YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

వరుస నేరాల్లో గులాబీ నేతలు

 వరుస నేరాల్లో గులాబీ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 25,
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నేరాలలో ప్రమేయం ఉన్న సంఘటనలు వెలుగులోనికి రావడంతో రాష్ట్రంలో ఆ పార్టీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.అసలు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఎలాంటి నేరాల్లో బయటపడిందో ఒక సారి చూస్తే...అధికారం అండతో వారెంతగా బరితెగించారో అర్ధమౌతుంది. ఉదాహరణకు...ఓ నాలుగు సంఘటనలను ప్రస్తావిస్తే...నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్‌ 8వ తరగతి చదివే ఓ 15 ఏళ్ల  మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పరారీలో ఉన్న అతడి కోసం నిర్మల్ పోలీసులు గాలిస్తున్నారు. ఇటు తెరాస పార్టీ నుంచి సాజిద్ ఖాన్ ను బహిష్కరించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలస్యంగా వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటనలో సాక్షాత్తూ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనలో  మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పులపాలైన రామకృష్ణ  ఆత్మహత్య వెనుక ఎమ్మెల్యే కుమారుడున్నారనే ఆరోపణలున్నాయి.మరో ఘటనలో రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు గత ఏడాదిన్నరగా తమను వేధిస్తున్నారని పేర్కొంటూ  లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకుని  పెట్రోల్ పోసుకుని తల్లీ కుమారుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.మరో ఘటనలో పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ  బీజేపీ మజ్దూర్ సంఘ్  ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప  మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఇవే కాకుండా ఇంకా పలు సందర్భాలలో  ఆర్థిక, లైంగిక వేధింపులు, కబ్బాల వివాదాల్లో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో    టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర వివాదాల్లోకి తలదూర్చుతున్నారనడానికి  ఇవి కొన్ని ఉదాహరణలు.  ఇటువంటి నాయకుల కారణంగా రాష్ట్రంలో  టిఆర్ఎస్ పై, ఆ నాయకులపై   తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అసహనం వ్యక్తమవుతోంది.  ఇటువంటి వారి వల్ల ప్రజలలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. అధికారంలో ఉన్న పార్టీ అండదండలు మెండుగా ఉండటంతోనే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు టిఆర్ఎస్ పాలనపై రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉండగా, కొందరు పార్టీ నాయకుల తీరు పార్టీకి మరింత చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.  జనవరి   ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అంటే నాలుగు నెలల వ్యవధిలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చిన నాలుగు తీవ్ర నేర సంఘటనలు జరిగాయి. 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధింపులకు గురి చేయడం,  తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీకి చెందిన యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడేలా వేధించడం. ఈ నాలుగు ఘటనల్లోనూ టిఆర్ఎస్ నాయకులకుప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం, ప్రమేయం ఉండటతో ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంలో పార్టీపై ప్రతికూలంగా పడిందనడంలో సందేహం లేదు.    ఇప్పటికీ కోర్టు నోటీసులు పంపినా మంత్రి పువ్వాడపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక మరి కొన్ని సంఘటనల్లో సంబంధితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్న కేసులలో పోలీసుల దర్యాప్తు నమమాత్రంగా సాగుతోందనీ, నిందితులను పట్టుకోవడంలో వారు ఏ మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

Related Posts