం జరగడం కావచ్చని అంటున్నారు. మట్టి మాఫియాతో మొదలైన కొడాలి ఆగడాలు ఇంకా ఎక్కడిదాకా వెళతాయో అనే భయం పలువురు స్థానికల్లో వ్యక్తం అవుతోంది

Related Posts