YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీకి 100 కోట్ల స్థలం సీఎస్ సెలవులో ఉంటే మరి ఆ సంతకం ఎవరది

గులాబీకి 100 కోట్ల స్థలం సీఎస్ సెలవులో ఉంటే మరి ఆ సంతకం ఎవరది

హైదరాబాద్, మే 13,
తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా శాఖకు కార్యాలయం అవసరం వచ్చింది. హైదరాబాద్‌లోనే కేంద్ర పార్టీ ఆఫీస్ ఉందిగా.. ఇంకెందుకు కార్యాలయం అనే డౌట్ ఎవరికైనా రావొచ్చు కానీ టీఆర్ఎస్ నేతలకు మాత్రం రాలేదు. వారు వెంటనే హైదరాబాద్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఆఫీసుకు కార్యాలయం లేకపోవడం అవమానమనుకున్న ఆయన కూడా వెంటనే.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో దాదాపుగా రూ. వంద కోట్లు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చారు. వడ్డించేది.. వండేది టీఆర్ఎస్ వాళ్లే కాబట్టి.. అన్ని రకాల వ్యవస్థలు చకచకా ఆమోదం తెలిపేశాయి. ఇప్పుడు టీఆర్ఎస్‌కు హైదరాబాద్ జిల్లా ఆఫీసు అత్యంత విలువైన స్థలంలో నిర్మాణం కానుంది. షేక్ పేట మండలంలో సర్వే 935 చ.గ.ల స్థలాన్ని ఇచ్చారు. దీని విలువ దాదాపుగా వంద కోట్లు ఉంటుంది. షేక్ పేట అంటే బంజారాహిల్స్ .. ఎన్బీటీ నగర్‌లో ఈ స్థలం ఉంది. హైదరాబాద్ కలెక్టర్ మంగళవారం సిఫారసు చేశారు. మరుసటి రోజే సీసీఎల్ఏ ఆమోదించారు. తెల్లారేసరికి ప్రభుత్వం రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించేశారు. టీఆర్ఎస్ కార్యాలయానికి భూ కేటాయింపు జీవో కొత్త వివాదానికి తెరలేపింది. అసలే ప్రైమ్ ల్యాండ్ లో  టీఆర్ ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా కేంద్రానికి వంద కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రభుత్వం  ధారాదత్తం చేయడంపై సర్వత్రా నిరసనలు భగ్గు మంటుంటే.. ఆ జీవో జారీ చేసిన రోజు అంటే బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ సెలవులో ఉన్నారు. ఆయన సెలవులో ఉన్న రోజు ఆయన పేరు మీద జీవో విడుదల కావడం వివాదాస్పదమైంది. ఇలా దొంగ జీవోతో అధకార పార్టీకి విలువైన భూమిని కట్టబెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని కాంగ్రెస్ అభివర్ణిస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు, నాయకులు పలువురు ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారనీ, ఇప్పుడు నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అదీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయానికి అతి చేరువలో దాదాపు ఎకరం భూమిని పార్టీ జిల్లా కార్యాలయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారి జీవోద్వారా అప్పనంగా దోచి పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  టీఆర్ఎస్ భవన్‌కు దగ్గరలోనే మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయించడం వెనుక మతలబేమిటని ప్రశ్నిస్తోంది. అదీ సీఎస్ సెలవులో ఉండగా.. ఆయన పేరు మీద జీవో విడుదల చేసి మరీ భూమిని ధారాదత్తం చేయడం వెనుక రహస్యం ఏమిటని నిలదీస్తోంది.  సమీపంలోనే టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది. రాజు తల్చుకుంటే స్థలాలకు కొదవేముంటుంది.

Related Posts