YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జాతికి బుద్ధవనం ప్రాజెక్టు అంకితం

జాతికి బుద్ధవనం ప్రాజెక్టు అంకితం

నల్గొండ, మే 13,
గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో అద్భుత సృష్టి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. కృష్ణానది తీరంలో అపురూప కట్టడాలు. నాగార్జున సాగర్‌లో 274 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బుద్ధవనం’ ప్రాజెక్ట్‌ ప్రత్యేకతలివి. నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలో మహాద్భుతంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు  మే 14న ప్రారంభించనున్నారు.ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపాన్ని బుద్ధవనంలో నిర్మించారు. శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టేలా చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు.లుంబిని, సారనాథ్‌, బుద్ధగయ, కృషి నగర్‌ బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు. బౌద్ధ మతస్థులకు మరో పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా బౌద్ధ పర్యాటకులకు ఆకర్షించనుంది.బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులు ఏర్పాటు చేశారు. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా, ఆహ్లాదంగా కనిపిస్తోంది. చూపరులను ఇట్టే కట్టిపడేస్తోంది. మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు ఏర్పాటు చేశారు. రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు నిర్మించారు. మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు. నాలుగోది ప్రపంచ స్తూపాల పార్కు. శ్రీలంక వాసుల సహకారంతో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఐదో పార్కులో ఏర్పాటు చేశారు. ఏడో పార్కులో మహాస్తూపం నిర్మించారు. ఆరవ పార్కును ధ్యాన వనంగా, ఎనిమిదో పార్కును స్తూప వనంగా తీర్చిదిద్దారు.కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధ వనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో బుద్ధవనంలోనూ ఈ 22 రకాల చెట్లను పెంచుతున్నారు.సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు. హృదేలా గ్రామంలో సుజాతా దేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతివృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కింది భాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు.మహాస్తూపాన్ని 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్తూపాల్లో ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో శాతవాహనుల కాలంలో నిర్మించిన స్తూపానికి ప్రతిబింబంగా అవే కొలతలతో ఈ స్తూపం నిర్మించారు. విశాలమైన ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. స్తూపం కింది భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం ఉన్నాయి.005లో నాటి పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బౌద్ధ మత గురువు దలైలామా 2006లో అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేంత వరకూ బుద్ధవనం నిర్మాణ పనులకు కేంద్రమే నిధులు ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. దీంతో పనులు నిలిచిపోయాయి.2015 మే మొదటి వారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాగార్జున సాగర్‌లో ప్లీనరీ నిర్వహించింది. ఈ సమావేశం నిమిత్తం సాగర్‌కు వచ్చిన సీఎం కె చంద్రశేఖర్ రావు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధవనం అభివృద్ధికి అప్పటికప్పుడు రూ.25 కోట్లు కేటాయించారు. మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. నాటి నుంచి పనులు కొనసాగి ప్రాజెక్టు పూర్తయ్యింది.

Related Posts